మనసులోని చెడు సంస్కారాలను రూపుమాపేదెలా

మన అంతరాళం నుంచే ఈ చెడు సంస్కారాలను ఎదుర్కోవడమనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం. యోగసూత్రాల సృష్టికర్త అయిన పతంజలి మహర్షి చెప్పినట్లు ఈ చెడు సంస్కారాలను మరింత లోతైన స్థాయిలో పరిష్కరించేందుకు వాటికి వ్యతిరేకమైన మంచి సంస్కారాలపై మనసును ఏకాగ్రపరచడమే మార్గం. 

How to Get rid Bad in Our Soul

 డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

How to Get rid Bad in Our Soul

ఏదైనా ఒక కర్మను మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఏర్పడిన మనఃప్రవృత్తినే 'సంస్కారం' అంటారు. చాలాకాలం గారాబం చేయడం వల్ల మనపై ఆసక్తిని పెంచుకొని మనల్ని అంటిపెట్టుకొనుండే పెంపుడు కుక్కల లాంటివే ఈ సంస్కారాలు. ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఒక నాడు వీటిని పారద్రోలాలంటే సాధ్యం కాదు. వీటి నుంచి మనం తప్పించుకొంటూ ఉండాలి. ఇవి మనల్ని సమీపిం చిననాడు వాటిపై దాడి చేసి దూరంగా తరిమి వేయాలి.

కాబట్టి ముందుగా చేయవలసిందే మంటే మన చెడు సంస్కారాల గురించి ఎరుక కలిగి ఉండడం! వాటిని పురికొల్పే సందర్భాల నుంచి తప్పించుకోవడం! ఇది ఒక సుడిగుండాన్ని ఎదుర్కోవడం లాంటిదే. తెలిసో తెలియకో ఒకసారి దానిలో చిక్కుకుంటే మనం నిస్సహాయిలమే సుమా. కానీ మన ముందున్న ఆ సుడి గుండం గురించి మనకు తెలిసి ఉన్నప్పడు, దాని నుంచి తప్పించు కోవాలన్న కోరిక దృఢంగా ఉన్నప్పడు దాని దరిదాపులకు కూడా పోకూడదు, అయితే కేవలం కళ్ళు మూసుకుంటే సరిపోదు. భయంతో తలను ఇసుకలో దూర్చడం ద్వారా ఉష్ణపక్షి ప్రమాదాలకు తావిస్తుంది. 

మన అంతరాళం నుంచే ఈ చెడు సంస్కారాలను ఎదుర్కోవడమనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం. యోగసూత్రాల సృష్టికర్త అయిన పతంజలి మహర్షి చెప్పినట్లు ఈ చెడు సంస్కారాలను మరింత లోతైన స్థాయిలో పరిష్కరించేందుకు వాటికి వ్యతిరేకమైన మంచి సంస్కారాలపై మనసును ఏకాగ్రపరచడమే మార్గం. మంచి సంస్కారాలకు నిదర్శనాలైన వ్యక్తుల పైన లేదా విషయాల పైన మనస్సును లగ్నం చేయవచ్చు. కానీ భగవంతునిపై దృఢవిశ్వాసమున్న వ్యక్తి విషయంలోనైతే ప్రార్థన, ధ్యానం లాంటివి సాధన చేస్తూ దేవునితో మమేకమవడం ఉత్తమం.

పాపప్రవృత్తి నుంచి బయటపడేందుకు భగవద్గీత ఇలా మార్గం చూపుతోంది:- "ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి - ఇవే పాప ప్రవృత్తికి నిలయాలు. ఇవి జ్ఞానాన్ని ఆవరించి, జీవుణ్ణి వంచిస్తాయి. అందువల్ల ఇంద్రియాలను ఆదిలోనే నియంత్రించడం ద్వారా పాపనివృత్తి కావించవచ్చు. భోగ విషయాల కన్నా ఇంద్రియాలు, ఇంద్రియాల కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టమైనవి. ఆత్మ ఆధారంగా మనస్సును వశపరచుకోండి. విషయలాలస రూపంలో దాగిన శత్రువును నాశనం చేయండి".

మన మనస్సులోని ప్రతిచర్యలపై దృష్టి పెడుతూ కేవలం సాక్షిగా వాటిని గమనించడం ద్వారా వాటి ప్రభావం నుంచి బయట పడగలుగుతాం. కాబట్టి మన ఇంద్రియాలు ఒక భోగవస్తువు మాయలో పడకుండా వాటిని బయట నుంచి పరిశీలించ గలిగినప్పడు లేదా మన బుద్ధి మనస్సులోని ఒక ముద్రను పరిశీలిసూ దానితో తనను తాదాత్మ్య పరచు కోకుండా వివేకం చూపగలిగినప్పడు మనలోని భావాన్ని లేదా సంస్కారాన్ని జయించగలుగుతాం.

మనలోని సంస్కారాలపై పట్టు సాధించాలంటే కేవలం సాక్షీభూతంగా నిలవడమే మార్గం. బుద్ధి శ్రేష్టమని చెప్పడం ద్వారా భగవద్గీత చెబుతున్నది ఇదే! సూక్ష్మంలోనే శ్రేష్టత్వం తద్వారా స్థూల విషయాలను సాక్షిగా పరిశీలించే సుగుణం దాగి ఉన్నాయి. సాక్షిగా చూడడమంటే దేనితోనూ తాదాత్మ్యం చెందకపోవడం, తద్వారా స్థూలంలోని మాలిన్యాల నుంచి తప్పించుకోవడం. కానీ ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కన్నా ఉన్నతమైనదీ, జీవులందరిలోనూ వెలుగుతున్న దివ్య కాంతిపుంజమూ ఆ భగవంతుడే. ఆయన చలవ వల్లే ఈ జగత్తంతా నడుస్తున్నది. అందువల్ల మనం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ద్వారా హృదయ పూర్వక ప్రార్థన, ధ్యానాలతో దేవుని వైపు మరలాలి. చివరకు చెడు సంస్కారాల నుంచి మనకు విముక్తిని ప్రసాదించేది ఆయనే!.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios