సారాంశం

అదృష్టముంటే రైలు కిందపడినా ప్రాణాలతో బయటపడొచ్చు అనడానికి మరో ఉదాహరణ అమెరికాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియా ర్యాపిడ్ ట్రాన్సిట్ ఉద్యోగి సెకన్ల వ్యవధిలో చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు

అదృష్టముంటే రైలు కిందపడినా ప్రాణాలతో బయటపడొచ్చు అనడానికి మరో ఉదాహరణ అమెరికాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియా ర్యాపిడ్ ట్రాన్సిట్ ఉద్యోగి సెకన్ల వ్యవధిలో చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు.

ఆదివారం అత్యంత రద్దీగా ఉన్న కొలిజీయం రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడిపోయాడు. అదే సమయంలో రైలు అత్యంత వేగంతో ఫ్లాట్‌మీదకు దూసుకొస్తోంది.

దీనిని గమనించిన రైల్వే సిబ్బందిలో ఒకరు అతనిని రెప్పపాటులో పైకి లాగాడు.. ఇందుకు సంబంధించిన వీడియోను బే ఏరియా ర్యాపిడ్ ట్రాన్సిట్ (BART) విడుదల చేసింది. ఈ వీడియాలో ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు ట్రాకులపై పడిపోతాడు.. అతనిని ట్రాన్సిట్ వర్కర్ జాన్ ఓ కానర్‌ గుర్తించి ఫ్లాట్‌ఫామ్‌పైకి లాగేశాడు.

ఈ సంఘటనను అక్కడున్న ప్రయాణికులు ఊపిరి బిగపెట్టిచూశారు. అక్కడే ఉన్న నిఘా కెమెరాలు ఈ దృశ్యాన్ని బంధించడంతో బయటి ప్రపంచానికి తెలిసింది. తన ప్రాణాలను కాపాడిన వ్యక్తి జాన్‌‌ని కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలుపుతున్న మరో వీడియోను ప్రయాణికుల్లోని ఓ వ్యక్తి ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు.

ఈ ఘటన తర్వాత బే ఏరియా ర్యాపిడ్ ట్రాన్సిట్ స్పందించింది. ప్రతి ఒక్కరు పసుపు రంగు లైన్‌కు దూరంగా ఉండాలని సంస్థ ప్రతినిధి ఒకరు విజ్ఞప్తి చేశారు. సదరు వ్యక్తి మత్తులో ఉండటంతో అడుగులు తడబడి ట్రాకులపై పడిపోయాడని దీనిని గుర్తించి బీఏఆర్‌టీ వర్కర్ జాన్.. ఆ వ్యక్తి భుజాలను గట్టిగా పట్టుకుని ఫ్లాట్‌ఫామ్‌పైకి లాగి రక్షించినట్లు ఆయన వెల్లడించారు.