హైదరాబాద్: ఆమెరికాలో 26 ఏళ్ల హైదరాబాదు యువకుడు అదృశ్యమయ్యాడు. గత శుక్రవారం నుంచి అతని జాడ కనిపించడం లేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ సాయం కోరారు. 

అమెరికాలోని భారత దౌత్య కార్యాలయానికి కూడా వారు విజ్ఞప్తి చేశారు. హైదరాబాదుకు చెందిన మిర్జా అహ్మద్ అలీ బేగ్ అమెరికాలో కొన్ని సమస్యలు ఎదుర్కుంటున్నాడని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు .

ఉన్నత విద్యను అభ్యసించడానికి అతను 2015లో అమెరికాలో వెళ్లాడని, గత శుక్రవారం ఫోన్ చేసి గత ఆరు నెలలుగా తాను సమస్యలు ఎదుర్కుంటున్నానని చెప్పాడని బేగ్ తమ్ముడు మిర్జా సుజాత్ ఓ వార్తాసంస్థతో చెప్పాడు. 

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి బేగ్ 2015 జులైలో అమెరికా వెళ్లాడు. ఓ ఏడాది తర్వాత అతను ఒక విశ్వవిద్యాలయం నుంచి న్యూజెర్సీలోని మరో విశ్వవిద్యాలయానికి మారాడు. అమెరికాకు వెళ్లిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అతను హైదరాబాదు రాలేదని కుటుంబ సభ్యులు చెప్పారు.