వరంగల్: అమెరికాలోని రెస్టారెంట్ లో జరిగిన కాల్పుల్లో తెలంగాణ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. అతని తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల శరత్ కొప్పుగా గుర్తించారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. 

అతను మిస్సోరి విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. కాల్పులు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగాయి. కాన్సాస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి బుల్లెట్ గాయాలతో శరత్ రక్తంమడుగులో పడి ఉన్నాడు. 

అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అనుమానితులను ఎవరినీ ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు. ఐదు బుల్లెట్లు కాల్చిన శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 

శరత్ కాన్సాస్ నగరంలో ఉంటున్నాడు. మిస్సోరి యూనివర్శిటీలో చదువుతూ 5303 చార్లోట్ స్ట్రీట్ అపార్టుమెంటులో ఉంటున్నాడు. అతని మరణ విషయం వరంగల్ జిల్లాలోని కుటుంబ సభ్యులకు చేరింది. శరత్ మృతదేహాన్ని తీసుకుని రావడానికి సాయపడాల్సిందిగా వారు తెలంగాణ ఎన్నారై మంత్రి కెటి రామారావును కోరారు.

అయితే తమకు తమ కుమారుడి గురించి తమకు ఏ విధమైన సమాచారం రాలేదని శరత్ తండ్రి రామ్మోహన్ రావు ఓ తెలుగు టీవీ చానెల్ తో చెప్పారు. కాగా, శరత్ కుటుంబ సభ్యులు డిజీపి మహేందర్ రెడ్డిని కలిశారు. .దుండగులు రెస్టారెంట్ లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన సమయంలో శరత్ మిత్రులు పారిపోయారని, శరత్ కూడా పారిపోతుండగా బుల్లెట్లు తగిలాయని అంటున్నారు.

అయితే, శరత్ తీవ్రంగా గాయపడ్డారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని కొన్ని చానెల్స్ లో వార్తలు వస్తున్నాయని, కొన్ని చానెల్స్ లో మరణించాడని వార్తలు వస్తున్నాయని రామ్మోహన్ రావు అంటున్నారు. తమకు స్పష్టమైన సమాచారం ఏదీ లేదని అన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ను కూడా కుటుంబ సభ్యులు సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నారు.