కార్తీక  మాసం మొదలైంది. ఇప్పుడు ఎక్కడ చూసిన భాజా భజంత్రీలే వినపడుతున్నాయి.  దాదాపు మూడు నెలలపాటు పెళ్లి ముహుర్తాలకు బ్రేక్ పడగా... మళ్లీ ఇప్పుడు పెళ్లి సందడి మొదలైంది. సాదారణంగా ఏటా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో చక్కటి ముహూర్తాలు ఉంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం అలా జరగలేదు.  జూలై ఆషాఢ మాసం కావడంతో శూన్యమాసం అయ్యిందని, కారణంగా శుభకార్యాలు జరగలేదు.

ఈ ఏడాది శ్రావణ మాసంలో కూడా మూఢమి వచ్చింది. సెప్టెంబర్‌ భాద్రపద మాసం కావడంతో శూన్యమాసమయ్యింది. మూడు నెలలు శుభకార్యాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఇప్పుడు పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. 

మరీ ముఖ్యంగా నవంబర్‌ 1, 6, 14, 15, 22, 28, 30వ తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ తేదీల్లో వివాహాలు చేసుకోవడానికి అధికసంఖ్యలో ముహుర్తాలు పెట్టుకున్నారు. ఒకే రోజు వందల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ ముహుర్తాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. 

పెళ్లి అనగానే.. ముందుగా అందరికీ గుర్తు వచ్చేది బంగారం. బంగారం కొనకుండా మన దేశంలో పెళ్లిళ్లు జరగడం చాలా అరుదనే చెప్పాలి. బంగారంతో పాటు కొత్త దుస్తులకు కూడా ఈ సీజన్ లో డిమాండ్  ఎక్కువే.  వీటి కోసం కనీసం 4 నుంచి 5రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే మంచి మోడల్స్‌ ఎంపిక చేయడం, పెళ్లికూతురు, పెళ్లి కొడుకులతో పాటు తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులకు కూడా స్థాయిని బట్టి బంగారం, వెండి, వస్త్రాలు పెడతారు. దీంతో బంగారు దుకాణాలు, వస్త్ర దుకాణాలు కిటకిటాలాడుతున్నాయి. కంపనీ వస్త్రాలకే పెళ్లి కుటుంబాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఇక ఈ సీజన్ లో అందరికన్నా ఎక్కువ డిమాండ్ పురోహితులదే. పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో పురోహితులు బిజీగా మారిపోయారు. ఒకే రోజు ఒక్కో పురోహితుడు 3 వివాహాలు జరిపించేలా ముహుర్తాలు సెట్‌ చేసుకుంటున్నారు. మరికొందరు ప్రధాన పురోహితులు, ప్రధాన ఘట్టం మాత్రమే దగ్గరుండి నిర్వహించి, మిగిలిన కార్యక్రమం సహాయకులు చూసుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.