నేటి యువతీ, యువకులు రకరకాల టాటూలు వేసుకొని ఫ్యాషనబుల్‌గా కనిపిస్తుంటారు. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు.  అందుకే వెరైటీ టాటూల కోసం తాపత్రయపడుతుంటారు. ఇప్పటికే చాలామంది విభిన్న రకాల డిజైన్లు  ఉన్న టాటూలను లేదా కొత్త తరహా టాటూలను వేయించుకొని ఉండవచ్చు.  కానీ ఓ యువతి మాత్రం... తన తండ్రి మీద ఉన్న ప్రేమతో టాటూ వేయించుకుంది. అలా అని తండ్రి పేరో,ముఖమో వేసుకోలేదు. తన తండ్రి మాటలను వేయించుకుంది. దానిని మీటిన ప్రతిసారి... ఆమె తన తండ్రి మాటలు వినగలదు. చనిపోయిన తన తండ్రికి ఈ విధంగా ఆమె నివాళులర్పించింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... వైట్ మూర్(40)కి తన తండ్రి అంటే ప్రాణం. 2013లో ఆమె తండ్రి మైకెల్ గోటో క్యాన్సర్ తో బాధపడుతూ కన్నుమూశారు. తండ్రి మరణాన్ని ఆమె తట్టుకోలేక పోయింది. చాలా రోజులు తండ్రిని తలుచుకొని బాధపడేది. కాగా.... తాజాగా ఆమె తండ్రిని ... తాను బతికి ఉన్నంత కాలం తనతో ఉన్నట్లు ఫీలయ్యేలా చేసుకొని తండ్రికి నివాళులర్పించింది.

ఇటీవల ఆమె ఇన్ స్టాగ్రామ్ లో మాట్లాడే టాటూ గురించి చదివింది. అది ఆమెను ఎంతగానే ఆకట్టుకుంది. దానిని తాను కూడా వేయించుకోవాలని భావించింది. తన తండ్రి వాయిస్ రికార్డును తన చేతిపై టాటూగా వేయించుకుంది. స్కిన్ మోషన్ అనే మొబైల్ యాప్ తో ఈ టాటూ కనెక్ట్ అయ్యి ఉంటుంది. టాటూని తాకిన ప్రతిసారి మనం వేయించుకున్న వ్యక్తి గొంతు వినపడుతూనే ఉంటుంది.

వైట్ మూర్ కూడా వెంటనే తన తండ్రి గతంలో తనతో మాట్లాడిన మాటలు‘‘ హాయ్ బేబీ, థాంక్యూ, నేను బాగానే ఉన్నాను, ఐలవ్ యూ, ఇంటికి రాగానే నేను నిన్ను కలుస్తాను, బై బై’ అనే మాటలను టాటూగా వేయించుకుంది.

దీని గురించి వైట్ మూర్ మాట్లాడుతూ... తన తండ్రి చనిపోయినప్పుడు చాలా బాధపడినట్లు చెప్పారు. రోజులు గుడుస్తున్న కొద్దీ... తన తండ్రి గొంతు కూడా మర్చిపోతానేమో అని భయం వేసిందని ఆమె అన్నారు.అలాంటి సమయంలో తనకు ఈ టాటూ గురించి తెలిసిందని... వెంటనే తాను ఈ టాటూ వేయించుకున్నట్లు చెప్పారు.