Asianet News TeluguAsianet News Telugu

చెడుపై మంచి విజయం: దసరా పండుగ ఆవిర్బావ విశేషం

విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. 

Importanace of Dasara festival
Author
Hyderabad, First Published Oct 25, 2020, 7:59 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  944061115

చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించు కునుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గం ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. 

విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.

బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పదునేనమిది చేతులను కలిగి ఉంది. 

ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. 

ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరు. చివరకు మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలవబడింది. అదే విజయదశమి కూడా.

విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios