2లక్షల మంది ఇండియన్లకు రిలీఫ్: వీసా పాలసీపై కోర్టు నిషేధం
అక్రమ నివాసం ఉన్న వారిపై నిషేధం విధించాలని అమెరికా చేసిన వీసా చట్టం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక జిల్లా ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు లక్షల మంది భారతీయులకు ఉపశమనం లభించనున్నది.
వాషింగ్టన్: విదేశీ విద్యార్థులు అమెరికాలో అక్రమంగా నివసించకుండా అరికట్టే ఓ ప్రతికూల విధానాన్ని యూఎస్‌సీఐఎస్ (అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల సంస్థ) అమలు చేయకుండా అమెరికా జిల్లా కోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసింది.
ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కాకున్నా, ప్రస్తుతం జారీ అయిన తాత్కాలిక ఆదేశాలతో అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న దాదాపు రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులకు ఊరట లభించనుంది.
గత ఏడాది ఆగస్టు 9 నుంచి అమలులోకి వచ్చిన యూఎస్‌సీఐఎస్ విధానం ప్రకారం.. అక్రమంగా నివసిస్తున్న విద్యార్థులను నిర్దిష్ట కాలం వరకు మళ్లీ అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు. 180 రోజులు అక్రమంగా నివసించిన వారిపై మూడేళ్లు, ఏడాదికి పైగా నివసించిన వారిపై పదేళ్ల నిషేధం విధించనున్నారు.
ఈ నిషేధం సదరు విద్యార్థులపై ఆధారపడిన వారికి, వారి జీవిత భాగస్వాములకు, పిల్లలకు కూడా వర్తిస్తుంది. దీనిపై పలు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. విదేశీ విద్యార్థుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశాయి.
అమెరికాలో నివసించేందుకు అనుమతించిన కాలం పూర్తి కాకపోయినా.. ఓ విద్యార్థి తెలిసో తెలియకో తన విద్యార్థి వీసాను ఉల్లంఘించినట్టు తేలితే.. ఆ రోజు నుంచే అతడు/ఆమె అక్రమంగా నివసిస్తున్నట్టు పరిగణిస్తారు. ఈ విషయం ఏడాది తరువాత వెలుగులోకి వస్తే.. సదరు విద్యార్థిపై పదేళ్లు అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు.
ఈ విధానం విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం చేస్తుందని పలు విద్యా సంస్థలు కోర్టుకు విన్నవించాయి. ఈ చట్టం నేషనల్ ఇమ్మిగ్రేషన్ అండ్ వీసా చట్టంతో విభేదిస్తున్నదని వారు వాదించారు.