శ్రీ రామకృష్ణ పరమహంస జననం 18 ఫిబ్రవరి 1836  మోక్షసిద్ది పొందినది 16 ఆగష్టు 1886 పుట్టినప్పుడు పేరు గదాధర్ ఛటోపాధ్యాయ ఒక ఆధ్యాత్మిక గురువు. విభిన్నమతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్ట మొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం" లో ఈయన ప్రభావము చాలా ఉంది. భారతదేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి, తేదీలు, ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు.

కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు ఉన్నాయి. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, ఆధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము అతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ ఆతని జీవితచరిత్రను చాలా మటుకు రచించాడు.

బాల్యము :- రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ.శ 1836, ఫిబ్రవరి 18 న పశ్చిమ బెంగాల్  లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గదాధరుడు అందగాడు,

బాల్యం నుండే ఇతనికి లలితకళలు, చిత్రలేఖనములో గల ప్రవేశము వలన వారి గ్రామంలో ఇతనికి మంచిపేరు ఉండేది. అయితే చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించేవాడు కాదు. ప్రకృతిని ప్రేమిస్తూ, గ్రామం బయట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవాడు. దానివలన చదువు అబ్బలేదు. పూరీకి వెళ్ళు సాధువులు వీరి గ్రామం గుండా వెళ్ళేవారు. వారు ఆ గ్రామంలో ఆగి ప్రసంగిచేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్ధగా వినేవాడు. వారికి సేవలు చేసి వారి మత వాగ్యుద్ధాలను ఆసక్తితో వినేవాడు.

ఉపనయనము కాగానే బ్రాహ్మణునిగా మొదటి భిక్ష, ఒక శూద్ర యువతి దగ్గర పొందుతానని అనడము చాలా మందికి ఆశ్చర్యము కలిగించింది. బ్రాహ్మణుని వద్దనే మొదటి భిక్ష పొందవలననే నియమాన్ని ఎంత వాదించినా, ఎంత మంది చెప్పినా, కన్నీరు కార్చినా వినకుండా ఆ యువతికి మాట ఇచ్చానని తాను ఆడిన మాట తప్పాక ఎటువంటి బ్రాహ్మణుడవుతాడని ప్రశ్నించాడు. చివరికి ఆతని జ్యేష్ట సోదరుడు రామ్‌కుమార్ తండ్రి మరణము తరువాత అంగీకరించెను. ఇంతలో కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతూ వచ్చింది.

రామ్‌కుమార్ కలకత్తాలో  సంస్కృత పాఠశాల నడుపుతూ, కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యము చేస్తూ ఉండేవాడు. ఆ కాలములో రాణీ రాషమొణి అనే ధనిక యువతి, దక్షిణేశ్వర్ కాళీ మాత గుడి కట్టించి రామ్‌కుమార్ ను పురోహితుడుగా ఉండమని కోరింది. రామ్‌కుమార్ దానికి అంగీకరించాడు. కొంత ప్రోద్బలముతో గదాధర్ దేవతను అలంకరించడానికి ఒప్పుకున్నాడు. రామ్‌కుమార్ మరణించిన తరువాత రామకృష్ణుడు పూజారిగా బాధ్యతలను తీసుకొన్నాడు.

పూజారి జీవితము :- మొదట తిరస్కరించినా తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయములో పూజలో సేవచేసేవాడు. గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తా అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానము ఇవ్వడము లేదు? అనుకొనేవాడు. ఈ ప్రశ్న ఆతనిని రాత్రి, పగలు కలచివేసింది. ఇక కాళికా దేవిని ప్రత్యక్షము కమ్మని తీవ్రమైన మొరలతో ప్రార్థించడము మొదలుపెట్టాడు. తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవళ్ళు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు. రాత్రిళ్ళు అడవిలో కూర్చొని ప్రార్థించేవాడు.

ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు. అప్పటి నుండి నిరంతరమూ అమ్మవారి దర్శనభాగ్యం పొందేవాడు. నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు. ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమ సత్యమును తెలిసికొనుటకై ప్రార్థించేవాడు. కొంత మంది గురువులు ఆతని దగ్గరకు వచ్చి అన్ని మతములలో పరమ సత్యము సాక్షాత్కరించుకున్నాడని గ్రహించారు. ఈ మాట అన్ని ఊళ్ళలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు.

గురువులు, సాధనలు :- కాలక్రమంలో తోతాపురి అను నాగా సాంప్రదాయపు సాధువు వీరికి అద్వైతజ్ఞానం ఉపదేశించారు. వీరి గురువుగారు చిన్నప్పటినుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధిస్థితిని రామకృష్ణులు కేవలం మూడు రోజులలోనే పొందారు. తర్వాత భైరవీ బ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు. ఈ విధంగా భగవత్, ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం, క్రైస్తవ  మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు.

వైవాహిక జీవితము :- కామార్పుకూర్ లో రామకృష్ణుడు దక్షిణేశ్వర్ లో అత్మజ్ఞాన అభ్యాసములతో పిచ్చివాడై పోయాడని పుకారు వచ్చింది. ఊరివారు రామకృష్ణుని తల్లితో ఆతనికి వివాహము చెయ్యమని, దానితో సంసారిక బాధ్యతలలో పడగలడని చెప్పారు. వివాహమునకు అభ్యంతరము చెప్పక పోవడమే కాకుండా, మూడు మైళ్ళ దూరములో ఉన్న జయరాంబాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్ళికూతురు దొరుకుతుందని చెప్పాడు. 5 ఏళ్ళ శారదా దేవితో  ఆతని పెళ్ళి నిశ్చయమైనది. శారద రామకృష్ణుని మొదటి శిష్యురాలు. తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెను త్రిపుర సుందరి శక్తిగా పూజించడము మొదలు పెట్టాడు. ఆమెను సాక్షాత్ కాళికాదేవి లా భావించి పూజించారు. ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు.

ఆమె పరిత్యాగము రామకృష్ణుని పరిత్యాగము వలే శిష్యులందరికి ప్రస్ఫుటముగా కనపడేది. వారిద్దరి సంబంధము సామాన్య మానవులు అర్థము చేసుకోలేరని భావించేవారు. చాలా కాలము అమెతో గడిపిన తరువాత రామకృష్ణుడు వారి బంధము ఆధ్యాత్మికమైనదని నిర్ణయించారు. శిష్యులందరూ వారు దినసరి జీవితాన్ని పంచుకున్నపటికీ, ఒకరి దగ్గర ఒకరు ఉన్నపుడు మటుకు ఆధ్యాత్మికత కంటే ఏ ఇతర విషయాల పై మనస్సు పోయేది కాదని భావించేవారు. మతగురువుల జీవితాల్లో స్త్రీ, పురుషుల మధ్య ఇలా జీవితకాలమంతా ఆధ్యాత్మిక సంబంధము ఉండడము ఇంకెక్కడా కానరాదు. రామకృష్ణుని మరణానంతరము శారదా దేవి కుడా మతగురువుగా మారెను.

గురువుగా :-  ఆ తరువాత కొద్ది కాలములోనే రామకృష్ణు పరమహంసగా పిలవబడెను. ఆయస్కాంతము లాగ భగవంతుని పొందగోరే వారిని అకర్షించేవారని ప్రతీతి. పదిహేను సంవర్సరములు మతములలో మూల సత్యములను కథలు, పాటలు, ఉపమ అలంకారములు, అన్నిటి కంటే ఎక్కువగా తన జీవిత చరిత్రతో నిర్విరామముగా ప్రబోధించాడు. తన అనుభవాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి తగిన వ్యక్తుల కొరకు వీరు నిరీక్షిస్తుండగా మకరందము గ్రోలడానికి వచ్చు తుమ్మెదలలాగా శిష్యులు రావడం ప్రారంభించారు.

వీరికి ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరి పేరు ప్రపంచ ప్రఖ్యాతి పొందడానికి దోహదం చేసినది వివేకానందులు. వీరి పరిచయం విచిత్రంగా జరిగింది. అప్పటికి వివేకానందులు నిజంగా భగవదనుభం పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకు లోనై చివరికి రామకృష్ణులను కలిశారు. "మహాత్మా మీరు భగవంతున్ని చూసారా?" అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందాడు. రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించేవాడు.

రామకృష్ణులు ప్రత్యక్ష శిష్యులు :- స్వామి వివేకానంద, స్వామి బ్రహ్మానంద, స్వామి ప్రేమానంద, స్వామి శివానంద, స్వామి త్రిగుణాతీతానంద, స్వామి అభేదానంద, స్వామి తురీయాతీతానంద, స్వామి శారదానంద, స్వామి అద్భుతానంద, స్వామి అద్వైతానంద, స్వామి సుభోదానంద, స్వామి విజ్ఞానానంద, స్వామి రామకృష్ణానంద, స్వామి అఖండానంద, స్వామి యోగానంద, స్వామి నిర్గుణానంద. వీరి ద్వారా రామకృష్ణమిషన్ స్థాపించబడి నేటికీ ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీరు సన్యాస శిష్యులు. గృహస్థ శిష్యులలో నాగమహాశయులు, మహేంద్రనాథ్ గుప్తా (మ), పూర్ణుడు, గిరీష్ ఘోష్ మొదలగువారు ప్రముఖులు.

తరువాత జీవితము :- వీరు కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు. తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశిపూర్ కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవచేశారు. చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోసారు. 1886 ఆగష్టు 16న మహాసమాధిని పొందాడు. అయన వదిలి వెళ్ళిన పదహారు మంది శిష్య సమ్మేళనమునకు స్వామీ వివేకానంద  సారథ్యము వహించాడు. వివేకానంద ఆ తరువాత మత తత్త్వవేత్త, ఉపన్యాసకుడుగా ప్రసిద్ధి పొందాడు. రామకృష్ణుని సమకాలికులలో కేశవ చంద్ర సేన్, పండిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఆతని అరాధకులు

రామకృషుని బోధనలలో ముఖ్యాంశములు :- 

భగవత్తత్వము    
సృష్టిలో ఏకత్వము
అన్ని జీవులలో దైవత్వము
ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐకమత్యము. 
అన్నిమతాల సారాంశం ఒక్కటే.
మానవ జీవితములో దాస్య కారకాలు కామము, స్వార్థము. 
కామకాంచనాల నుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.
మానవ సేవే మాధవ సేవ
ఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి మతాలు కూడా మార్గాలే.
అలాగే స్వామీ వివేకానందుని బోధనలలో చాలా భాగం రామకృష్ణులవే.

రామకృష్ణుడు జీవితములో పరమ కర్తవ్యము భగవంతుని తెలియగోరుట అని వక్కణించెను. మతము ఈ కర్తవ్యముని నిర్వర్తించుటకు మటుకేనని ఆతని అభిప్రాయము . రామకృష్ణుని భావగర్బిత మైన అత్మజ్ఞానమును హిందూ మతములో నిర్వికల్ప సమాధిగా నిర్వచించిరి. నిజానికి 'నిత్య ధ్యానము' అనగా సృష్టిలో సర్వ వ్యాప్తమైన చేతనను గ్రహించుకొనుట, అతనిని సర్వ మతములు పరమాత్మను తెలుసుకొనుటకు వేర్వేరు మార్గములని, పరమసత్యాన్ని వ్యక్తీకరించడానికి ఏ భాషా చాలదని తెలుసుకోవడానికి దారి తీసింది. ఋగ్వేదములో నిర్వచించిన సత్యము ఒక్కటే కాని ఋషులు దానిని ఎన్నో నామముల తో పిలిచెదరు అనే నిర్వచనముతో రామకృష్ణుని బోధన ఏకీభవిస్తున్నది. ఈ భావన వలన రామకృష్ణుడు తన జీవితకాలములో కొంత భాగము తనకు అర్థమైన రీతిలో ఇస్లాం, క్రైస్తవ మతము, హిందూ మతము లోని యోగ, తంత్ర శాస్త్రములు అభ్యాసము చేస్తూ గడిపేవారు.

అవిద్యామాయ, విద్యామాయ :- రామకృష్ణుని నిర్వికల్ప సమాధి వలన మాయకు ఉన్న రెండు వైపులు అవిద్యామాయ, విద్యామాయలను అర్థము చేసుకొన్నారని భావించేవారు. అవిద్యామాయలో దుష్ట శక్తులు కామము, చెడు భావములు, స్వార్థము, క్రౌర్యము మానవ జీవితమును జన్మ, మృత్యువుల కర్మ చక్రములో బంధించి, చేతన (consciousness) ను క్రిందికి తొక్కుతున్నవి. కర్మ చక్రములో బంధిస్తున్న ఈ శక్తులను పోరాడి జయింపవలెను. విద్యామాయలో ఉన్నత శక్తులు అధ్యాత్మిక విలువలు, జ్ఞానోదయమును ప్రసాదించు గుణములు, దయ, స్వచ్ఛత, ప్రేమ, భక్తి మానవులను చేతనలో ఉన్నత శిఖరాలకు తీసుకు వెళుతున్నవి. విద్యామాయ సహాయముతో మానవులు అవిద్యామాయను తమకు తామే వదిలించుకుని మాయారహితమైన మాయాతీతునిగా మారవచ్చని బోధించేవారు. రామకృష్ణుడు సర్వధర్మ సమ్మిళితమైన నినాదమును ప్రతీ అధిప్రాయము భగవంతుని దర్శనానికి త్రోవ కనుక్కుంటుంది ప్రతిపాదించినను. అయన స్వయముగా విష్ణుమూర్తి అవతారములైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పేర్లను పెట్టుకొని కాళీ, దుర్గా మాతల భక్తుడై ఉంటూ ఇస్లాం, క్రైస్తవ మతములతో పాటు తంత్ర శాస్త్రమును కుడా అభ్యసించాడు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151