కోవిడ్ 19 మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేవాలు లాక్‌డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికి వెళ్లేదారిలేక ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు.

అయితే వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మే 3తో లాక్‌డౌన్ గడువు ముగియనుండటంతో ఆ తర్వాతే వారిని భారత్‌కకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read:పరిమితమైన సడలింపులతో లాక్ డౌన్ కొనసాగింపుకు రాష్ట్రాల మొగ్గు?

పలు దేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి ఇండియన్ ఎంబసీలకు మొరపెట్టుకోవడంతో పాటు మనదేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలకు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. అటు వివిధ రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి  సారించినట్లు సమాచారం.

దీంతో రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం.. ఈ మేరకు వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వారి జాబితాను ఇవ్వాల్సిందిగా కేంద్ర్ ప్రభుత్వం రాష్ట్రాలను కోరిందని సమాచారం. వారిని భారత్‌కు తీసుకొచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా కేంద్రం పలు రాష్ట్ర ప్రభుత్వాలతోనూ చర్చించినట్లుగా తెలుస్తోంది.

Also Read:కరోనాపై పోరుకు ప్రజలే నాయకత్వం: మన్‌కీ బాత్ లో మోడీ

ఇప్పటికే ఈ విషయమై పీఎంవో అధికారులు... ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లుగా సమాచారం. వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన వారిని ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎట్టి పరిస్ధితుల్లో ఇక్కడ స్థానికంగా ఉన్న వైరస్ బాధితులతో వారిని కలవకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వివిధ దేశాలకు చెందిన రాయబారులు, అధికారులతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.