అమరావతి రైతుల వెతలను తీర్చేసిన పవన్ ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తరా?
అమరావతి అయిపోయింది ఇక ఆక్వా మొదలైంది. పచ్చని పంట పొలాలను నాశనం చేసి ఆక్వా ఫాంను ప్రభుత్వం ఏర్పాటు చేయటమేమిటంటూ పవన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇదే విషయమై హై కోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటిని కూడా వేసి విషయం నిగ్గు తేల్చాలంటూ పవన్ డిమాండ్ చేయట భలేగా ఉంది కదూ.
పైగా రైతుల గోడును పట్టించుకోకపోతే తాను ఉద్యమం కూడా చేపడుతానంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించి భటే కామిడిని పండిస్తున్నారు. పవన్ వ్యవహారం తెలిసిన వారు కమెడి అనే అనుకుంటున్నారు. ఎందుకంటే, మొన్నామధ్య రాజధాని కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేయటానికి పూనుకున్న 29 గ్రామాల్లోని రైతుల్లో కూడా పలువురు భూములు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు.
ఎన్నో ఆందోళనల తర్వాత పవన్ హటాత్తుగా ఒకరోజు కొన్ని గ్రామాల్లో పర్యటించి హల్ ఛల్ చేసారు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటే వారి తరపున తాను ఆమరణ దీక్షను చేపడతానని కూడా పవన్ అప్పట్లో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే, ప్రభుత్వం భూ సమీకరణను అప్పటి నుండే వేగవంతం చేసింది. ఇదే విషయాన్ని కొందరు రైతులు పవన్ కు చెప్పుకున్నా లాభం లేకపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ పవన్ అటువైపు తొంగి కూడా చూడలేదు.
దాంతో అక్కడి రైతుల రోధన అరణ్య రోధనగానే మిగిలిపోతోంది. ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములను లాక్కుంటున్నా అడ్డుకునే వారే లేకపోయారు. దాంతో పవన్ మళ్ళీ కలుగులోకి వెళ్లి పోయారు. మళ్ళీ ఇంత కాలానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంకు చెందిన మూడు గ్రామాల రైతులు వచ్చి పవన్ తో తమ సమస్యను చెప్పుకున్నారు. ఆయనా విన్నారు. అంతే.
భీమవరం ప్రాంతంలోని తుందుర్రుతో పాటు మరో రెండు గ్రామాల ప్రజలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఆందళన వెలిబుచ్చారు. వాతావరణ కాలుష్యం వల్ల పచ్చని తమ పంటపొలాలు దెబ్బతింటాయని వాపోయారు. కాబట్టి సదరు ఆక్వా ఫుడ్ పార్క్ ను ఆపు చేయించాల్సిందిగా డిమాండ్ చేసారు.
దాంతో రెచ్చి పోయిన పవన్, ఫుడ్ పార్క్ ఏర్పాటును వెంటనే నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అవసరమైతే హైకోర్టు ఆధ్వర్యంలో ఒక కమిటిని ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేసారు. కేవలం పది మంది వ్యక్తుల కోసం పచ్చని పంట పొలాలను సాగు చేసుకుంటున్న 2 లక్షల మంది రైతులను ఇబ్బంది పెడతారా అంటూ పవన్ ప్రభుత్వాన్ని నిలదీయటం కామిడి కాక మరేమిటంటూ పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.
రాజధాని ప్రాంతంలో సుమారు 40 వేల ఎకరాల పచ్చని పంటలు పండే పొలాలను ప్రభుత్వం తీసుకున్నది. రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని పవన్ భూ సమీకరణ దాదాపు పూర్తయిపోతున్న తరుణంలో గ్రామాల్లో పర్యటించి షో చేసారు. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే వారి తరపున తాను ఆమరణ దీక్ష చేస్తానంటూ చేసిన బహిరంగ శపధం ఏమైందని అడుగుతున్నారు.
మళ్ళీ ఇప్పటి వరకూ రాజధాని భూముల గురించి గాని, రైతుల సమస్యల గురించి గాని పవన్ మాట్లాడలేదు. అటువంటిది తాజాగా పవన్ ఆక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా రైతుల తరపున ప్రభుత్వానికి హెచ్చరికలు పంపటం కామిడి కాక మరేమిటి? మళ్ళీ పవన్ ను కలవాలంటే భీమవరం రైతులకు ఎంత కాలం పడుతుందో ఎవరికి తెలుసు?
