Asianet News TeluguAsianet News Telugu

అష్టలక్ష్మి స్తోత్రం - మహత్యం

అష్ట అంటే ఎనిమిది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ ఎనిమిది లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. 

Ashta Lakshmi Stotram
Author
Hyderabad, First Published May 8, 2020, 10:48 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Ashta Lakshmi Stotram

అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశిష్టత, ఈ స్తోత్రం పఠించడం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతుంటే అష్టకష్టాలు పడుతున్నాం అని, ఎక్కువగా సుఖాలు అనుభవిస్తుంటే అష్టైశ్వర్యాలు పొందుతున్నాం అని అనుకోవడం పరిపాటి. మన కష్టాల నుంచి సుఖాల వైపు మళ్ళీంచగలిగే శక్తి ఆ ఆదిమాతకే ఉంది. అష్టకష్టాలు నుంచి అష్టైశ్వర్యాలు 
ప్రసాదించు అద్భుత స్తోత్రమే " అష్టలక్ష్మీ స్తోత్రం "

అష్ట అంటే ఎనిమిది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ ఎనిమిది లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. 

ఆదిలక్ష్మీ :- వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉండేది ఆదిమాత.. అదే ఆదిలక్ష్మి.. ఈ సృష్టికి మూలం నారాయణుడు అని కొందరు.. కాదు అమ్మే అని మరి కొందరి విశ్వాసం.. నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరూ ఒక్కరే! లక్ష్మి దేవి చేతిలో కనిపించే కమలము పవిత్రతకు చిహ్నం.. ఇందిరా దేవి అని కూడా ఈ రూపంలో వీరిని పూజిస్తారు. ఆది లక్ష్మిని ఆరాధించుట వలన సంతోషం, పవిత్రత మనకు లభిస్తాయి. 

ధాన్య లక్ష్మి :- ధాన్యం అంటే పండించిన పంట అని అర్థం. అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించుట వలన మన జీవితానికి కావల్సిన అన్ని రకాల విటమిన్స్, పండ్లు, ఆహారం మొదలైనవి అన్నీ సుఖంగా పొందుతాం.. అంతే కాకుండా పంటలు సరిగ్గా పండాలి అన్న.. అతి వృష్టి అనావృష్టిని కాపాడుకోవాలి అన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండవలసిందే! 

ధైర్య లక్ష్మి :- కొంతమంది ఎన్నీ కష్టాలు .. ఉన్న ధైర్యంగా ఎదుర్కొంటారు, మరికొందరు పిరికిగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు.. 
మనకు కావలసిన అన్ని రకాల శక్తి - సామర్ధ్యాలు ఈ అమ్మ వలననే లభిస్తాయి.. పూర్వం ఒక కధ ప్రాచుర్యంలో ఉండేది.. ఒక మహారాజు గ్రహస్ధితి బాగుండక అష్ట లక్ష్ములు ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళి పోతుంటారు.. చివరికి ధైర్యలక్ష్మి వంతు వస్తుంది.. కాని అప్పుడు ఆ రాజు ఈమెని తనని విడచి వెళ్ళవద్దు.. వారందరూ వెళ్ళి పోయినా పర్వాలేదు ఒక్క నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు.. మళ్లీ వారందరినీ 
పొందగలనని విశ్వాసంగా వుంది.. విడచి వెళ్ళవద్దు అని ప్రాధేయ పడతాడు... నిజమే ప్రతి మనిషికి ముఖ్యంగా కావాల్సింది మానసిక స్ధైర్యమే.. అది ఉంటే ఎన్ని ఇబ్బందులు అయినా ధైర్యం గా ఎదుర్కోవచ్చు. ఇది ధైర్య లక్ష్మి ప్రాధాన్యత.

గజలక్ష్మి :- ఈ అవతారం దేవ దానవులు సముద్ర మధనం సాగించే సమయంలో సముద్రుని కూతురుగా ఈ రూపమ్లో ఉద్భవించినట్లు భాగవతం చెబుతుంది. రెండు ఏనుగులు అమ్మ ప్రక్కన నిలబడి జలధారని వర్షింప చేస్తూంటాయి ఇక్కడ ఏనుగులు మనం గణపతి స్వరూపంగా కూడ భావించవచ్చు.. లక్ష్మి గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించుట వలన ఇల్లు, వాహనాలు వంటి భౌతిక సుఖాలు
మనకు ఒనగూడుతాయి.

సంతాన లక్ష్మీ :- ఏ భార్య భర్తలకైనా తమ కుటుంబానికి కావల్సిన మొదటి సంపద సంతానమే.. అది లేకుంటే జీవితాన్ని నిస్సారం గా గడపవలసి వస్తుంది.. అలాగే కర్మ పరిపక్వత కూడా ఉండదు.. అందుకే ఈ శక్తి ని పూజించి తప్పక ప్రసన్నం చేసుకోవాలి.. అప్పుడే సంతానం పొందడమే కాకుండా వారికి సద్బుద్ధి, ధీర్ఘాయుస్సు లభిస్తాయి.

విజయ లక్ష్మీ :- పేరులోనే ఉంది పెన్నిది.. బాహ్య - అంతర్గత మనసుపై విజయం పొందాలని అన్నా.. శారీరకంగా, ఆర్ధికంగా ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై విజయం పొందాలి అంటే విజయ లక్ష్మి కృప ఉండి తీరవలసిందే!

ధనలక్ష్మి :- భూమిపై సంపద లేదా ధనం అంటే రూపాయలు బంగారు ఆభరణాలు కాదు.. పకృతిలో ఉండు అన్ని రకాల నదులు, ఫలవంతం అయిన చెట్లు, సమృద్ధిగా కురియు వర్షాలు ఇవ్వన్నీ సంపద క్రిందే వస్తాయి.. కనుక అవన్నీ మనకు ధన రూపంగా మార్చి ఇచ్చేది ఈ దేవతే.

విద్యాలక్ష్మి :- పాఠశాలలో, కళాశాల, విశ్వవిద్యాలయల్లో లభించే విద్యే కాదు.. ఏ తరహా విజ్ఞానం కావలన్న ఈమెను ఆశ్రయించ వలసినదే.. ఆధ్యాత్మికం.. భౌతికం ఎందులో ఏ విద్య అయినా మనకు అందులో దక్షత ఏర్పడాలి అంటే ఈ లక్ష్మి దయ మనకు ఉండవలసిందే. నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్ట లక్ష్ముల ప్రతీకలే!

అష్ట లక్ష్ములని పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయి అనేది ఎందరో చెప్పిన మాట..షోడశ అంటే 16.. ఇప్పుడు ఆ ఫలాలు ఏమిటో చూద్దాం...

1 కీర్తి, 2 జ్ఞానం, 3 ధైర్యం.. బలం, 4 విజయం , 5 సత్సంతానం
6 యుద్ధ నైపుణ్యం, 7 బంగారం ఇతర సంపదలు,
8 సంతోషం, 9 భౌతిక సుఖాలు, 10 తెలివితేటలు, 11 అందం 
12 విద్యాభివృద్ధి, 13 ఉన్నత విలువలు.. ధ్యానం, 
14 నీతి నియమాలు, 15 మంచి ఆరోగ్యం, 16 దీర్ఘ ఆయుః.
 
అష్టలక్ష్మీ స్తోత్రం:-

ఆదిలక్ష్మి :-
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే 
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే | 
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే 
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||

ధాన్యలక్ష్మి:-
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే 
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే 
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||

ధైర్యలక్ష్మి:-
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే 
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే | 
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే 
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||

గజలక్ష్మి:-
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే 
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే | 
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే 
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||

సంతానలక్ష్మి:-
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే 
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే 
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||

విజయలక్ష్మి:-
జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే 
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే | 
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే 
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||

విద్యాలక్ష్మి:-
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే 
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే 
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||

ధనలక్ష్మి:-
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే 
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే 
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||

ఫలశృతి:-
శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి | 
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ||

శ్లో|| శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్

కనుక దేవున్ని కొలిచే ప్రతి ఒక్కరూ నిత్యం ఈ స్తోత్రం చదవడం వలన పై ప్రయోజనాలు కొన్ననైనా పొందవచ్చు. అలాగే జాతక రిత్యా శుక్ర గ్రహ ప్రీతి కొరకు, దోష నివారణకు కూడా ఇది చదవవచ్చు.. దీని వలన భార్య భర్తల మధ్య సఖ్యత,  సుఖాలు లభిస్తాయి. ఇంట్లో శ్రీ చక్రం ఉన్న వారు దానికి దగ్గర ఈ అష్ట లక్ష్ముల ఫొటో పెట్టి ఇది చదవడం మరింత వేగంగా ఫలించేలా చేస్తుంది.. అలాగే క్షీరాన్నము లేక పాల కోవా నివేదన చెప్పబడుతోంది. లక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు.. ఐశ్వర్య మస్తు.. !

Follow Us:
Download App:
  • android
  • ios