దోమల ద్వారా డెంగీ వ్యాపిస్తుంది. ఈ విషయం మనకు తెలిసిందే.  ఈ డెంగీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. మన దేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఈ డెంగీ దోమ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.  ఈ ఏడాది అక్టోబరు నాటికి దేశవ్యాప్తంగా 67,377 కేసులు నమోదు కాగా.. వందల్లో మరణాలు చోటుచేసుకున్నాయి. ఒక్క తెలంగాణలోనే బోలెడు కేసులు నమోదై, పదుల సంఖ్యలో మృతిచెందారు. 

ఈ మరణాలపై ఇక్కడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు కూడా పెట్టింది. ప్రభుత్వం తరఫున కోర్టు ముందు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హజరు కాగా.. ఏసీ రూముల్లో కూర్చొని తమాషా చేస్తున్నారా అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏడిస్  ఈజిప్టై అనే జాతి దోమకాటు వల్ల మానవ శరీరంలోకి ప్రవేశించే  వైరస్ వల్ల వచ్చేది డెంగీ జ్వరం. ఇది చాలామందికి తెలిసిన విషయమే. అయితే డెంగీ వ్యాప్తి విషయంలో..తాజాగా డాక్టర్లు, పరిశోధకులు షాకింగ్ న్యూస్ చెప్పారు.  స్వలింగ సంపర్కం ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి డెంగీ వ్యాపిస్తుందన్న విషయాన్ని స్పెయిన్ వైద్యులు రివీల్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. మాడ్రిడ్‌ నగరానికి చెందిన ఓ 41 ఏండ్ల స్వలింగ సంపర్కుడు.. డెంగీ సోకిన మరో వ్యక్తితో కలిసి శృంగారంలో  పాల్గొనడంతో అతనికి కూడా ఆ వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు. కాగా ప్రస్తుతం డెంగీతో బాధపడుతోన్న వ్యక్తి..సెక్స్ పార్టనర్ క్యూబా పర్యటనలో ఉండగా అతనికి  వైరస్‌ అటాక్ అయినట్లు మాడ్రిడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు స్వయంగా ప్రకటించడం గమనార్హం.

 ఇది ఒక రకంగా డాక్టర్లను కూడా షాక్‌కి గురిచేసింది. ఇరువురి బ్లడ్ శాంపిల్స్‌తో పాటు పలు టెస్ట్‌లు చేసిన అనంతరం డాక్టర్లు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇప్పటికే ప్రాణాంతకంగా తయారైన డెంగీ..తన వ్యాప్తి పరిధిని విస్తరించడంతో పలువురు వైద్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.