అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్ధులు మరణించారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరు శ్రీపురంకు చెందిన కోయిలమూడి అజయ్ కుమార్..ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ అర్లింగ్‌టన్‌‌లోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ తొలి సంవత్సరానికి ప్రవేశం పొందాడు.

మంగళవారం సెలవు కావడంతో అజయ్.. నెల్లూరుకు చెందిన తన స్నేహితుడు కౌశిక్ సహా మరో 8 మందితో కలిసి ఓక్లాలో ఉన్న టర్నర్ ఫాల్స్ పార్క్‌కు వెళ్లాడు.  13 అడుగుల లోతున్న ఆ జలపాతం వద్ద వీరంతా స్నానాలు చేస్తుండగా కౌశిక్ నీట మునిగాడు. అతనిని కాపాడబోయి అజయ్ కూడా నీటిలో పడ్డాడు.

మిగిలిన మిత్రులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న ఓక్లా డావిస్ పోలీసులు యువకుల మృతదేహాలను వెలికితీసి.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరి మరణవార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. యువకుల మృతదేహాలను భారతదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.