Asianet News TeluguAsianet News Telugu

తొమ్మిది రకాల బతుకమ్మ అవతారాలు - నైవేద్యాలు

బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. 

Different Avataras of Durga mata
Author
Hyderabad, First Published Oct 7, 2021, 3:17 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151


బతుకమ్మ పండుగకు ప్రసిద్ధమైనది తెలంగాణ ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి ' బతుకమ్మ' వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు మహాలయ అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. 

బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.


1. ఎంగిలి పూల బతుకమ్మ:- మహాలయ అమావాస్య రోజు. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు.

2. అటుకుల బతుకమ్మ :- ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

3. ముద్దపప్పు బతుకమ్మ :- ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు.

4. నానే బియ్యం బతుకమ్మ :- నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.

5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

6. అలిగిన బతుకమ్మ :- ఆశ్వీయుజ పంచమి. ఈ రోజు నైవేద్యం సమర్పించరు.

7. వేపకాయల బతుకమ్మ :- బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

8. వెన్నముద్దల బతుకమ్మ :- నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు.

9. సద్దుల బతుకమ్మ :- ఆశ్వీయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి.


మలిద లడ్డు - కావాల్సిన పదార్థాలు.
గోధుమ పిండి- 1కప్పు
బెల్లం- 1/2 కప్పు
జీడి పప్పు, కిసమిస్ , ఏలకుల పొడి,
పాలు - 1 టేబుల్ స్పూన్.
నెయ్యి - 1 టేబుల్ స్పూన్.
నీరు తగినంత

తయారీ విధానం:- ముందుగ పిండిని మృదువుగా కలుపుకొవాలి. చిన్ని చిన్న ఉండలను చపాతీగా వత్తుకోవాలి. వీటిని ముక్కలుగా చేసుకొని బాణలిలో వేసి సన్న మంట మీద ఉంచాలి. దాంట్లో బెల్లం, జీడి పప్పు, కిస్మిస్, ఏలకుల పొడి అన్ని వేసి నెయ్యి వేసి బాగా కలుపుకొవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. పాలు కలుపుకుని లడ్డూలు తయారుచేసుకోవాలి.


బతుకమ్మలను నిమజ్జనం:- చీకటి పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్నపెద్ద చెరువుకు ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకిరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో అత్యంత సుందరంగా శోభానమయమై నయనానందంగా కనబడుతూ ఉంటుంది .ఈ ఊరేగింపు కొనసాగినంత సేపు జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి.

జలాశయం చేరుకున్న తరువాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ.. ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత "మలీద" (చక్కెర మరియు రొట్టెతో చేసినది) అనే పిండి వంటకాన్ని బంధు,మిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబలంతో బతుకమ్మను కీర్తిస్తూ ఆనందంగా ఇంటికి చేరుతారు. ఈ శరన్నవరాత్రులలో తొమ్మిది రోజులూ బతుకమ్మ పాటలన్నీ అర్ధరాత్రి వరకూ వీధులలో మారు మ్రోగుతూనే ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios