మనము సహజంగా పండగలన్ని చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేసుకొవడం జరుగుతాయి. కాని సంక్రాంతి మాత్రం సూర్యున్ని ప్రధానంగా తీసుకుని నిర్ణయం చేయడం జరుగుతుంది. సంక్రాంతి పండగ అనేది మూడు రోజుల పర్వదినం. తిథితో సంబంధం లేని పండగ. ఈ మూడు రోజుల పండగలలో మొదటి రోజు భోగి పండగ. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేది భోగి. దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు ఈ రోజు. 14 జనవరి 2020 మంగళవారం భోగి పండగ ,15 జనవరి 2020 బుధవారం మకర సంక్రాంతి ,16 జనవరి 2020 గురువారం కనుమ ( పశువులను పూజించే ) పండగ. 

మకరరాశి ప్రవేశం ఎప్పుడంటే? మకర సంక్రమణం శ్రీ వికారినామ సంవత్సరం పుష్యమాసం బహుళ పక్షమి సోమవారం అనగా 14/15  జనవరి 2020  తెల్లవారితే బుధవారం అనగా పుబ్బ నక్షత్రం, శోభన యోగం, తైతుల కరణం సమయంలో రాత్రి 2 :08  నిమిషాలకు జగద్రక్షకుడైన శ్రీ సూర్యభగవానుడు ఉత్తరాషాఢ నక్షత్ర రెండవ పాదంలో మకరరాశి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమగును. 

మకర ప్రవేశం రాత్రి సమయం అయినందున మరుసటిరోజైన 15 జనవరి 2020 బుధవారం రోజు మకర సంక్రాంతి పర్వదినం సూర్యోదయం నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావున తేదీ 15 మంగళవారం రోజు అందరూ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి. జనవరి 14 తేదీ మంగళవారం రోజు పంచాంగ ప్రకారం భోగి పండగ అవుతుంది.

భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం. పాడి పంటలు సమృద్ధిగా ఇండ్లకు వచ్చే సమయం. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానానంతరం ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పాత పనికిరాని బట్టలను, కర్ర వస్తువులను వేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటారు. తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకుని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభం అవుతుంది. 

మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడి ఉన్నజీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి మాట.. ఇచ్చి భవగత్ సన్నిదిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది. 

భోగిపళ్ళు:-  ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు భోగి పండ్లను పోయడం వలన పిల్లకు ఉన్న బాలారిష్టాలు, ఇతర దోషాలు తొలగి పోవాలని ఇంట్లో ఉన్న ఐదు సంవత్సాలలోపు ఉన్న పిల్లలకు భోగి పండ్లను పోస్తారు. ఈ భోగి పండ్లలో 1) రేగుపండ్లు, 2) జీడిపండ్లు, ౩) కొన్ని చిల్లర నాణేములను, 4) బియ్యం పిండితో చేసి నువ్వుల నూనెలో వేయించిన చిన్నగా వేపగింజల ఆకారంలో తాల్కలు చేస్తారు, 5) చెరుకుగడ ముక్కలు.

ఈ ఐదింటిని ఒకచోట కలిపి ఇంట్లో ఉన్న పిల్లలో ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన వారికి కొత్త బట్టలు వేసి  చాప / దుప్పటిపై  పీట వేసి తూర్పు ముఖం ఉండేలాకూర్చో బెట్టి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి ఇరుగు పోరుగు పిల్లలను పిలిచి భోగి పండ్లను రెండు చేతులతో పిల్లలను ఆశీర్వదిస్తూ తలపై నుండి క్రిందకు జారపడే విధంగా పోస్తారు. పిల్లవాడి తలపై నుండి క్రింద పడిన భోగి పండ్లను పిల్లలు సరదాగా పోటీపడుతూ భోగిపళ్లను పోగుచేసుకుని తింటారు. 

కొన్ని ప్రాంతలలో ఈ సంక్రాంతి భోగి రోజు ముతైదువలు కొత్త గాజులు వేసుకుంటారు. గాజులు తొడిగిన గాజుల వ్యాపారికి వారి పంట పోలాలలో పండిన కొత్త ధాన్యపు గింజలను అనవాయితిగా  వారికి ఇచ్చి సంతృప్తిగా సాగనంపుతారు. ఇంటికి వచ్చిన కొత్త అళ్ళులు, కూతుర్లతో సరదాగా ఆనందగా గడుపుతారు. ఈ రోజు కుటుబంలో ఎంతగానో ఆనంద ఆప్యాయతల మధ్య అనుభూతులు పొందుతారు. పేద, ధనిక చిన్న,పెద్ద  అనే తారతమ్యం భేదం లేకుండా కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో ఆనందగా గడుపుతారు. 

పిల్లలకు భోగి పళ్ళను పోసే శుభ ఘడియలు:- ఉదయం 8:00 నుండి 8 :30 లేదా మధ్యాహ్నం 12:00 నుండి12:30 నిమిషాలు గురు హోరలో అనుకూల సమయం. ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ధనుర్మాసంలో చివరి రోజు ఈ రోజు కావడం చేత దినమంతా దైవ నామ స్మరణతో గడుపుతారు. విష్ణుచిత్తుని కుమార్తె ఆండాళ్ ఈ ధనుర్మాసంలోనే కాత్యాయిని వ్రతం చేసి సాక్షాత్తు భగవంతున్ని మెప్పించింది. భవంతుడిని మనస్సు పెట్టి ఎవరైతే ధ్యానిస్తారో వారి పట్ల దేవుడు కోరిన కొర్కేలను తప్పక తీరుస్తాడని మనకు పురాణ, ఇతిహాసాల ద్వార తెలుస్తున్నాయి జై శ్రీమన్నారాయణ.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151