స్ధాయికి మించిన పదవులు ఆశిస్తున్న నేతలు అటువంటపుడు అందరికీ పదవులు ఏ విదంగా ఇవ్వాలి?
నేతల ఆశలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు నీళ్ళు చల్లారు. పదవులు ఆశిస్తున్న అందరికీ పదవులు ఇవ్వలేమని చంద్రబాబు తేల్చి చెప్పటంతో నేతల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది. పదేళ్ళ తర్వాత పార్టీ అధికారంలోకి రావటంతో సహజంగానే పలువురు నేతలు కార్పొరేషన్ పదవులను ఆశించారు. రాష్ట్ర విభజనైతే జరిగింది కానీ కార్పొరేషన్ల సంఖ్య అయితే అలానే ఉన్నాయి. దాంతో నేతల మధ్య పోటీ కూడా ఎక్కువైంది. దాంతో పదవులను పంపిణీ చేయటంలో చంద్రబాబుకు తలనొప్పులు ఎక్కువైంది.
అయితే, ఈమారు పదవుల పంపిణీ వ్యవహారం మొత్తం కుమారుడు లోకేష్ చూసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ కు రాజకీయ సమీకరణలు, సామాజిక వర్గాల సమతూకం లాంటి వ్యవహారాల్లో పూర్తిగా పట్టు లేకపోవటంతో చంద్రబాబునాయడు సామాజిక వర్గానికే పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద పీట వేస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇదే విషయాన్న పొలిట్ బ్యూరో సమావేశంలో నేతల మధ్య చర్చకు వచ్చింది.
పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటినా ఇంకా కార్పొరేషనట్ పదవులు పంపిణీ పూర్తిగా జరగకపోవటంతో నేతల మధ్య అసంతృప్తి పెరుగుతోందని సభ్యులు చంద్రబాబుతో అన్నట్లు సమాచారం. పైగా ఇప్పటి వరకూ పంపిణీ చేసిన పదవుల్లో కూడా ఒక సామాజిక వర్గానికే పెద్ద పీట వేసారనే భావనలో నేతలున్నట్లు కూడా పాలిట్ బ్యూరో సభ్యులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు తెలిసింది.
దాంతో వెంటనే లోకేష్ జోక్యం చేసుకుని ఇప్పటి వరకూ ఇచ్చిన పదవుల్లో ఏ ఏ సామాజిక వర్గానికి ఎన్నెన్ని పదవులను ఇచ్చిందీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించినట్లు సమాచారం. అదే సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ, పలువురు నేతలు తమ స్ధాయిని మరిచిపోయి పెద్ద పెద్ద పదవులను ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అటువంటి వారిని ఏ విధంగా సంతృప్తి పరుస్తామని సభ్యులను ప్రశ్నించటంతో ఎవరూ మాట్లాడలేదు.
పాలిట్ బ్యూరో పదవుల పంపిణీపై జరిగిన చర్చ, చంద్రబాబు సమాధానం బయటకు వచ్చినప్పటి నుండి కార్పొరేషన్లను ఆశిస్తున్న పలువురు నేతల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ళు పార్టీ జెండాను మోసి అహర్నిసలు నానా అవస్తలు పడిన తమ విషయంలో చంద్రబాబు స్ధాయి గురించి ప్రస్తావించటం పలువురు నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం పార్టీలో మొదలైన ఈ చర్చ రాబోయే ఎన్నికలపై పడినా ఆశ్చర్యపడక్కర్లేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
