అన్నదానం విశిష్టత

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు. అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి. 

Significance Of Annadhanam

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Significance Of Annadhanam
        
                నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
                నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ|
                ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
                భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ !


                అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే|
                జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి !


అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు. అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞత పూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతోపాటు ఉండే అనేకానేక జీవులకు బలిభుక్కులు సమర్పించి భోజనం చేసినవారికి, అతిథి అభ్యాగతి సేవ, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి అన్నప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం.

అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషి ఆశకు అంతులేదు... అదుపు అంతకన్నా ఉండదు, ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు. ఆకలిగొని ఉన్నవారికి అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు.


భగవద్గీతలో  శ్రీ కృష్ణుడు అర్జునునితో అంటాడు...           

                     శ్లో: "అన్నాద్భవన్తి భూతాని పర్జన్యా దన్నసంభవః 

                                            యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః "

తాత్పర్యం :- ప్రాణులు అన్నము వలన కలుగు చున్నవి. అన్నము మేఘము ( వర్షము ) వలన కలుగు చున్నది. మేఘము ( వర్షము ) యజ్ఞము వలన కలుగు చున్నది. ఇట్టి యజ్ఞము కర్మ వలన కలుగు చున్నది.

త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాదులు తపస్సుల ద్వారా మానవులు మోక్షం పొందారు. కలియుగంలో దాన ధర్మాలు, దైవారాధన, నామ పారాయణ, నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్షమార్గాన్ని దైవం ప్రసాదించాడు. దానధర్మాలు ఎవరికున్నంతలో వారు దానం చేసుకోవచ్చు. ఈ దానం చేసేది కూడా మనస్ఫూర్తిగా చేయాలి. ఆడంబరాలకు పోనవసరం లేదు. దానాలు ఎన్నో రాకాలుగా ఉన్నాయి, దానాల్లో కూడా అన్నదానం, వస్తద్రానం, జలదానం గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవన్నీ చాలా విశిష్టమైనవి. మనిషిని పూర్తిగా సంతృప్తిపరచేది అన్నదానము. దాహార్తిని తీర్చేది జలదానం. ముఖ్యంగా వేసవికాలంలో బాటసారుల దాహాన్ని తీర్చటం ద్వారా వారికి మనమెంతో మేలుచేసిన వారమవౌతాం. వస్తదానం చేస్తే సాక్షాత్తూ ఆ భగవంతుడికే వస్త్రాన్నిచ్చిన పుణ్యం కలుగుతుంది. ఎండ, వాన, చలినుండి పేదలకు కాపాడిన తృప్తీ మనకు దక్కుతుంది.

మనం చేసే దానంలో స్వార్థం లేకుండా ఏ ఫలితం ఆశించకుండా చేస్తే ఆ దేవుడే దానాన్ని గ్రహించడానికి వస్తాడని అంటారు. కర్ణుడు, బలిచక్రవర్తి మొదలైనవారి దగ్గరికి భగవంతుడే యాచకుడిగా వచ్చి దానం స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదించినట్టు పురాణ, ఇతిహాసాల ద్వార మనకు తెలుస్తుంది. ఒక మనిషి మరణించినా అతడు చేసిన దానధర్మాల వలన ఆజన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. దానగుణం లేని మనిషికి మోక్షం కలగదు.  ప్రత్యుపకారము ఆశింపక చేసే దానం అత్యున్నతమైంది. ఆకలితో ఉన్నవారికి అనాధలకు, పేదలకు, రోగులకు, వికలాంగులకు, అన్నవస్త్ర ఓషదులు మొదలైనవి లేనివారికి దానం చేస్తే దానిని పాత్రత దానము అనబడును.

అన్న దానం చేయడంలో ఏ మాత్రం పక్షపాత వైఖరిగాని 'పరతమ' భేద వైఖరి అస్సలు ఉండ కూడదు, చూపకూడదు. సంపద గలవారికి, అధికారం గలవారికి, బందుమిత్రులకు ప్రత్యేకంగా ఆతిధ్యం ఇస్తూ పేదవారిని తక్కువ చేసి చూస్తే అది అపాత్ర దానం అవుతుంది. బందుమిత్రులనే ప్రీతిలేకుండా ఉండి ఆర్ధిక స్థోమత లేని, శారీరక శక్తి లేనివారికి వృద్దులకు, ఆభాగ్యులకు సాక్షాత్తు భగవంతునికే అన్ననివేద సమర్పిస్తున్నామన్న భావన చెందుతూ మనస్పూర్తిగా  అన్నదానం చేస్తే ఆ పుణ్యఫలం రెట్టింపౌతుంది. పేదవారిని పక్కనబెట్టి అయినవారికి ముందుగా వడ్డిస్తే అన్నదాన పుణ్యఫలం లభించదు. అన్నదానం అంటేనే మనతో ఏ బంధం లేనివారు, నిరుపేదలను "దరిద్ర నారాయణులు" భగవంతునిగా భావించి చేసే మహత్కార్యం ఇది. అన్నదానం జరిగే చోటకు భగవంతుడు పేదవారిగా రూపం దాల్చి వస్తాడు అని పురాణ ఆధారాలున్నాయి.

ఉన్నోడికి అన్నం పెడితే పెట్టిన వారి మేలు కోరుతాడో లేదో తెలియదుకాని లేనివాడికి పట్టెడు అన్నం ప్రేమతో పెడితే వారి  దేహాత్మలోని పరమాత్మ సంతృప్తి చెంది వారు వేద ఆశీర్వచానాలు ఇవ్వకున్నా అంతకుమించి దీవిస్తారు. మన పేరు వారికి తెలియకున్ననూ వారంటారు... ఏ తల్లిదండ్రులు కన్నబిడ్దో మా అయ్యా, మా దొర, మా దేవుడు కడుపునిండా కమ్మని అన్నం పెట్టించాడు ఆయన కడుపు సల్లంగుండా, వాళ్ళ భార్య పిల్లలు సల్లంగుండా, వాడ సల్లంగుండా, వంతన సల్లంగుండా అని నిండు మనస్సుతో దీవిస్తారు. నిజంగా ఆ దీవెనలు దాతకు జీవిత పర్యంతమే కాదు వచ్చే జన్మకు ఆ పుణ్యఫల దీవెనలు సంప్రాప్తిస్తాయి. ఈ అన్నదాన కార్యాక్రమానికి ఎదో రకంగా సహాయపడిన ప్రతి ఒక్కరికి ఆ పుణ్యఫలం లభిస్తుంది. భగవద్గీతలో కృష్ణ్భగవానుడు యజ్ఞ దాన తపోరూపములైన కర్మలను ప్రతిఫలాపేక్ష లేకుండా తప్పక ఆచరించవలెనని చెప్పాడు.

మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో నీవు అనేక దానాలు చేసావని అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి ఎప్పుడైనా అన్నదానం చేసావా?’’ అనడిగాడు. దానికి సమాధానం లేదు. నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. 

‘‘పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?’’ అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు ‘‘అవును, ఓ బీదవాడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను అని చెప్పాడు.  అన్నదానం చేసే ఇంటిని చూపించిన నీ వేలిను నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది. 

చాలా మంది అన్నదానం చేయడం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే ప్రశ్నకు మనస్సులో మేదాలాడే ప్రశ్నలెన్నో! అన్నదానం చేయడంలో ఒక పరమార్ధంతో పాటు ఆనందం ఉన్నది. ఇది కేవలం ఆహారం అందించడమే కాదు. భౌతిక శరీరాన్ని ‘అన్నమయ కోశం లేదా  ఆహార శరీరం అని పిలుస్తాము, ఎందుకంటే ఇది ఆహార పోషకాలతో కూడి ఉన్నది. అన్నదానం చేస్తే వారికి శరీరాన్ని అందిస్తునట్లే. ఆహారం పట్ల కొంత  స్పృహని , అవగాహనని  మీలో కలుగచేయడానికి అన్నదానం మీకొక గొప్ప అవకాశం. మీరు దానిని ఆహారంగా మాత్రమే చూడొద్దు, అది జీవితం. మీ ముందు ఆహారం వున్న ప్రతి సారీ అది వాడిపడేసే పదార్ధంలా కాకుండా అది జీవం అని అర్థం చేసుకోవాలి. 

మీ జీవితాన్ని ఉన్నతం చేసుకోవాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఆహారాన్ని, నీటిని, గాలిని, భూమిని ఒక జీవంగా చూడాలి, ఎందుకంటే మీ శరీర నిర్మాణానికి ఇవే ముఖ్యమైన పదార్థాలు. మీరు వీటిని జీవాధారంగా ఆశ్రయిస్తే అవి మీ శరీర నిర్మాణంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తాయి. అలాగాక మీరు వాటిని ఒక పదార్ధంగా  చూస్తే మీ వ్యవస్థ మార్కెట్ లా తయారౌతుంది. ప్రేమ, అంకిత భావంతో వడ్డించి అన్నదానం చేయడం ద్వారా మీకు ఎదుటి వారితో ఒక లోతైన సంబంధం ఏర్పడుతుంది. మీరు దీనిని గొప్ప అంకితభావంతో చేయాలి. ఎందుకంటే దీని ద్వారా ఒకరికి జీవితాన్నిచ్చే అవకాశం మీరు పొందుతున్నారు కాబట్టి.  

భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో ఇతర పక్షులకో, ప్రాణులకో పెడతారు. ఇలా చేయడం వలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాల నుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు.
ఇలాంటి విషయాలు పాటిస్తుంటే మనకు మన ఇంటిల్లిపాదికీ ఆయురారోగ్యాలకి ఎటువంటి లోటూవుండదు. అందరి ఆలోచనలు సన్మార్గంలో నడుస్తాయి. తినే పదార్ధాలని వృధాచేయకుండా సద్వినియోగం చేస్తూవుంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యం మనింట్లో ధాన్యరాసుల్ని కురిపిస్తుంది. 

అలక్ష్యం చేస్తే భుక్తి కోసం వెంపర్లాడక తప్పని పరిస్థితిని చవిచూడవలసి వస్తుంది. మనిషి పుట్టేప్పుడు ఏమి తీసుకురాడు, ఈ మధ్యకాలంలో ఏం సంపాదించినా, ఎంత కూడబెట్టినా పోయేటప్పుడు ఎవరూ ఏమి తీసుకువెళ్ళరు. కేవలం మంచి చెడు కర్మ ఫలితాలు తప్ప. భగవంతుడిచ్చిన సంపదలో మనిషి బ్రతికి ఉన్నన్ని రోజులు " అహంబ్రహ్మాస్మి"భావనతో తనలో దైవత్వాన్ని అలవరచుకుని తనకు కలిగినంతలో సాటి జీవులకు, ప్రాణులకు దానధర్మాలు చేయాలి. "క్షుద్బాద" ఆకలి అనేది మనకు ఎలా ఉంటుందో ఎదుటివారి ఆకలి కూడా అలాంటిదే అని గ్రహించే స్థాయికి 'స్థితి' కి రావాలి. ఆకలి బాధ అనేది అందరికీ ఒకేలాగే ఉంటుంది కనుక సాటివారి ఆకలి తీరుద్దాం. అన్నాన్ని గౌరవిద్దాం.. నలుగురిని ఆదరిద్దాం…తృప్తిగా జీవిద్దాం జై శ్రీమన్నారాయణ.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios