పీకలదాకా మద్యం తాగి ఓ వ్యక్తి విమానం ఎక్కాడు. ఎక్కినవాడు కామ్ గా కూర్చోకుండా.. నానా గందరగోళం చేశాడు. ఎలుగుబంటి లాగా పిచ్చి చేష్టలు చేశాడు. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడంతోపాటు... కాక్ పిట్ లోకి దూరి రచ్చ చేయాలని చూశాడు. దీంతో..... అతని ఆటకు విమాన సిబ్బంది చెక్ పెట్టారు.. వెంటనే అతనిని సీటులో కూర్చోపెట్టి.. టేపుతో కట్టేశారు. ఈ సంఘటన రష్యాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రష్యాకి చెందిన ఎస్7 ఎయిర్ లైన్స్ విమానం మినరల్నీ వోడీ నుంచి నోవోసిబిర్స్క్ కి వెళ్తోంది. కాగా... ఈ విమానంలోకి 50ఏళ్ల ప్రయాణికుడు ఒకరు ఎక్కారు. అతను అప్పటికే విపరీతంగా మద్యం సేవించి ఉన్నాడు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో గొడవ చేయడం మొదలుపెట్టాడు.

కాసేపు తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత కాక్ పిట్ లోకి వెళ్లాలని ప్రయత్నించాడు. వెంటనే తోటి ప్రయాణికులు విమాన సిబ్బందిని అలర్ట్ చేయడంతో వారు అడ్డుకున్నారు. బిజినెస్ క్లాస్ విమానంలో అతనిని ఓ ఖాళీ సీటులో కూర్చోపెట్టి.. టేప్ తో కట్టేశారు. ఆయనను కట్టేసిన తర్వాత కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయ్యింది.

కాగా... సదరు ఎలుగుబంటి లాగా ప్రవర్తించాడని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. విమాన గమ్య స్థానం చేరుకున్న తర్వాత సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.