మహాశివరాత్రి వ్రత కథ

ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసా వృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను.

Maha Shivaratri 2020 Puja Vidhi, Shubh Muhurat

ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.

ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసా వృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి "శివ శివ" యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.

మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక "వ్యాధుడా! నన్ను చంపకుము" అని మనుష్యవాక్కులతో ప్రార్ధించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక "నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని.

దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను" అని అతన్ని వొప్పించి వెళ్ళెను.

రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో "ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును" అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.

మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు
ఆహరముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని "నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.

ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను.
"ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను
వదలిపెట్టుదును." అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.

అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి
యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము."

ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు,
వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము .

Maha Shivaratri 2020 Puja Vidhi, Shubh Muhurat

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios