కరోనా కాలం - రోహిణి కార్తె - సర్వేజనా: సుఖినోభవంతు
రోహిణి కార్తె ఫలితంగా ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువ మట్టి కుండ నీళ్ళు త్రాగడం, మజ్జిగా, పండ్ల రసాలు, కొబ్బరినీళ్ళు, నిమ్మరసం, రాగి జావ, ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
రోహిణి కార్తె వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూనే ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్ద మానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు ఆదరగోడతాయి.
ఈ సంవత్సరం రోహిణి కార్తె ఏలా ఉంటుందో గమనిద్దాం, తేదీ మే 25 సోమవారం నుండి 8 జూన్ సోమవారం 2020 వరకు 15 రోజుల పాటు రోహిణి కార్తె ఉంటుంది. పంచాంగం ప్రకారం ఈ రోహిణి కార్తె సోమవారం రోజు ఉదయం 6:39 నిమిషాలకు రవి నిరయన రోహిణి కార్తె ప్రవేశం చేస్తుంది. ప్రవేశ సమయంలో ఆరుద్ర నక్షత్రం, మిధునలగ్నం, వరుణ మండలం, పాదజలరాశి, పుం-స్త్రీయోగం, మండూక వాహనం, రవ్యాది గ్రహములు వాయు, సౌమ్య, జల, దహ, రస, జలనాడీచారము మొదలగు శుభాశుభయోగాములచే 25, 26 ఎండ, వేడి అధికం, 27, 28 ఖండ వర్షయోగములు, 29 వాతావరణంలో మార్పు, 30, 31 మేఘ గర్జనలు, 1, 2 రాత్రులందు గాలులు, 3 వాతావరణంలో మార్పు, వాయుచలనము, ఇతరత్రా జల్లులు 6 వాతావరణంలో మార్పులు, 7 మేఘాడంబరము, వాయు చలనము స్వల్ప జల్లులు పడినను ఎండ, ఉక్కపోత అధికంగా ఉంటుంది.
రోహిణి కార్తె ఫలితంగా ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువ మట్టి కుండ నీళ్ళు త్రాగడం, మజ్జిగా, పండ్ల రసాలు, కొబ్బరినీళ్ళు, నిమ్మరసం, రాగి జావ, ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది కొంత ఉపశమనం లభిస్తుంది. వేడిని కలిగించే మసాల పదార్ధాలకు సంబంధించిన ఆహార పదార్ధాలు, వేపుళ్ళు ,పచ్చళ్ళు, ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు.
నీళ్ళ సౌకర్యం ఎక్కువగా ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి. అన్నిరకాల వయస్సులవారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి, తెల్లని రంగు కల్గినవి, తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది. చిన్నపిల్లలకు ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం.
ముఖ్యంగా మన సాటి జీవులైన పశు, పక్ష్యాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్ళను ఏర్పాటు చేయండి. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చెందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి. ఇలాంటి సంఘ సేవా కార్యక్రమాలు చేయడం వలన మీకున్న గ్రహభాదలు నివారణకు మార్గమై కొంత ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది.
ఈ సీజన్ లో దొరికిన పండ్లను మీరు తిన్న తర్వాత ఆ గింజలను ఒక కవరులో దాచిపెట్టి మీరు ఊరి బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ గింజలను పోలిమేర ప్రాంతాలలో కాని ఊరుకు, ఊరుకి మధ్య మార్గములో రోడ్ల ప్రక్కన చల్లండి, రాబోయేది వర్షాకాలం కనుక వాటిలో కొన్నైనా మొలిచి చెట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో చెట్లు ఎన్ని ఉంటే అంత మంచిది. వన్యప్రాణులకు ఆహారం కూడా అందించిన వారము అవుతాము.
ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కరోనా సమయంలో ఎంత మంది ఎన్ని రకాలుగా కష్ట పడ్డారు, పడుతున్నారో అందరికి సుపరిచతమే. మానవుని తప్పిదం వలననే విపత్తులు సంభవిస్తాయి, స్వయం కృతాపరాదం వలన అనేక ఇబ్బందులు ఉంటాయి. ఇకనైన మన భవిష్యత్తును మనం చక్క దిద్దుకుందాం. సాటి జీవులని బ్రతుకనిద్దాం, పర్యావరణ పరిరక్షణకు మన వంతుగా భాద్యతగా వ్యవహరిద్దాం , వృక్షో రక్షిత రక్షిత: ,సర్వేజనా: సుఖినోభవంతు.