Asianet News TeluguAsianet News Telugu

తల్లి ప్రేమకు చిహ్నం ఈ గరుడ పంచమి

తల్లి ఋణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి, అనుసరించాలి. నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి.

Significance and Benefits of Garuda Panchami
Author
Hyderabad, First Published Jul 25, 2020, 8:34 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Significance and Benefits of Garuda Panchami

శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో " గరుడ పంచమి" ఒకటి. గరుత్మంతుడు సూర్యరధసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది. గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్రమధనంలో " ఉచ్పైశ్రవం" అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు , వినతల కుమారుడు గరుడుడు. 

ఓ రోజు వినత ఆమే తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుఱ్ఱాన్ని చూసారు. కద్రువ , వినతతో గుఱ్ఱం తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని చెప్పగా, వినత గుఱ్ఱం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరు ఓ పందెం వేసుకొన్నారు, గుఱ్ఱపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయలని, గుఱ్ఱం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయలని పందెం.

కద్రువ తన కపటబుద్దితో తన సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా . దానికి వారెవ్వరు అంగీకరించలేదు. కోపగించిన కద్రువ " జనమేజయుని సర్పయాగంలో నశించాలని" శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు. కొద్దికాలం తరువాత గర్బవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బైటకురాగానే " అమ్మానీ తొందరుపాటువలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కాని నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు" అని చెప్పి , సూర్యభగవానుడి రధసారధిగా వెళ్ళిపోయాడు. 

కొద్దికాలం తరువాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం, తల్లి ఋణం తీర్చుకోవాలని, ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు. ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు. ఈ సంగతి తెలిసినఇంద్రుడు భయపడి. అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు. దేవతా శ్రేష్టులంతా గరుత్మంతుడితో రాత్రింబవళ్లు యుద్ధం చేశారు. 

పెట్రేగిపోయిన గరుడుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి , తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు. వసువులు, రుద్రులు, అశ్వనీ దేవతలు, కుబేరుడు, వాయువు, యముడు అందరినీ ఎదుర్కొని ఓడించి అమృతాన్ని సమీపించాడు. అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. గరుత్మంతుడు అమృతం తీసుకొనిపోతుండగా... విష్ణువు అతడిని సమీపించి ‘‘నీ విజయ సాధనకు మెచ్చాను, ఏమి కావాలో కోరుకో’’ అన్నాడు. ‘‘నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి’’ అంటాడు గరుత్మంతుడు. తనకు వాహనంగా, జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు.
 
ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడాడు. ‘‘అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు. నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో..! అమృతం సేవిస్తే వారు జయించలేని వారవుతారు. దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా.. బహుమతిగా ఇస్తా’’ అని అన్నాడు. ‘‘నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగకముందే నువ్వు వెళ్లి దానిని దొంగిలించు. మనిద్దరి కోరికలు నెరవేరతాయి’’ అని అనగానే.. అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు.
 
గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి పాములకు ఆ పాత్రనిచ్చి.. ‘‘చాలా శ్రమపడి తెచ్చాను. మీరు తృప్తిగా ఆరగించి అమరులవ్వండి’’ అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకుని వాయు మనోవేగాలతో ఉడాయించాడు. నియమనిష్టల పేరుతో.. పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధన పెట్టి ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం. తల్లి ఋణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి, అనుసరించాలి. నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి.

గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి బియ్యంపోసి, వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్టించి, పూజచేసి, పాయసం నైవేద్యం పెడతారు. మరి కొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమగల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది.

తిరుమ‌ల‌లో జూలై 25వ తేదీ శ‌ని‌వారంనాడు గరుడ పంచమి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకొని శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయ‌కుల మండ‌పంలో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడ వాహ‌నాన్ని అధిరోహించ‌నున్నారు. ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.


 

Follow Us:
Download App:
  • android
  • ios