బిజెపి-టిడిపి అనుబంధం చాలా మంది సీనియర్ నాయకులను ఇబ్బంది పెడుతూ  ఉంది. దీని వల్ల పార్టీ బలపడదని చెబుతున్నారు.తమకూ భవిష్యత్తు ఉండదని  ఆందోళన చెందుతున్నారు.

భారతీయ జనాతా పార్టీ నుంచి చాలా మంది సీనియర్ నాయకులు జారుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. కాంగ్రెస్ కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నయంగా , తెలుగుదేశం తర్వాత రెండో పెద్దపార్టీగా 2019లోపు అవతరిస్తుందనుకున్న ఆశలు నెరవేరే దిశగా పార్టీ నడవలేకపోవడంతో, ఆంధ్రప్రదేశ్ లో కాషాయ పార్టీ పచ్చపార్టీకి జూనియర్ గా వుండేందుకే కొంతమంది జాతీయ నాయకులు ఇష్టపడుతున్న నేపథ్యంలో ఈ నాయకులు మరొక బతుకు దెరువు చూసుకోవాలనుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

 సభ్యత్వం పెరిగిందని చంకలెగరేసుకోవడం తప్ప రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించే స్థితిలో కూడా పార్టీ లేకపోవడం పట్ల వాళ్లు ఆవేదన చెందుతున్నరు.

2014 తర్వాత ఒక మహా శక్తిగా ప్రధాని నరేంద్రమోడీ ఎదగడంతో, ఆయన స్ఫూర్తితో ఇక బిజెపి రాష్ట్రంలో స్వతంత్ర శక్తిగా బలపడుతుందని, టిడిపి పెత్తనం నుంచి బయటపడుతుందని చాలామంది భావించారు.

ఎందుకంటే, ఈ రాష్ట్రంలో బిజెపి బతుకున్నదంతా టిడిపి నీడలోనే. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్నా అది తెలుగుదేశం పార్టీ రెండో సారి గెలిచేందుకు ఉపయోగ పడిందే తప్ప బిజెపికి అసెంబ్లీలో రెండు మూడు అదనపు సీట్లను కూడా తెప్పించలేకపోయింది.

అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్ కె అద్వానీ వంటి మహానేతల కాలంలో కూడా బిజెపి స్వయంగా లేచి నిలబడే స్థాయికి రాలేదు. అలాంటి శక్తి లేనందునే, వాజ్ పేయి నాయకత్వంలో జరిగిన కార్గిల్ యుద్ధం, పాకిస్తాన్ పై భారత్ విజయమూ తెలుగుదేశం పార్టీని బలపర్చి మరొక సారి 1999లో అధికారంలోకి వచ్చేలా చేశాయో తప్ప బిజెపికి పట్టమని పది క్యాలరీల శక్తి కూడా ఇవ్వలేక పోయాయి. 

ఇపుడు నరేంద్రమోడీ ఎంత గొప్ప జాతీయాభిమానం చూరగొన్నా, అది తెలుగుదేశం పార్టీకి లాభమో తప్ప, ఆంధ్ర బిజెపి జుర్రు కునేదేమో ఉండదని ఈ నాయకులు భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీజతలో బిజెపి కొనసాగితే, అది కొంతమంది టిడిపి రక్త సంబంధీకులకు తప్ప పార్టీకి ఉపయోగం ఉండదని, ఈ పార్టీకి ఇంతకంటే మహర్ధశ ఆంధ్రలో లేదని, అంతేకాదు, రాష్ట్రంలోఅధికారంలోకి వచ్చే ఆలోచన కలలో కూడా చేయలేదని వారనుకుంటున్నారు. అందువల్ల వేరే దారి చూసుకోవడం మందిచదనేది వారి ఆలోచన.

పెద్ద పెద్ద ఆశలతో పార్టీలోకి వచ్చిన కన్నా లక్మి నారాయణ, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కాటసారి రాంభూపాల్ రెడ్డి తదితర సీనియర్ నాయకులు ఉన్నారు. వీరెటుపోతారనేదాని కంటే వీళ్లలో ఇలాంటి ఆలోచన రావడం పార్టీ వ్యూహత్మక వైఫల్యమే కారణమని చెబుతున్నారు.

 2014 ఎన్నికల తర్వాత , మోదీ హాయంలో బిజెపి తెలుగుదేశం ఉపగ్రహంగా కాకుండా స్వతంత్ర పార్టీ గా బయటపడుతుందని అంతా అనుకున్నారు. దీనికోసం జాతీయ స్థాయిలో కూడా చాలా కృష్టి జరిగింది. మోదీ కూడా డిడిపి అధినేత చంద్రబాబు నాయుడి ఒక ముఖ్యమంత్రిగా తప్ప ప్రత్యేక మిత్రుడిగా చూడలేదు.

జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ లాంటి వారు బిజెపిని అన్నికులాల వేదిక చేసేందుకు ప్రయత్నొంచారు. ఇందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులను బిజెపిలో చేర్చుకున్నారు. కన్న, పురందేశ్వరి, కాటసాని వంటి చేరిక విధాన ఫలితమే. 

ఈ విధానాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే ఉద్దేశం మాకు ఉందని అన్ని వర్గాలకు సంకేతాలు పంపే ఉద్దేశంతోనే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు హరిబాబును మార్చి పార్టీని స్వతంత్ర పార్టీగా నడిపించగల స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న నాయకుడికి పగ్గాలు ఇస్తారని భావించారు.

దీనికి తగ్గట్టుగానే పార్టీ ఈ విధానం మద్దతుదారులు, బిజెపి తెలుగుదేశం ఉపగ్రహంకాదు, దాని కొక విధానం ఉందని చెప్పేందుకు అదికార పార్టీ తప్పదాలను వెలెత్తి చూపడం మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపే విధంగా రాయలసీమలో పాదయాత్రలు చేశారు. కరువు గురించి సెమినార్లు పెట్టారు. కొత్త అధ్యకుడు కావాలనే కాంపెయిన్ మొదలుపెట్టారు. అయితే, ఈ విధానాన్ని ఉపసంమరించుకుని, తెలుగుదేశ దేశంలోనీడలోనే ఈ జీవితమిలాసాగిపోనీ అనేలా పాత దారికి పార్టీ ని తీసుకువాడం పార్టీలో చాలా చర్చనీయాంశమయింది. ఇది చర్చకు రాని రాష్ట్ర కార్యవర్గ సమావేశం లేదు.

ఇపుడు తాజాగా ప్రత్యేక ప్యాకేజీ, పోలవలం బదిలీ తర్వాత బిజెపి తెలుగుదేశం రక్త సంబంధీకుల పట్టు బిగుసుకుందని, మోదీ వచ్చాకా కూడా బిజెపిలో మార్పు వచ్చేలా లేదనే నిర్ణయానికి చాలా మంది నాయకులనుకుంటున్నారు.

రాయలసీమకు చెందిన ఒక జిల్లా అధ్య క్షుడి వేదన ఎలా ఉందో చూడండి . “ తెలుగుదేశం ప్రభావం నుంచి బిజెపి ని ప్రధాన మంత్రి మోదీ బయట వేస్తాడని ఆశించాం. దానికి ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్రంలో బిజెపి రెండో శక్తిగా ఎదుగుతుందనుకున్నాం. ఈ ప్రయత్నాలకు బాగా మద్దతు కూడా లభించింది. అయితే, ఇపుడున్న పరిస్థితి చూస్తే, బిజెపిఇలాగే కొనసాగుతుందని తప్ప బలపడదని, పార్టీకి కొంతమంది సీనియర్ నాయకులు తీరని ద్రోహం చేశారనిపిస్తుంది.”

“గడువు అయిపోయినా, పార్టీ అధ్యక్ష పదవికి కొత్త వ్యక్తి ని నియమించలేకపోవడం వల్ల పార్టీ మీద తెలుగుదేశం ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. పక్కనున్న తెలంగాణాలో కొత్త అధ్యక్షుని నియమించి ఆంద్రలో నియమించకపోవడానికి కారణమేమిటి, ఎవరు,’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. 

బిజెపి రాష్ట్ర కమిటి అధ్యక్షుడి నియమకం తెలుగుదేశం నేత ఇష్టా యిష్టాల మీద ఆధారపడి ఉంటుందా అనేది చాలా మంది ప్రశ్న.

ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధోరణిని వ్యతిరేకించే బిజెపి నాయకులు, పార్టీకే కాదు, తమకు కూడా నేపథ్యంలో పార్టీలో భవిష్యత్తు ఉండదని అనుకుంటున్నారు. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం నేత తన పలుకుబడి ఉపయోగించి తమకు సీట్లు రాకుండా చేయవచ్చు లేదా సీట్లు వచ్చినా ఏదో ఒక మూలా కేటాయించేటట్లు చేయవచ్చు, లేదా తెలుగుదేశం ముసుగువీరులను నిలబెట్టి ఓడించే ప్రయత్నం చేయవచ్చు. అందువల్ల వేరేదారి చూసుకోవడం మంచిదని వీరంతా అనుకుంటున్నట్లు గత వారంలో వైజాగ్ లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న నాయకుడొకరు ’ఏషియానెట్ తెలుగు’ ప్రతినిధికి చెప్పారు.

బయటకు వెళ్లే ఆలోచనలో ఉన్నా మోదీ నాయకత్వం కోసం వీరంతా పని చేస్తారట.

మరి తదుపరి పయనమెటు అన్నపుడు, ఆ సమయం రానీయండని తప్పుకున్నారు.