అమెరికాలోని జలపాతం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధులు మరణించారు. నెల్లూరు జిల్లా న్యూమిలటరీ కాలనీకి చెందిన కేదార్‌నాథ్ రెడ్డి, టెక్కేమిట్ట ప్రాంతానికి చెందిన ఓలేటి తేజా కౌశిక్‌లు మంగళవారం సెలవు కావడంతో మిత్రులతో కలిసి ఓక్లాలో ఉన్న టర్నర్ ఫాల్స్‌కు వెళ్లారు.

అక్కడ 13 అడుగుల లోతున్న జలపాతం వద్ద వీరంతా స్నానాలు చేస్తుండగా కౌశిక్ ప్రమాదవశాత్తూ నీట మునిగాడు. అతనిని కాపాడబోయిన రాయచూరుకు చెందిన అజయ్, కేదార్‌నాథ్ రెడ్డి కూడా నీటిలో మునిగి గల్లంతయ్యారు.

దీంతో మిత్రులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న ఓక్లా డావిస్ పోలీసులు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. కౌశిక్ స్వస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి కాగా.. ఆయన తండ్రి ఉద్యోగ రీత్యా నెల్లూరులో ఉంటున్నారు.

కౌశిక్ బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చదివేందుకు ఏడాది క్రితం అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో చేరాడు. అటు రాయచూర్‌కు చెందిన మరో విద్యార్ధి అజయ్ కోయిలమూడిది ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా.

వీరి కుటుంబం 40 ఏళ్ల క్రితమే సింధనూరులో స్థిరపడింది. విద్యార్ధుల మరణవార్తతో తల్లీదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరి మృతదేహాలను భారతదేశానికి తీసుకొచ్చేందుకు తానా సహకారంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జలపాతంలో గల్లంతు: అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి