పెళ్లంటే.. నూరేళ్ల పంట. మూడుముళ్ల బంధంతో.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని ఎన్నో జంటలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈపాటికే ఎందరో పెళ్లి బంధంతో ఒక్కటి కావాల్సి ఉంది.  కానీ.. అనుకోకుండా కరోనా వైరస్ ఉపద్రవంలా వచ్చి పడింది. దీంతో.. ఈ వైరస్ సమయంలో ఎందుకులే అని చాలా మంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు.

మరి కొద్ది రోజుల్లో లాక్ డౌన్ కూడా ముగియనుంది. దీంతో.. అతి కొద్ది మంది బంధువుల మధ్యలో పెళ్లి చేసేసుకుందామని చాలా మంది భావిస్తున్నారు. అయితే.. ఈ వేసవిలో పెళ్లి చేసుకోవాలని సంబరపడుతున్న ఎందరకో ఇది మింగుడు పడని వార్త. ఎందుకంటే.. ఈ వేసవిలో పెళ్లికి మంచి ముహుర్తాలు పెద్దగా లేవని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.

వాస్తవానికి దగ్గర్లో  మంచి ముహూర్తాలు లేకుండా పోయాయి. ఇప్పటికే పలు ముహూర్తాలు ముగిసిపోగా, ఇక గురు, శుక్ర మూఢాలు, అధిక అశ్వీయుజ మాసం, ఆషాఢం, భాద్రపదం తదితర కారణంతో శుభకార్యాలు చాలా తక్కువ. 

సాధారణంగా..వేసవి కాలం ముహూర్తాల్లోనే వివాహాలు జరుపుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. సెలవు కాలం అందరికీ కలిసి వస్తోందని భావిస్తారు. ఈ వేసవి కాలంలోని ఏప్రిల్, మే నెలల్లోనే చాలా వరకు ముహూర్తాలు ఇప్పటికే ముగిసిపోగా, ఈ నెల 29, వచ్చేనెల 10, 11 తేదీల్లోనే శుభ ముహూర్తాలు ఉన్నాయి. 

మే 30 నుంచి జూన్‌ 9 వరకు 10 రోజుల పాటు మూఢం కారణంగా   శుభకార్యాలకు వీలుండదు. ఆ తర్వాత రెండురోజులు ముహూర్తాలు ఉన్నా.. జూలై 20 వరకు ఆషాఢమాసం.. శూన్యమాసం కావడంతో శుభకార్యాలు ఉండవు. జూలై 23 నుంచి వరుసగా రెండు రోజులపాటు శుభముహూర్తాలు ఉన్నాయి. 

తిరిగి వారం రోజుల తర్వాత ఆగస్టు 2, 7, 8, 14వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. వర్షాకాలం కావడంతో ఈ సమయం అత్యధిక శాతం శుభకార్యాలకు ఆసక్తి కనబర్చరు. ఇక ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు భాద్రపదం, శూన్యమాసం కావడంతో శుభకార్యాలు ఉండవు. 

ఆ తర్వాత అక్టోబర్‌ 16వ వరకు నెల రోజులు అధిక అశ్వీయుజ మాసం, శూన్యమాసం కావడంతో మంచి ముహూర్తాలకు అవకాశం లేకుండా పోయింది. అక్టోబర్‌ 21, 28, 29, 30, నవంబర్‌ 6, 11 నుంచి డిసెంబర్‌ 6 వరకు మంచి ముహూర్తాలు ఉన్నా శుభకార్యాల కోసం పెద్దగా ఆసక్తి కనబర్చరు.