డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

బాధ్రపద మాసము తెలుగు సంవత్సరంలో ఆరవ నెల. చాంద్రమానం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి రోజు పూర్వాబాధ్ర లేదా ఉత్తరాబాధ్ర నక్షత్రం ఉండడం వలన ఇది బాధ్రపద మాసం అనబడింది. ఇది వర్షఋతువు కావున విరివిగా వర్షాలు పడును, చెరువులలో కొత్త నీళ్ళతో నిండుతుంది. బాధ్రపద శుద్ధ చవితి ( వినాయక చవితి ) నుండి తొమ్మిది రాత్రులలో గణపతి నవరాత్రి ఉత్సవాలు  జరుపుకుంటారు. చివరి రోజున నిమజ్జనం వైభవంగా జరిపిస్తారు. ఇంత వరకు అందరికి తెలిసిందే కానీ గణపతి పూజకు ఏకవింశతి పత్రాలు అంటుంటారు, అసలు వాటి వలన ప్రయోజనం ఏమైనా ఉందా ఎదో ఫార్మలిటికి పెడుతున్నామా అనే విషయం అందరికి తెలియజేయాలనే సంకల్పంతో ఈ వ్యాసం తయారు చేయడం జరిగినది. విషయం తెలుసుకుని మన భారతీయ సనాతన సాంప్రదాయలను గౌరవిస్తారని. మంచిని మన భావితరాల వారికి తెలియజేస్తూ .. పది మందికి పంచుతారని భావిస్తున్నాను. ఇక అసలు విషయానికొస్తే వినాయకచవితి పూజలో  21 "ఏకవింశతి" ఆకులతో గణపతి పూజ చేస్తారు. అవి ఏమిటి ఈ ఏకవింశతి ఆయుర్వేద పత్రాల వలన మనకు కలిగే లాభాలు ఏమిటి చూద్దాం.

1. ఓం సుముఖాయ నమ: మాచీ పత్రం పూజయామి. ఈ పత్రం వలన ప్రయోజనం ఇది దద్దుర్లు , తలనొప్పి, వాత నొప్పులు , కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాదులు తగ్గించడానికి ఉపయోగ పడుతుంది.

2.ఓం గణాధిపాయ నమ: బృహతీ పత్రం పూజయామి. బృహతి పత్రం అంటే "వాకుడాకు" ఈ పత్రం వలన ప్రయోజనం  దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర సంబంధిత వ్యాధులను నయం చేయడానికి ఉపయోగ పడుతుంది. ఇది దంత దావనానికి కూడా ఉపయోగపడుతుంది.

3. ఓం ఉమా పుత్రాయనమ: బిల్వ పత్రం పూజయామి. బిల్వపత్రం అంటే " మారేడు" పత్రం. ఈ పత్రం వలన ప్రయోజనం జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర సంబధిత వ్యాధులు,శరీర దుర్గంధం వాసనలు, జిగిట విరేచనాలు మొదలగు వాటిని తగ్గించడానికి ఉపయోగ పడుతుంది.

4. ఓం గణేశాయ నమ: దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం అంటే " గరిక" ఈ పత్రం వలన ప్రయోజనం గాయాలను,చర్మ సంబంధమైన వ్యాధులను, ఉదర సంబంధమైన వ్యాధులు, అర్శ మొలల నివారణకు ఉపయోగపడుతుంది. 

5. ఓం హరసుతయే నమ: దత్తూర పత్రం పూజయామి. దత్తూరపత్రం అంటే " ఉమ్మెత్త " ఈ పత్రం వలన ప్రయోజనం  సెగ గడ్డలు, స్తన వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, ఋతు వ్యాధుల నివారణకు ఉపయోగ పడుతుంది. ( ఇది విషం కాబట్టి సొంత వైద్యం చేయకూడదు )  

6. ఓం లంబోదరాయ నమ: బదరీ పత్రం పూజయామి. బదరీ పత్రం అంటే "రేగు" ఈ పత్రం వలన ప్రయోజనం  జీర్ణ కోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు, రోగ నిరోధక శక్తి పెంపుదలకు ఉపయోగపడుతుంది.

7. ఓం గుహాగ్రజాయనమ: ఆపామార్గ పత్రం పూజయామి. ఆపామార్గ పత్రం అంటే "ఉత్తరేణి" ఈ పత్రం వలన ప్రయోజనం దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారటం, అర్శ మొలలు, ఆణేలు, గడ్డలు, అతి ఆకాలి, జ్వరం, మూత్ర పిండాలలో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

8. ఓం గజకర్ణాయనమ: తులసీపత్రం పూజయామి. ఈ తులసీ పత్రం వలన ప్రయోజనం దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, చుండ్రు, అతిసారం, గాయాలు, తగ్గించడానికి, ముఖ సౌందర్యానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది.     

9. ఓం ఏకదంతాయనమ: చూతా పత్రం పూజయామి. చూత పత్రం అంటే " మామిడి ఆకు" ఈ పత్రం వలన ప్రయోజనం  రక్త విరేచనాలు, చర్మ వ్యాధులు, ఇంటిలోని క్రిమి కీటకాల నివారణకు, ఇంట్లో ఉన్న చెడువాయువుము నివారిస్తుంది.

10. ఓం వికటాయనమ: కరవీపత్రం పూజయామి. కరవిపత్రం అంటే " గన్నేరు" ఈ పత్రం వలన ప్రయోజనం  కణుతులు, తేలుకాట్లు, దురద, కళ్ళ సంబంధమైన వ్యాధులు, చర్మ సంబంధమైన వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

11. ఓం భిన్న దంతాయనమ: విష్ణు క్రాంత పత్రం పూజయామి. విష్ణు క్రాంత పత్రం అంటే " విష్ణు కాంత" జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం, తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.

12. ఓం వటవేనమః దాడిమీ పత్రం పూజయామి. దాడిమీ పత్రం అంటే " దానిమ్మ" ఈ పత్రం వలన ప్రయోజనం  విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, అర్శ మొలలు, ముక్కు నుండి రక్తం కారడం, కండ్లకలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

13. ఓం సర్వేశ్వరాయనమ: దేవదారు పత్రం పూజయామి. దేవదారు పత్రం వలన ప్రయోజనం అజీర్తి, పొట్ట సంబంధమైన, చర్మ వ్యాధులు, కంటి సంబంధమైన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 

14. ఓం పాలచంద్రాయనమ: మరువక పత్రం పూజయామి. "మరువం" పత్రం వలన ప్రయోజనం జీర్ణశక్తి, ఆకలి పెంపొందించుటకు, జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గించుటకు ఉపయోగిస్తారు. మంచి సువాసనలు ఇస్తుంది. 

15. ఓం హేరంభాయనమ: సింధూవారపత్రం పూజయామి. సింధూ వార అంటే "వావిలి" ఈ పత్రం వలన ప్రయోజనం  జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, వాతనికి, చర్మ వ్యాధులు, మూర్చ వ్యాధి, ప్రసవం తర్వాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగిస్తారు.

16. ఓం శూర్పకర్ణాయనమ: జాజీ పత్రం పూజయామి. జాజీ పత్రం అంటే "జాజిఆకు" ఈ పత్రం వలన ప్రయోజనం  వాత నొప్పులు, జీర్ణాశయం వ్యాధులు, మలాశయం వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

17. ఓం సురాగ్ర జాయనమ: గండకీ పత్రం పూజయామి. గండకీ పత్రం అంటే " దేవకాంచనం" ఈ పత్రం వలన ప్రయోజనం  మూర్చవ్యాధి, కఫం, పొట్ట సంబంధమైన వ్యాధులు, నులి పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. ఈ ఆకులను ఆహారంగా ఉపయోగిస్తారు.

18. ఓం ఇభవక్త్రాయనమ: శమీ పత్రం పూజయామి. శమీ పత్రం అంటే "జమ్మి ఆకు" ఈ పత్రం వలన ప్రయోజనం  కఫం, మూల వ్యాధి, కుష్టువ్యాది, అతిసారం, దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.

19. ఓం వినాయకాయ నమ: అశ్వత్ధ పత్రం పూజయామి. అశ్వర్ధ పత్రం అంటే " రావి ఆకు" ఈ పత్రం వలన ప్రయోజనం నోటి పూత, చర్మ వ్యాధులు, మలబద్ధకం, కామెర్లు, మూత్ర వ్యాధులు, జ్వరాలు, జీర్ణ శక్తి , జ్ఞాపక శక్తి, పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.

20. ఓం సురసేవితాయనమ:  అర్జున పత్రం పూజయామి. అర్జున పత్రం అంటే " తెల్లమద్ది" ఈ పత్రం వలన ప్రయోజనం  చర్మ వ్యాధులు, కిళ్ళ నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది.

21. ఓం కపిలాయనం: అర్క పత్రం పూజయామి. అర్క పత్రం అంటే "జిల్లేడు" ఈ పత్రం వలన ప్రయోజనం చర్మ వ్యాధులు, సెగగడ్డలు, కీళ్ళ నోప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోదకాలు, వ్రణములు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.  

గమనిక :- ఈ పత్రములు అన్ని సంపూర్ణ ఆయుర్వేద వైద్యంలో అనుభావజులైన వైద్యులు ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోకుండా స్వంత నిర్ణయంతో వాడరాదు.

ఇక ఈ ఏకవింశతి పత్రాలు అంటే ఇరవై ఒక్క వనమూలికలను వినాయక చవితి రోజున ఎందుకు పూజలో ఉపయోగిస్తారు అంటే దీనిలో ఒక పరమార్ధం దాగిఉంది. ఊరిలోని ప్రజలు వినియోగించిన నీళ్ళన్ని డ్రైనేజీ కాలువల ద్వార ఊరి చెరువులో కలుస్తాయి. ఈ వినాయక నవరాత్రులలో ఈ ఏకవింశతి పత్రాలు పూజలో పెట్టడం వలన ఇంట్లో చెడుని తొలగించి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. పూర్వ కాలంలో ఊరి జానాలు అందరూ చెరువు నీళ్ళనే అందరూ త్రాగేవారు. వినాయక నవరాత్రులు ముగిసాక గణేష్ నిమర్జనం చేసినప్పుడు ఈ ఆకులన్నింటిని చెరువులో కలపడం ద్వారా చెరువులోని కలుషితమైన నీళ్ళన్ని ఆయుర్వేద గుణము కలిగిన పత్రాలు కాబట్టి కలుషితమైన నీళ్ళను శుద్ధి చేస్తాయి. 

అందుకే మన పూర్వీకుల ప్రతి పండగను ఆరోగ్య సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని సాంప్రదాయ ఆచారాలు తయారు చేసారు. ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్ లో వ్యాపారులు గణపతి పూజకు ఏకవింశతి పత్రాలు అని ఏవో పార్కులలో, రోడ్డు సైడ్లలో పెరిగేవి తెచ్చి మనకు అంటగడుతుంటారు. వాటి వలన ఏ ప్రయోజం ఉండదు. వ్యక్తి గత ఆరోగ్య సూత్రం మరియు గ్రామ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఒరిజినల్ ఆకులనే ఉపయోగించండి. ప్రస్తుత కరోనా మహమ్మారి లాంటి ఇబ్బందులు రాకుండా, ప్రభల కుండా కూడా ఉపయోగ పడుతాయి.