Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో విషాదం : విహారయాత్రకెళ్లి తెలుగు దంపతుల గల్లంతు, భార్య మృతి.. భర్త కోసం సెర్చ్ ఆపరేషన్

అమెరికాలో గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన దంపతులు గల్లంతయ్యారు. గడ్డకట్టిన సరస్సు మీద ఫోటోలు దిగుతుండగా.. మంచు కుంగిపోయి వీరిద్దరూ లోపలికి కూరుకుపోయారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

guntur couple missing in lake in america
Author
First Published Dec 27, 2022, 9:08 PM IST

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన తెలుగు దంపతులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆరిజోనా రాష్ట్రంలో స్థిరపడిన ముద్దన నారాయణ, హరిత దంపతులు అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఫినిక్స్ ప్రాంతంలో విహారయాత్రకు వెళ్లారు. అయితే అక్కడి ఐస్‌లేక్‌లో దిగి ఫోటోలు దిగుతుండగా.. ఒక్కసారిగా ఐస్ క్రుంగిపోయి , దంపతులిద్దరూ మంచులో కూరుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో హరిత మృతదేహం లభించింది. ఆమెకు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అటు నారాయణ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఒడ్డునే వుండటంతో పిల్లలిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. 

ఇదిలావుండగా.. నారాయణ దంపతులు గల్లంతైన విషయం తెలుసుకున్న ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో విషాదఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా నారాయణ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నారాయణ తన భార్యాబిడ్డలతో కలిసి చివరిసారిగా ఈ ఏడాది జూన్‌లో స్వగ్రామం వచ్చారు. బంధుమిత్రులతో సరదాగా గడిపి తిరిగి అమెరికాకు వెళ్లారు. అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

ALso REad: మంచు తుఫానుతో వణికిపోతున్న అమెరికా.. 50 మంది మృతి..

ఇకపోతే.. అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. విపరీతమైన చల్లగాలులు వీస్తున్నాయి. ఈ శీతల గాలుల ప్రభావంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యాలకు గురవుతున్నారు. రోడ్డుపై మంచుపేరుకుపోవడంతో ప్రమాదాలు జరగుతున్నాయి. ఈ మంచు తుఫాను ప్రారంభమైన దగ్గర నుంచి శీతల గాలుల వల్ల, అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల ఇప్పటి వరకు దాదాపు 50 మంది మరణించారు. తాజా వాతావరణ పరిస్థితుల వల్ల తొమ్మిది రాష్ట్రాల్లో విస్తృతంగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. చాలా రోడ్లు బ్లాక్ అయ్యాయి. న్యూయార్క్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భీకరమైన మంచు తుఫాను, శీతల గాలులు, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల వల్ల ఇటీవలి రోజుల్లో 15,000 కంటే ఎక్కువ యూఎస్ విమానాలను అధికారులు రద్దు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios