Asianet News TeluguAsianet News Telugu

యజ్ఞం విష్ణు స్వరూపం

ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో 'వేల్చినవి' దేవతలందరికి చేరుతాయని విశ్వాసం.

Significance of Yagnam
Author
Hyderabad, First Published Feb 6, 2021, 1:52 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Significance of Yagnam

'యజ్ఞం' అనేది అనాదిగా వస్తున్న ఒక హిందూ సంప్రదాయం. వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అనగా యజ్ఞం విష్ణు స్వరూపంగా భావించవచ్చు. ‘యజ్ఞం’ అను శబ్దం ‘యజ దేవపూజయాం’ అనుదాతువు నుంచి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం.

మన దేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో 'వేల్చినవి' దేవతలందరికి చేరుతాయని విశ్వాసం.

యజ్ఞ విధానం:- వైదిక యజ్ఞంలో అధ్వర్యుడు ప్రధాన అర్చకుడు. అతని అధ్వర్యంలో అన్ని యజ్ఞ కార్యక్రమాలూ జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక మంది అర్చకులు, పండితులు ఉంటారు. వేద మంత్రాలు చదువుతారు. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువగాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాల నుంచి కొన్ని సంవత్సరాల వరకూ జరుగవచ్చు.

యజ్ఞాల్లో భాగంగా.. అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం, రాజసూయ యాగం,  సర్పయాగం, విశ్వజిత్ యాగం.. వంటి యాగాలున్నాయి.

ఇతిహాసాలలో :- కర్దమ ప్రజాపతి కుమారుడు ఇలుడు, అశ్వమేధం నిర్వహించి, పురుషత్వాన్ని తిరిగి పొందాడు. శ్రీరాముడు రావణ సంహారం తరువాత అయోధ్యకు పట్టాభిషిక్తుడై అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. మహాభారతంలో జనమేజయుడు సర్పయాగం నిర్వహించాడు.

యజ్ఞాలు - రకాలు :- యజ్ఞాల్లో ఆరు రకాలు ఉన్నాయి. 

1. ద్రవ్యయజ్ఞం: ద్రవ్యాన్ని న్యాయంగా, ధర్మంగా ఆర్జించాలి. ఆర్జించిన ధనం ధర్మకార్యాలకు వెచ్చించాలి.
2. తాపయజ్ఞం: జ్ఞానాగ్నితో ఆత్మను తపింపచేసి, పునీతం, తేజోవంతం చేయడమే పవిత్రమైన తాపయజ్ఞం.
3. స్వాధ్యాయయజ్ఞం: ఏ విద్యనైనా సరే, కేవలం అధ్యయనం చేయటమే కాకుండా, అర్థం చేసుకుని లోకకల్యాణానికి వినియోగించడమే స్వాధ్యాయయజ్ఞం.
4. యోగయజ్ఞం: యమ, నియమాదులతో మనస్సుపై పట్టు సాధించి, మానసిక శక్తి సంపాదించటమే యోగయజ్ఞం.
5. జ్ఞానయజ్ఞం: మనిషి తానెవరు? ఎందుకు పుట్టాడు? ఏం చేయాలి? అని ఆలోచించి, తపించి ఆత్మదర్శనానుభవం పొందాలి. అదే జ్ఞానయజ్ఞం.
6. సంశితయజ్ఞం: తనలోని కామక్రోధమద మాత్సర్యాలను జయించి, నియమబద్ధంగా కర్మాచరణ చేయడమే సంశితయజ్ఞం.

యజ్ఞాలలో మరో మూడు రకాలు ఉన్నాయి. 1. పాక యజ్ఞాలు 2. హవిర్యాగాలు 3. సోమ సంస్థలు
 
పాక యజ్ఞాల్లో 7 విధాలు ఉన్నాయి. 1. ఔపాసన, 2. స్థాలీపాకము, 3. వైశ్వదేవము, 4. అష్టకము, 5. మాస శ్రాద్ధము, 6. సర్పబలి, 7. ఈశాన బలి.

హవిర్యాగాలు.. వీటిలో కూడా 7 రకాలున్నాయి. 1. అగ్నిహోత్రాలు, 2. దర్శపూర్ణిమాసలు, 3. అగ్రయణం, 4. చాతుర్మాస్యాలు, 5. పిండ, పితృ యజ్ఞాలు, 6. నిరూఢ పశుబంధం, 7.  సౌత్రామణి.

సోమ సంస్థలు.. వీటిలో ఏడు రకాలు ఉన్నాయి. 1. అగ్నిష్టోమం, 2. అత్యగ్నిష్టోమం, 3. ఉక్థము, 4. అతిరాత్రము, 5.       ఆప్తోర్యామం, 6. వాజపేయం, 7. పౌండరీకం.

యజ్ఞం వల్ల ఫలితాలు:- యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి, స్వచ్చతకు దారితీస్తాయి. దీనివల్ల అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఏర్పడవు. కనుక యజ్ఞ కర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఇల్లు, పరిసరాలు బాగుపడతాయి. చుట్టుపక్కల ప్రజలందరూ లబ్ధి పొందుతారు. పంటలు సమృద్ధిగా పండుతాయి. పశుపక్ష్యాదులు బాగుంటాయి. అంటువ్యాధులు వ్యాపించవు. అనారోగ్యాలు దరిచేరవు. అందుకే మన ఇతిహాసాలు, పురాణాల్లో హోమాలు, యజ్ఞాల ప్రస్తావన తరచుగా కనిపిస్తుంది.

మనకు హాని చేసే సూక్ష్మక్రిములు నశిస్తాయి. అంతే కాదండీ ఈ అగ్ని హోమాల్లోని భస్మంతో ఔషధాలు తయారుచేయొచ్చు. యాగాలు చేసిన తర్వాత వచ్చే భస్మాన్ని పంట భూముల్లో చల్లితే ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పొగని మనం పీల్చడం వల్ల లోపలి అనారోగ్యాలు నయమవుతాయి. వర్షాభావం, మితిమీరిన ఎండలు లాంటి వాతావరణ అసమతుల్యత లేకుండా పొలాలు సస్యశ్యామలంగా ఉండి, దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే యజ్ఞం జరిగే ప్రదేశం ఉండాలని, యజ్ఞం జరిగాక మిగిలిన బూడిదను తీసుకోవాలని చెబుతారు.

ఇటీవల కాలంలో యజ్ఞం చేసేవారు అరుదైపోయారు. ఎప్పుడో నూటికికోటికి ఒకసారి యజ్ఞం మాట వినిపిస్తుంది. కానీ, ఇది సరికాదు. యజ్ఞం వల్ల ఒనగూరే లాభాల గురించి తెలిసిన తర్వాత అయినా యజ్ఞ కర్మ నిర్వహించడానికి ముందుకు రావాలి. మనం యజ్ఞయాగాదులు చేయడమేంటి..? మనం రాజుల కాలానికి వెళ్తున్నామా అనే అపోహ నుంచి బయటపడాలి. యజ్ఞాలు నిర్వహిస్తే, మనం, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. యంత్రాలు, వాహనాల వల్ల పేరుకుపోతున్న కాలుష్యాన్ని కొంతయినా నిరోధించగల్గుతాం. యజ్ఞయాగాదులు నిర్వహించడం ద్వారా దేవరుణం తీర్చుకున్నట్టు అవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఒకరకంగా దేవ రుణం తీర్చుకోవడం అంటే, మనకు మనం మేలు చేసుకోవడమే అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios