ఏపిలో సింగపూర్ తప్పేట్లు లేదుసింగపూర్ కన్ఫార్ఫియం కోసం ఏకంగా మన చట్టాలనే మారుస్తారా?
అందరూ భయపడుతున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో సింగపూర్ పాలన తప్పేట్లు లేదు. రెండేళ్ళ క్రితం చంద్రబాబునాయడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి రాష్ట్రాన్ని విదేశీ జాఢ్యం పట్టి పీడిస్తోంది. అయితే, ఆ జాఢ్యం సింగపూరేనని మెల్లిగా జనాలకు అర్ధమౌతోంది. లేకపోతే, రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యతలను సింగపూర్ కంపెనీలకు కట్ట బెట్టటానికి ఏపి చట్టాలను మార్చాలని ఎవరైనా అనుకుంటారా? ఒక్క చంద్రబాబు తప్ప అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
సిఎం అయినది మొదలు చంద్రబాబుకు సింగపూర్ భజన చేయటానికే సమయం సరిపోవటం లేదు. ఇప్పటికే పలుమార్లు స్వయంగా సింగపూర్ వెళ్ళిన చంద్రబాబు మరి కొన్ని సార్లు తన నమ్మిన బంటు నారాయణను పంపారు. మొత్తానికి రాష్ట్ర ప్రజలకు, మంత్రివర్గంలోని పలువురు సభ్యులకు, అనేక మంది ఉన్నతాధికారులకు కూడా విషయాలేవీ అర్ధం కాకుండా, తెలీకుండా వ్యూహరచన చేస్తూ వస్తున్నారు ఇంతకాలం. చాలా మందికి తెలీని స్విస్ ఛాలెంజ్ విధానంలో అమరావతి నిర్మాణం మంటూ చంద్రబాబు ఊదర కొడుతున్నారు.
పేరుకే అమరావతి ప్రజా రాజధాని కానీ అసలు ప్రజలకు ఏమాత్రం సంబంధం లేదు, ప్రతీ విషయమూ గోప్యమే. దాంతో అమరావతి నిర్మాణం మొత్తం చిందబర రహస్యంగా తయారైంది. సింగపూర్ నుండి ఇప్పటికే ఎన్నో బందాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఈ విషయాలన్నింటినీ గమనించిన అనేక మంది న్యాయస్ధానాల్లో కేసులు వేసినా ఉపయోగం కనబడలేదు.
అయితే, మైదరాబాద్, చెన్నైలకు చెందిన నిర్మాణ కంపెనీలు దాఖలు చేసిన కేసులతో ప్రభుత్వ బండారం దాదాపు బయటపడింది. దాంతో హై కోర్టు కూడా ప్రభుత్వానికి బాగా తలంటింది. ప్రభుత్వ సంస్ధలను కూడా పక్కకు బెట్టి సింగపూర్ కంపెనీలతో అంటకాగటాన్ని న్యాయస్ధానం విచారణ సందర్భంగా పలుమార్లు ఆక్షేపించింది. తన విధానాన్ని పున: సమీక్షించుకోమంటూ హెచ్చరించింది.
దాంతో చంద్రబాబు సింగపూర్ జపం మానుకుంటారని చాలా మంది ఆశించారు. అయితే, అందరూ ఆశించినదానికి భిన్నంగా సింగపూర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఏపి చట్టాలనే మార్చటానికి సిద్ధపడటంతో పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. విదేశీ మోజు ఉండచ్చుగానీ మరీ సింగపూర్ సంస్ధలకు అనుకూలంగా ఏకంగా మన చట్టాలనే మార్చేందుకు చంద్రబాబు పూనుకుంటారని ఊహించని పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా షాక్ అవుతున్నారు. దాంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏపిలో సింగపూర్ పాలన తప్పేట్లు లేదన్న ప్రచారం బాగా ఊపందుకున్నది.
