Asianet News TeluguAsianet News Telugu

మృగశిర కార్తె

మృగశిర కార్తె మొదటి రోజును దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజు ప్రత్యేకించి ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు.

Mrigasira Karthi 2021
Author
Hyderabad, First Published Jun 8, 2021, 8:41 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

మృగశిరకార్తె తేదీ 8 జూన్ 2021 మంగళవారం నుండి ప్రారంభమవుతుంది.  అసలు ఈ కార్తెలు ఎలా ఏర్పడతాయి చూద్దాం. సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే ప్రవేశిస్తాడో ఆ నక్షత్రం ఆధారంగా నక్షత్రం యొక్క పేరుతో కార్తె పేరును పిలువబడుతుంది. అశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న ఇరువది ఏడు నక్షత్రాలలో సూర్యభగవానుడు ప్రవేశం ఆధారంగా కార్తెను నిర్ణయించడం జరుగుతుంది. భారతీయ జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఒక్కో కార్తెలో దానికి సంబంధించి ప్రకృతిలోని మార్పు, దానివలన జరిగే ప్రత్యేకాంశలను సవివరంగా వివరించింది. 

మృగశిర కార్తె తేదీ 8 జూన్ 2021 మొదలుకుని 22 జూన్ 2021 వరకు నిర్జలం గాడిద వాహనం. 10, 13, 14, 15, 16, 20, 21 తేదీలలో సస్యానుకుల వర్షములుండును. దేశమంతటా వర్షములు కురియును. వాతావరణం చల్లగా నుండును.   

ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే రైతులు పొలాలు దున్ని పంటలు వేయడం మొదలుపెడతారు. మృగశిర కార్తె మొదటి రోజును దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజు ప్రత్యేకించి ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు. ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి. వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు తింటే వ్యాధులు దరిచేరవని ప్రజల విశ్వాసం.

మృగశిర కార్తె తర్వాత రోకండ్లను సైతం పగులగొట్టె ఎండలు తగ్గిపోతాయి. వర్షాలు మొదలవుతాయి. 15 రోజుల పాటు ఈ కార్తె ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తె రావడంతో వర్షాలు మొదలు కానున్న నేపథ్యంలో పలు వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. 

ప్రకృతిలో మార్పు, జ్యోతిష శాస్త్ర ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు, వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా, వర్షదేవుడుగా పిలుస్తారు.. 

ప్రస్తుతం ఈ కార్తె ప్రవేశానికి ముందు తీవ్రమైన ఎండలతో భూమి అంతా వేడేక్కి మానవ శరీరాలు తాపంతో ఉంటాయి. జూన్ మొదటి వారంలో అంటే సుమారుగా 8 తేదీ నుండి ప్రకృతి పరంగా వర్షాలు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలో తీవ్రమైన ఎండల నుండి వర్షాల వలన వాతావరణం చల్లబడడంతో మానవుల శరీరంలో కూడా ప్రకృతి మార్పు ప్రభావం పడుతుంది. శరీరం ప్రకృతి యొక్క మార్పును తట్టుకోవడానికి ఈ రోజు ఇంగువబెల్లం తింటారు.

ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు, ఇతర వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి నుంచి గట్టెక్కాలంటే శాఖాహారులు మాత్రం ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు.. ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో, చింత చిరుగులో పెట్టుకుని తింటారు. 

ఇంకుడుగుంత సూచనలు:- ఈ కాలంలో పడే వర్షపు నీటిని వృధా పోనివ్వకుండా సద్వినియోగ పరుచుకునే మార్గాలను అన్వేశించాలి. ఇంకుడు గుంతల నిర్మాణం వలన మనకు భవిష్యత్తులో అవి భూమిలో నీటి నిల్వలను పెంచి చెరువులు, బావులు, బోర్లు ఎండి పోకుండా ఉపయోగపడతాయి. 

'భూ'వసతి ఉన్న వాల్లు ఎక్కువ మోతాదులో చెట్లను నాటాలి. స్థలంలేని వాళ్ళు మనం నివసించే పరిసర ప్రాంతాలలో మన ఊరి రోడ్డునకు ఇరువైపుల శక్తి వంచన లేకుండా చెట్లను నాటితే అవి మనకు మేలు చేస్తాయి. భవిష్యత్తులో అవే కాపాడుతాయి. మంచి పని చేయడానికి కుల, మత, ప్రాంత, లింగ, వయోభేదం లేకుండా ఈ సత్కార్యానికి సంకల్పించాలి. నాకెందుకులే అనే భావన పొరబాటున కూడా మనస్సుకు రానివ్వకూడదు. మీరు నేడు చేసిన ప్రకృతి సేవయే రేపటి కాలం ( తరం )లో మిమ్మల్ని, భావితరలవారిని కాపాడుతాయి..  జైశ్రీమన్నారాయణ.

Follow Us:
Download App:
  • android
  • ios