ఆక్వా పార్క్ ఏర్పాటు వివాదాస్పదమవుతోంది స్దానికులు, రైతులకు మద్దతు ప్రకటించిన జగన్, పవన్ 

ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు వ్యవహరం భవిష్యత్తులో పెను వివాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నది. జనావాసాల మధ్య ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇవ్వటమే పెద్ద చర్చనీయాంశమైంది. కాలుష్య కారకమైన ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు విషయం వెలుగు చూసిన దగ్గర నుండి స్ధానిక ప్రజలు, రైతుల్లో అలజడి మొదలైంది. పార్క్ ఏర్పాటుకు అనుమతులు లభించగానే యాజమాన్యం పనులు ప్రారంభించాలని అనుకుంటున్న సమయంలోనే స్ధానికంగా వ్యతిరేకత మొదలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

పార్క్ పూర్తిగా కాలుష్యకారకమని నిపుణులు కూడా చెబుతున్నారు. అది కూడా జనావాసాల మధ్య ఏర్పాటు చేయాలంటే అందుకు ఎన్నో నియమ, నిబంధనలను అనుసరించాలి. అందులో ప్రధానమైనది, స్ధానికుల అనుమతి తీసుకోవటం. అందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. అయితే, ప్రభుత్వం అటువంటి నియమాలు పాటించలేదని ప్రతిపక్షాలతో పాటు స్దానికులు కూడా ఆరోపిస్తున్నారు.

 పైగా పార్క్ ఏర్పాటు వల్ల రోజుకు మూడు వేల టన్నుల రొయ్యలు, చేపలు శుద్ది అవుతాయని యాజమాన్యం చెబుతోంది. శుద్ది చేసే సమయంలో రశాయనాలను వాడుతారన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటపుడు వాతావరణం కాలుష్యం కాకుండా ఎలాగని ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

విచిత్రమేమిటంటే సంస్ధ యాజమాన్యానికి సముద్ర తీరంలో ప్రతిపాదిత స్దలానికి పది కిలోమీటర్ల దూరంలోనే 350 కిలోమీటర్ల దూరంలో సొంత స్దలమే ఉందని స్ధానికులు, జగన్ చెబుతున్నారు.అందులోని కొంత స్ధలాన్ని పార్క్ కోసం కేటాయించినా మిగిలిన ప్రాంతం కాలుష్యం కాదని వాదనలు వినిపిస్తున్నాయి. పార్క్ ఏర్పాటు పూర్తిగా కాలుష్యకారం కాబట్టే ఫ్యాక్టరీ నుండి పైప్ లైన్ ఏర్పాటు చేసి రశాయనాలు, వ్యర్దాలను తరలిస్తామని యాజమాన్యం స్ధానికులను మభ్య పెడుతోందని జగన్ ఆరోపిస్తున్నారు.

 మరి ఇటువంటి ఆరోపణలకు ప్రభుత్వం, పార్క్ యాజమాన్యం ఏమని సమాధానం చుబుతాయో. పార్క్ ఏర్పాటులో ఇటు టిడిపి అటు భారతీయ జనతా పార్టీకి చెందిన నేతల తెరవెనుక మద్దతు ఉందనే ప్రచారం కూడా ఊపందుకున్న నేపధ్యంలో వివాదం ఏ విధమైన మలుపులు తీసుకుంటుందో చూడాలి.