వివాదమవుతున్న తుందుర్రు మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు లక్షలాది ఎకరాలను సమీకరిస్తున్న ప్రభుత్వం ఎవరినీ ఖాతరు చేయని చంద్రబాబు
చంద్రబాబు తలచుకుంటే జరగాల్సిందే ఎవరూ ఆపలేరు. ఈ విషయం గతంలో ఎన్నో సార్లు రుజువైంది కూడా. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి రైతుల భూములపైనే దృష్టి పెట్టారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం మండలంలోని తుందుర్రు తదితర గ్రామాల వ్యవహారంతో మరో మారు సిఎం వ్యవహారశైలిపై చర్చ జరుగుతోంది.
పచ్చని పంట పొలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం, ఆ తర్వాత వాటిని అభివృద్ధి పేరుతో పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయటం రివాజుగా మారింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎన్నో మార్లు తమ అభ్యంతరాలను తెలిపినా చంద్రబాబు పట్టించుకోలేదని సమాచారం
భూముల స్వాధీనం రాజధాని అమరావతి నిర్మాణంతో మొదలైంది. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండలంలోని 29 గ్రామాల్లోని పచ్చని పంట పొలాలపై సిఎం కన్ను పడింది. దేశంలోని సారవంతమైన డెల్టా భూముల్లో పై ప్రాంతం కూడా ఒకటిగా పేరు పడింది. రాజధానికి పై గ్రామాలను ఎంపిక చేయగానే రైతుల్లో ఆందోళన మొదలైంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. తాను అనుకున్నట్లుగానే ఇప్పటికి సుమారు 40 వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నది ప్రభుత్వం.
రాజధాని భూముల వ్యవహారం పక్కన బడితే, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం పేరుతో విజయనగరం జిల్లాలోని భోగాపురం తదితర గ్రామాలపై ప్రభుత్వం కన్ను పడింది. అక్కడ కూడా రైతులు ఎంతో ప్రతిఘటించారు. అయినా ఉపయోగం లేకపోయింది. సుమారు 7 వేల ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్దమైపోయింది. కాకపోతే మొదట్లో అంచనా వేసినట్లు 16 వేల ఎకరాలు కాకుండా ఇపట్టికి 7 వేల ఎకరాలను సమీకరించేందుకు ప్రభుత్వం నిశ్చయించుకున్నది.
తర్వాత మచిలీపట్నం పోర్టు అభివృద్ధి నినాదాన్ని ప్రభుత్వం అందుకున్నది. ఇక్కడ ఏకంగా లక్ష ఎకరాల సమీకరణకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇక్కడ కూడా రైతులు తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్నారు. అయినా కలెక్టర్ పేరుతో భూ సేకరణ ప్రకటన కూడా జారీ అయిపోయింది. రైతులు ఎంత గగ్గోలు పెడుతున్నా చంద్రబాబు సర్కార్ ఖాతరు చేయటం లేదు.
ఇదే విషయమై జిల్లా సిపిఎం నేత బి. బలరామ్ ఏషియా నెట్ తో మాట్లాడుతూ, ఫుడ్ పార్క్ ఏర్పాటుకు అనుమతించటంలో కనీస నియమ, నిబందనలను కూడా పాటించలేదని ఆరోపించారు. గొంతేరు కాలువ వల్ల ప్రస్తుతం సుమారు 70 వేల మంది జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపారు. జనావాసాల మధ్య పెడుతున్న ఈ పార్క్ వల్ల బెస్తల జీవనం అస్తవ్యస్ధమై పోతుందని వాపోయారు. నాలుగు గ్రామాల్లోని 8 వేల ఎకరాల్లో పంటలు కూడా నాశనమైపోతాయని బలరామ్ ఆవేదన వ్యక్తం చేసారు.
ఇక, కాకినాడ సెజ్ కు ఇప్పటి వరకూ 2 లక్షల ఎకరాలను ప్రభుత్వం సేకరించినట్లు సమచారం. అంతేకాకుండా ప్రతీ జిల్లాలోనూ భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్షలాది ఎకరాల సేకరణ లక్ష్యంతో చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. ఇవన్నీ కూడా పంట పొలాలేనన్న విషయంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదు.
అమరావతి నిర్మాణం విషయంలో రైతులు న్యాయస్దానానికి వెళ్ళినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్దాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్దతుగా నిలచినా చంద్రబాబు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. భీమవరం మండలంలో ప్రైవేటు రంగంలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని అనుకున్నది. అందుకు ఏర్పాట్లు కూడా చక చక జరుగుతున్నది.
అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రైతులందరూ ముందుగా పవన్ వద్దకు వెళ్ళారు. పవన్ కూడా రైతులకు మద్దతుగా నిలిచారు. ఇపుడు జగన్ కూడా తుందుర్రు మండలంలో పర్యటించి రైతులకు మద్దతు ప్రకటించారు. అయినా ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుని పోతూనే ఉంది.
ఏ విషయమైనా కొద్ది రోజులు వివాదం రేగుతుంది ఆ తర్వాత సద్దుమణిగిపోతుందని చంద్రబాబు అనుకుంటున్నారు. ఎందుకంటే, మెజారిటీ మీడియాలో చంద్రబాబు తీసుకునే ప్రతీ నిర్ణయమూ బేషనైదే. మీడియా మద్దతు పూర్తిస్ధాయిలో ఉంది కాబట్టే చంద్రబాబు కూడా అంతకు తెగిస్తున్నారు. ఎవరికైనా ఎనీ డౌట్...
