ఒక నెల క్రితం వరకు దేశ రాజకీయాలను హాట్ హాట్‌గా మార్చింది కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి.  ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక డీఎంకే ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో పుదుచ్చేరిలో కాంగ్రెస్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

త నెల 22న బలపరీక్షకు ముందే నారాయణ స్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 23న నారాయణస్వామి, ఆయన మంత్రివర్గం రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు.

2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 15, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకోగా, అన్నాడీఎంకే 4, డీఎంకే 2 సీట్లు గెలుచుకున్నాయి. అయితే తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పుదుచ్చేరిపైనా ఉత్కంఠ నెలకొంది.

ఇక్కడ బీజేపీ- అన్నాడీఎంకే కూటమి గెలుస్తుందా లేక కాంగ్రెస్ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అన్న దానిపై రకరకాల సర్వేలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామికి సంబంధించి కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని తెలిపింది. ఎన్నికల ప్రచారం, నిర్వహణ బాధ్యతలను నారాయణ స్వామి చూసుకుంటారని ఏఐసీసీ పుదుచ్చేరి ఇన్‌చార్జి దినేష్ గుండూరావు ప్రకటించారు.

2016 ఉప ఎన్నికల్లో నెల్లిథోపె నుంచి ఆయన గెలిచారు. అయితే పొత్తుల్లో భాగంగా ఈసారి ఆ సీటును డీఎంకే అభ్యర్థి వి.కార్తికేయన్‌కు కేటాయించారు. పుదుచ్చేరి రూరల్ ఉమెన్స్ కాలేజీకి చైర్మన్‌గా కార్తికేయన్ ఉన్నారు.

అయితే నారాయణ స్వామి పోటీ చేసినా, చేయకపోయినా తమకెలాంటి ఇబ్బందీ లేదని బీజేపీ వ్యాఖ్యానించింది. నెల్లిథోపె నుంచి డిపాజిట్ కూడా దక్కే అవకాశం లేదనే విషయం ఆయనకు బాగా తెలుసుననీ, అందుకే ఆయన ఆ నియోజకవర్గం నుంచి పారిపోతున్నారని విమర్శించింది. బీజేపీ-అన్నాడీఎంకే కూటమి పుదుచ్చేరిలో క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.