Nagula Chavithi 2023: నాగుల చవితి నేడే.. ఈ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?
Nagula Chavithi 2023: ఈ రోజు నాగదేవతలను నిష్టగా పూజించి సర్పాల భయాన్ని పోగొట్టుకుంటారు. నాగుల చవితి నాడు పామలను పూజిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. మరి ఈ రోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు.
Nagula Chavithi 2023: నాగుల చవితి పండుగను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ రోజున నాగ దేవతలు ఉన్న దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. సర్ప భయం పొగొట్టమని ప్రార్థిస్తారు. మనం ప్రతి ఏడాది నాగుల చవితిని కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత అంటే నాల్గో రోజున జరుపుకుంటాం.
బ్రహ్మ పురాణం ప్రకారం.. నాగ చవితి నాడు బ్రహ్మదేవుడు పాములకు ఒక వరం ఇస్తాడు. ఈ వరం ప్రకారం.. నాగ చవితి నాడు నాగులను పూజిస్తారు. నాగచవితినాడు నాగులను పూజించడం వల్ల రాహు కేతు జనన లోపాలు తొలగిపోతాయి. అలాగే కాలసర్ప దోశాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజే నాగుల చవితి. కాబట్టి ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నాగుల చవితి నాడు ఏం చేయకూడదంటే?
- నిజానికి పాములు ఎవరికీ హాని చేయాలనుకోవు. తమను తాము రక్షించుకోవడానికి ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే అవి మన మీద దాడి చేస్తాయి. కాబట్టి పాములను హాని చేయకండి. హిందూ మతం పాములను దేవుళ్లుగా భావిస్తుంది. పాములకు హాని తలపెట్టాలనుకోవడం మీకు మంచిది కాదు. పాములకు హాని చేస్తే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
- నాగుల చవితి నాడు భూమిని తవ్వకూడని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే మట్టిలో లేదా భూమి లోపలి బొరియల్లో పాములు నివసిస్తాయి. ఒకవేళ పాములున్న భూమిని తవ్వితే పాములు గాయపడతాయి. పాములు గాయపడితే ఆ కుటుంబం నాశనమవుతుందని చాలా మంది నమ్ముతారు.
- చాలా మంది ఈ రోజు బతికున్న పాములకు పాలు, గుడ్లను పెడుతుంటారు. ముఖ్యంగా పుట్టలన్న దగ్గరకు వెళ్లి పుట్టల్లో పాలను పోస్తుంటారు. కానీ ఇలా చేయడం పాములకు మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాములు పాలను జీర్ణించుకోలేవు. ఒకవేళ అవి బలవంతంగా తాగితే చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే బతికున్న పాములకు పాలను పోయడం మానుకోండి. కావాలనుకుంటే నాగదేవతల విగ్రహాలకు పాలభిషేకం చేయండి.
- నాగుల చవితి నాడు పదునైన అంటే సూదులు, కత్తులు వంటి వాటిని పొరపాటున కూడా ఉపయోగించకండి. అంటే ఈ రోజు కుట్టు మిషన్, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేయకూడదన్న మాట.
నాగచవితి నాడు ఏం చేయాలి?
నాగుల చవితి నాడు సజీవ పాములను పూజించాలని ఏం లేదు. ఈ రోజు మీరు నాగదేవుళ్ల, దేవతల విగ్రహాలను, లేదా చిత్రాలకు నియమాలతో పూజించండి. మన దేశంలో నాగదేవుళ్లు, దేవతలకు అంకితం చేయబడ్డ దేవాలయాలు చాలానే ఉన్నాయి. ఈ దేవాలయాలకు వెళ్లి పువ్వులు, పాలను సమర్పించండి. నైవేద్యాలను సమర్పించి ఆశీర్వాదం తీసుకోండి.