Asianet News TeluguAsianet News Telugu

ప్రతి ఒక్కరూ కచ్చితంగా మార్చుకోవాల్సిన అలవాట్లు ఇవి..

ఈ ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. 

Common Bad Habits You Need to End Right Away
Author
Hyderabad, First Published Jan 18, 2021, 2:58 PM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Common Bad Habits You Need to End Right Away


వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే..

* అతినిద్ర
* బద్ధకం
* భయం
* క్రోధం
* అలసత్వం
* ఎడతెగని ఆలోచన

...అనే ఈ ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. 

నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది.

 అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. 

మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి. 

ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే..

 నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే. 

 రెండో లక్షణం బద్ధకం. ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం. 

అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని అనుమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం. 

 ఇక.. క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు.

అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు. 

అలాగే.. 

ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం. 

Follow Us:
Download App:
  • android
  • ios