హైటెక్ సీఎం అంటే ఆమాత్రం వుంటుంది... సరికొత్త టెక్నాలజీతో ఏపీ కేబినెట్ మీటింగ్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ జరిగిన మంత్రిమండలి సమావేశం హైటెక్ పద్దతిలో జరిగింది. చంద్రబాబుతో సహా మంత్రులంతా టెక్నాలజీని ఉపయోగించి కీలక అంశాలపై చర్చించారు.
Andhra Pradesh e Cabinet Meeting : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైటెక్ సీఎంగా పేరుంది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు... ప్రజలకు కూడా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయన ఎంతటి టెక్ ప్రియుడో అంతటి పర్యావరణ ప్రేమికుడు కూడా. తాజాగా అటు టెక్నాలజీ వినియోగం... ఇటు పర్యావరణాన్ని కాపాడుతూ సరికొత్తగా మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇవాళ కేబినెట్ సమావేశానికి సరికొత్త ఏర్పాట్లు చేసారు అధికారులు. పర్యావరణ హితంగా పేపర్ లెస్ కేబినెట్ నిర్వహించారు.ఇందుకోసం సీఎంతో పాటు మంత్రులు ఐపాడ్ లు ఉపయోగించారు. నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIC) సహకారంతో అభివృద్ది చేసిన ఈ-కేబినెట్ యాప్ ను ఈ సమావేశంలో ఉపయోగించారు.
అయితే ఈ-కేబినెట్ యాప్ తో కూడిన ఐపాడ్ లను మంత్రులకు ముందుగానే అందజేసారు అధికారులు. అంతేకాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్, ఎన్ఐసి బృందం మంత్రులకు ఈ యాప్ వినియోగం గురించి వివరించారు. నిన్న(మంగళవారం) మధ్యాహ్నమే ఒక్కో మంత్రికి, ఆయన పర్సనల్ సెక్రటరీలు, ఓఎస్డిలకు ఈ-కేబినెట్ యాప్ సాంకేతిక అంశాలు, వినియోగం, ప్రయోజనాలపై శిక్షణ ఇచ్చారు. తద్వారా కేబినెట్ భేటీ సమయంలో మంత్రులు యాప్‌ను సులభంగా ఉపయోగించేలా చూసారు. ఇవాళ కేబినెట్ సమావేశం ప్రారంభంకాగానే మంత్రులకు ఈ ఐపాడ్‌లు, ఈ-కేబినెట్ యాప్ వినియోగంపై అధికారులు డెమో ఇచ్చారు.
గతంలో 2014-2019 మధ్య కూడా చంద్రబాబు ప్రభుత్వం పేపర్‌లెస్ కేబినెట్ నిర్వహించింది. అయితే ఆ సమయంలో వేరే యాప్ ఉపయోగించేవారు. ఇక వైసిపి అధికారంలోకి వచ్చాక ఈ కేబినెట్ సమావేశాల నిర్వహణ ఆగిపోయింది. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పేపర్ లెస్ కేబినెట్ సమావేశాలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు.దీంతో పూర్తి ఫీచర్లు, ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్లోతో కూడిన సమగ్ర యాప్ డిల్లీలోని ఎన్ఐసి సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేసారు. ఈ కేబినెట్ యాప్ ద్వారా ఇవాళ కేబినెట్ సమావేశం జరిగింది.
ఈ-కేబినెట్ యాప్ ఉపయోగాలు :
- పేపర్‌లెస్ కాన్సెప్ట్‌తో కేబినెట్ సమావేశం నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది.
- కేబినెట్ సమావేశంలో టాప్ & గో విధానంలో ఈ యాప్ ను సులభంగా వినియోగించుకోవచ్చు.
- కేబినెట్ పత్రాలు, చర్చలకు సంబంధించిన వివరాలు సురక్షితంగా, రియల్ టైం యాక్సెస్ కలిగివుంటాయి.
- ఈ యాప్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా కేబినెట్ మీటింగ్ కు సంబంధిత సమాచారాన్ని పొందవచ్చు
- రికార్డుల డిజిటైజేషన్ జరుగుతుంది, గత సమావేశాల సమాచారం ఈజీగా పొందవచ్చు.
- కేబినెట్ నిర్ణయాల అమలు స్థితిని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
- ఈ-కేబినెట్ యాప్‌లో ఎన్‌క్రిప్షన్, యాక్సెస్ కంట్రోల్స్, ఆడిట్ ట్రెయిల్స్ వంటి పటిష్టమైన భద్రతా లక్షణాలు ఉన్నాయి, ఇవి అనధికార యాక్సెస్ ను నిలువరించి సున్నితమైన సమాచారాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
- వర్చువల్ కేబినెట్ సమావేశాలను నిర్వహించడానికి, ఈ-ఆఫీసుతో సమగ్రపరచడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా విశ్లేషణ వినియోగించడానికి అదనపు ఫీచర్లను ఈ-కేబినెట్ యాప్ కలిగివుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ-కేబినెట్ యాప్ ను ప్రశంసించడమే కాదు మంత్రులందరు తాజా సాంకేతికతను ఉపయోగించాలని ఆదేశించారు. సాంకేతికత వినియోగం ద్వారా నిర్ణయాలు సమర్థవంతంగా, త్వరగా తీసుకోవడం సాధ్యమవుతుందని... ఇది సుపరిపాలనకు దారితీస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఐటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రియల్ టైం గవర్నెన్స్ కోసం కొత్త యాప్‌లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మొబైల్, సిసిటివి కెమెరాలు, డ్రోన్లు, ఫైబర్‌నెట్ వంటి అన్ని సాంకేతికతలను అనుసంధానం చేయడం, వాటిని వివిధ నిర్ణయాల కోసం ఉపయోగించేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.