Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో రిక్షా లాగా ఆటో కూడా మాయమవుతుందా?

  • గ్లోబల్ హై దరాబాద్ లో ఛిద్రమవుతున్న  ఆటోవాలా బతుకు దెరువు
  • రాష్ట్ర విభజన, ఆంధ్రప్రభుత్వం విజయవాడ వెళ్లడం
  • ఓలా,  ఉబర్ క్యాబ్ దెబ్బ తో చతికిల పడుతున్న  ఆటోలు
  • సంక్షోభం పడుతున్న  రెండు మూడు లక్షల కుటుంబాలు
Hyderabad Autowala is in crisis

ఆటోవాల హైదరాబాద్ లో చతికిల పడబోతున్నాడు. ఇక బతుకు దెరువుకోసం అటో నడపడం కష్టమపోతున్నది, మరొక పని చేసుకోవలసివస్తున్నదని, నల్గొండ దేవకకొండకు చెందిన సోమ్లానాయక్ అవేదన. నాయక్  బతుకుదెరువు కోసం   హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ బండ్లగూడలో మొదట కొంత మంది మిత్రులతో కలసి ఒక రూం అద్దెకు తీసుకుని అటో నడపసాగాడు. తర్వాత తల్లితండ్రులను కూడా తీసుకువచ్చాడు.  పర్వాలేదు, జీవితం సాఫీగా సాగుతూ ఉందన్నకునపుడు ఆటోమీద వచ్చే అదాయం  సన్నగిల్లింది. 

చార్ మినార్ ఏరియాకు చెందిన అమీర్ పరిస్థితి ఇదే.  ఆటోమీద ఆదాయం పడిపోయింది.  ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడం ఆటో ఆదాయం దెబ్బతీసిందని అమీరు వాదిస్తాడు.  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం కూడా ఇక్కడే ఉండటం వల్ల అటోలకు బాగా గిరాకి వుండేంది. ప్రభుత్వం పని రోజూ ఆంధ్ర సెక్రటేరియట్ కు వచ్చే వాళ్ల బస్టాండ్ నుంచిరావాడనికి పోవడానికి,  లాడ్జింగ్ లకు వెళ్లడానికి, ఇతర పనిమీదనగరంలో తిరగడానికి విధిగా ఆటోవాడేవారు. క్యాబ్ అంత పాపులర్ కాని రోజులవి. ఇదే విధంగా కొద్దిగా ఆదాయం బాగా ఉన్నావాళ్ల కూడా ఆటోలోప్రయాణించడం జరిగేది. ఆటోలకు అది స్వర్ణ యుగం. రాబడి బాగా ఉండేది. అటో వోనర్ కు  నూరు నుంచి రెండు వందల దాకా కిరాయి చెల్లించినా,  నాయక్, అమీర్ రోజూ కనీసం   రెండు వందల నుంచి మూడు వందల దాకా ఇంటికి తీసుకెళ్లే వారు. అంతేకాదు, విధంగా అదివారం సెలవు కూడాతీసుకునేవారు.  ఇపుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ వెళ్లిపోయాక బిజినెస్ బాగా దెబ్బతినిందనేది ఇద్దరి అభిప్రాయం. హైదరాబాద్ లో దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షల ఆటోలున్నాయిని అంచనా.

 

ఇపుడు హైకోర్టు విభజన జరిగితే, పరిస్థితి మరీ విషమిస్తుంది.  ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి కోర్టు కేసుల నిమిత్తం హైకోర్టుకు వచ్చే వారి సంఖ్య  పూర్తిగా పడిపోతుంది.  న్యాయవాది కరణం శ్రవణ్ కుమార్ చెప్పేదాని ప్రకారం హైకోర్టు కేసులలోహైదరాబాద్ కేసులు మినహాయిస్తే  మిగతా కేసులలో 60 శాతం నుంచి 70శాతం  ఆంధ ప్రాంతం నుంచి వచ్చేవి.  కోర్టు విభజన జరిగితే, ఈ కేసుల నిమిత్తం వచ్చే క్లయింట్సు హైదరాబాద్ రానవసరం లేదు.

 

 ఇలాంటి భయం పీడిస్తుండగనే హైదరాబాద్ ఓలా, ఉబర్ క్యాబ్ లు   ఈ మధ్య చాలా ప్రాచర్యం పొందాయి. ఈ క్యాబ్ సర్వీస్ లలో షేరింగ్ సర్వీస్ ఆటో వాలా మీద ఇంకొక చావు దెబ్బ వేసింది.  దీనితో ఇపుడు దూరంగా ప్రయాణించేందుకు ఎవరూ ఆటోని ఆశ్రయించడం లేదు. దిల్ షునగర్ నుంచి అబిడ్స్ కి షేరింగ్ ఓలా క్యాబ్ లో ఖర్చయ్యేది కేవలం రు. 50 నుంచి రు. 70 మాత్రమే.  ఖైరతాబాద్ నుంచి దిల్ షుక్ నగర్ ఆటోలో రు. 150 ఖర్చయితే,  షేరింగ్ క్యాబ్ లో రు. 90 లకు వెళ్లిపోవచ్చు.  దీనికి ప్రయాణం ఎసిలో హాయిగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం బెడద వుండదు. అన్నింటికంటే ముఖ్యంగా బేరసారాలకు తావుండదు. ఓలా డ్రయివర్ మురళీమోహన్ చెప్పేదాని  ప్రకారం ఈ మధ్య చాలా మంది కారున్నవారు  కూడా క్యాబ్ నే ఇష్టపడుతున్నారు. ఆటోల జోలికి వెళ్లడం లేదు. వోలా, ఉబర్ క్యాబ్ ల వల్ల బతుకు దెరువు ఎలా కష్టమవుతన్నదో  ఏ ఆటో వాలాని కదిపినా కథ కథలుతా చెబుతారు.

 

ఇపుడు మరొక దెబ్బ తగలబోతున్నది ఆటో వాలకి.  ఈ దెబ్బ తీస్తున్నది తెలంగాణా ఆర్టీసి. తగ్గిపోతున్న  అదాయాన్ని పెంచుకునేందుకు హైదరాబాద్ గల్లీల్లోకి, ఇంతవరకు అటోలకి , సెవెన్ సీటర్లకు పరిమితమయిన కాలనీలకు ఆర్టీసి మినిబస్సులు నడపాలనుకుంటున్నది. ఎందుకంటే, మెట్రో నడవడం మొదలేపెడితో పడిపోయే అదాయాన్ని   ఈ రూట్లనుంచి రాబట్టాలనుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలసింది.

 

హైదరాబాద్ నగరంలో  సుమారు 200 మిని బస్సులను నడపాలని ఆర్టీసి యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ సంఖ్యను క్రమంగా పెంచి  వేలలోకి పెంచేందుకు అర్టీసి వనరులను సమకూర్చుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. సిటిలో దాదాపు 1500 బస్సుల దాకా నడపే యోచనలో అర్టీసి ఉంది. ఇపుడు అటోలకి పరిమితమయి, సిటి బస్సలు వెళ్లని  ప్రాంతాలలో వీటిని నిడిపిస్తారు.

దీని ప్రభావం వేల వేల అటోల మీద పడుతుంది.  క్రమంగా ఆటోలు  పబ్లిక్ నుంచి మాయమయి ఇరుకు గల్లీలకు పరిమితయ్యే రోజులొస్తున్నాయి. ఇంతకు ముందు రిక్షాకు ఇలాంటి పరిస్థితే ఎదురయింది.  పెరుగుతున్నహైదరాబాద్  అవసరాలకు రిక్షా పనికిరాకుండా పోయింది. చివరకు మాయమయింది.  రిక్షాకే రెక్కలొచ్చి నక్షత్ర యాత్ర చేస్తే అంటూ .ప్రేమికుల పాటల్లోకి కూడా చొరబడ్డ మూడుచ క్రాల బండి చూస్తుండగానే అంతర్థానమయిపోయింది. గ్లోబల్ హైదరాబాద్ నుంచి ఇపుడు ఆటో  కనుమరుగయ్యే పరిస్థితి ఎదురవుతూ ఉంది....  కొంత ఆలస్యం కావచ్చేమో కాని, ఎన్నో కుటంబాల అర్థిక పరిస్థితిని చిందరవందర చేయనున్న ఈ పరిణామం అనివార్యమనిపిస్తూ ఉంది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios