డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః  గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’

ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురుపూర్ణిమ’ ‘వ్యాసపూర్ణిమ’ అని అంటారు. వ్యాస 'గురు" పూర్ణిమ  తేదీ  05 జులై 2020 ఆదివారము

గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే అని గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా, పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం.

సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. పూర్వ కాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యా బుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోనే ఆయనతోపాటు నివశించేవారు.

ఈ రోజున గురువులను పూజించి, గౌరవిస్తారు. గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ రోజున గురు భగవానుడిని, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః  గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’ గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. యతులు ఎక్కడకీ వెళ్లకుండా ఒకచోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం. ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురుపౌర్ణమి. అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తప:స్సంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురుపౌర్ణమి భూమికగా నిలుస్తుంది. గురుపూజ శ్రేష్ఠమైంది. దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది.

పురాణాల కథనం ప్రకారం:- పూర్వం వారణాసిలో బీద దంపతులు నివాసం ఉండేవారు. ఆయన పేరు వేదనిధి. ఆయన సతీమణి పేరు వేదవతి. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన , భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్ని నోములు నోచి , వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాసభగవానుడు రోజూ మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా ఆయన దర్శించుకోవాలని భావించాడు. 

ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం వేయికళ్లతో వెతకడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఒక రోజు భిక్షువు రూపంలో చేతిలో దండం , కమండలం ధరించిన వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు. ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా ‘మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను. కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరు చున్నాను’ అని అంటాడు. 

ఆ మాటలకు ఖంగుతిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా చూస్తూ, ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు. వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకిలేపి ఏమి కావాలో కోరుకోమంటారు. రేపు నా తండ్రి పితృకార్యం, దానికి తమరు అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు. వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి మహర్షి దీనికి అంగీకరిస్తాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. 

ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాసభగవానుడిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు , పువ్వులను సిద్ధం చేసి , శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహించి, అనంతరం వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్ఠుడైన ఆయన వారికి ఏ వరం కావాలో కోరుకోమన్మారు.

స్వామి ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం లేదని, ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు, ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి, వేదవతి సంతాన యోగం లభించింది. సుఖసంతోషాలతో జీవిత చరమాంకంలో విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున మహామునిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పెద్దలు అంటారు.

వేద వ్యాసుని జన్మ వృత్తాంతం:-

కృతయుగ ప్రారంభ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి ధర్ముడు పుట్టాడు. ఆ ధర్ముడికి నరుడు, నారాయణుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మహా తపస్సంపన్నులైన వారిద్దరూ అవసరమైన సమయంలో ధనుర్ధారులై రాక్షస సంహారం చేస్తారు. మిగిలిన సమయమంతా బదరికాశ్రమంలో తపస్సులో ఉంటారు. 

భూలోకానికి పైన భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము అనే అయిదు లోకాలు దాటిన తర్వాత సత్యలోకానికి కిందుగా తపోలోకము ఉంది. ఆ లోకములో తపస్వులు, సిద్ధులు ఉంటారు. వారు తమ కోరిక మేరకు కింద లోకాలలో జన్మనెత్తడం, తిరిగి వెళ్లిపోవడం అనేది యుగ యుగాలుగా జరుగుతుంది. అటువంటి తపస్వులలో ఒకరైన అపాంతరముడనే మహర్షి ఒకరోజు బదరికాశ్రమానికి వచ్చాడు. 

ఆ మహర్షిని నర, నారాయణులిద్దరూ భక్తితో పూజించారు. దానికి సంతోషించిన మహర్షి వారితో ఇలా అన్నాడు. "నర, నారాయణులారా... మీకు గుర్తున్నదా, సహస్ర కవచుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి విచిత్రమైన వరం కోరుకున్నాడు. వేయ్యేళ్లు తపస్సు చేసినవాడు, తనతో వేయ్యేళ్లు యుద్ధం చేసినప్పుడు మాత్రమే పోయేటంత సురక్షితమైన కవచం కావాలన్నాడు. అటువంటి వేయి కవచాలు అతను వరంగా పొందాడు. 

ఆ రోజుల్లో మీరు వాడితో ఒకరు యుద్ధం, ఒకరు తపస్సు చొప్పున నిర్వహిస్తూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను పోగొట్టారు. చివరిగా నరుడి వంతు వచ్చింది. మిగిలిపోయిన ఆ ఒక్క కవచంతో సహస్ర కవచుడు ఇప్పుడు సూర్యమండలంలో దాక్కున్నాడు. సూర్యుని శరణు పొందిన ఆ రాక్షసున్ని వధించటం అప్పట్లో సాధ్యం కాలేదు. ఇన్నేళ్లకు మళ్ళీ ఆ రాక్షసుణ్ణి సూర్యుడు నేలమీదకు పంపబోతున్నాడు. వాడిని వధించాల్సిన బాధ్యత నర మహర్షీ నీదే." 

"అలాగే మహర్షీ. వాడు నేల మీదకు వచ్చిన తర్వాత కదా" అని నరుడు బదులిచ్చాడు.

"అంతే. కానీ వాడిని చంపేందుకు మీరు కూడా కొత్త జన్మలెత్తాలని బ్రహ్మ ఆదేశం. ఇప్పటికే ద్వాపర యుగం పూర్తి కావస్తున్నది. రాక్షసుల వల్ల ధర్మం కల్లోలితమవుతున్నది. కృత యుగం నాటి జీవులు మీరు. ఇప్పుడున్నవారంతా అల్ప ప్రాణులు. మీ మహా దేహాలతో నేటివారిని నిర్జించటం చాలా సులువు, కానీ ధర్మం అందుకు అంగీకరించదు. అందువల్ల మీరు జన్మ తీసుకోక తప్పదు. కంస చాణూరులను, ఇంకా అనేక రాక్షసులను సంహరించి ధరాభారం తగ్గించటానికి నారాయణ మహర్షి దేవకీ గర్భాన శ్రీకృష్ణుడిగా జన్మించాలి. కర్ణ వధ కోసం నరుడు పాండవ మధ్యముడైన అర్జునుడిగా అవతరించాలి." అన్నాడు అపాంతరముడు. "సరే స్వామి" అన్నారు నర నారాయణులిద్దరూ.

అక్కడి నుండి అంతర్థానమైన అపాంతరముడు యమునా తీరంలో మత్స్యగంధికి సద్యో గర్భాన ఆషాఢ పూర్ణిమ రోజు ఉదయించాడు. సద్యోగర్భమంటే గర్భధారణ, నెలలు నిండటం, శిశువు పుట్టి పెరిగి పెద్దవాడవటం వంటి దశలన్నీ లేకుండా పోవటమే. పరాశర మహర్షి అనుగ్రహించిన వెంటనే యోజనగంధికి కృష్ణ ద్వైపాయనునిగా పుట్టగానే తరుణ వయస్కుడయ్యాడు. తలచుకున్న వెంటనే వచ్చి అడిగిన పని చేసి పెడతానని తల్లికి మాటిచ్చి తపస్సుకు వెళ్ళిపోయాడు. 

హిమాలయ ప్రాంతంలో తపస్సు చేసి అపారంగా ఉన్న వేదరాశిని విభజించి వేద వ్యాసుడయ్యాడు. శిష్యులకు వేదబోధ చేస్తూ అరణ్యకాలుగా, బ్రాహ్మణాలుగా, ఉపనిషత్తుల ఆవిర్భావానికి ప్రేరకుడయ్యాడు. కురు వంశాన్ని కాపాడటానికి దృతరాష్ట్ర, పాండురాజు మరియు విదురుల జన్మకు కారకుడయ్యాడు. ఇప్పటికీ వేదవ్యాసుడు బదరికాశ్రమంలో సజీవంగా ఉన్నాడని విశ్వసిస్తారు. 

మహా భారతంలో శ్రీమన్నారాయణుడు ప్రజాసృష్టి చేయటానికి సంకల్పించిన వెంటనే అతని నాభికమలం నుండి బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మ ముఖం నుండి వేదాలు ప్రసరించాయి. వాటికి మేలు చేయటానికి సంకల్పించిన బ్రహ్మ ఒక అపార జ్ఞానిని పుత్రునిగా పొందాడు. ఆయనే అపాంతరముడు. ఆయన వేదాలన్నింటినీ అధ్యయనం చేసి క్రమబద్ధం చేసాడు. అందుకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు అన్ని మన్వంతరాలలో మిక్కిలి ఆనందం పొందుతావని వరమిచ్చాడని మహాభారతంలో శాంతి పర్వం చెబుతుంది. 

వ్యాస పూర్ణిమ సంకల్పం:-

"గురు పరంపరాసిద్ధ్యర్థం వ్యాసపూజాం కరిష్యే".

            వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
            నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః
            గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరాః
            గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువేనమః
            లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమామ్
            అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరామ్

అని భగవంతునితో ప్రారంభమైన గురుపరంపర వ్యాసభగవానునితో కొనసాగి, మన వరకు వచ్చి కొనసాగింపబడుతోంది. కనుక వ్యాసభగవానుని ఈ రోజు  అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం. వారి గ్రంథాలలో ఏ కొద్ది భాగాన్నైనా అధ్యయనం చేయాలి. వ్యాసపీఠంపై వ్యాసదేవుని ఏదో ఒక గ్రంథాన్ని ఉంచైనా షోడశోపచారాలతో పూజించాలి. వారి ద్వారా అందిన ధర్మాన్నే గురువు మనకు ఉపదేశిస్తారు. కాబట్టి ఈ రోజు ప్రతీవారు తమ గురువులను కూడా పూజించాలి.