లండన్ వీధుల్లో ఊరేగిన బోనం
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, ఫస్ట్ సెక్రటరీ అఫ్ ఇండియన్ హైకమిషన్ అనిమా భరద్వాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్వదేశం లో జరుపుకున్నట్టు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు జరిగింది. లష్కర్ బోనాలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రవాస బిడ్డలనే కాకుండా స్థానికులని కూడా ముగ్దులని చేసింది.
బోనాల ఊరేగింపు తరువాత ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంస్థ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం స్వాగతోపన్యాసం చేయగా, కార్యదర్శి రవి రేతినేని కార్యక్రమానికి వక్త గా వ్యవహరించారు.
భారత సంతతికి చెందిన స్థానికి ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ... యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని, లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు.
స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న తనను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రగతిని గమనిస్తున్నామని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా ఉన్నట్టు తెలుకున్నామని, వారి ప్రతి పథకం వినూత్నంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఉన్నాయని, ప్రజలంతా అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని అన్నారు.
స్థానిక ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర పండుగ "బోనాల" వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు లో పాల్గొనడం చాలా సంతోషం గా ఉందని తెలిపారు.
అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా అనిపించిందని, తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. టాక్ సంస్థ కేవలం ఇలాంటి వేడుకలకు పరిమితం కాకుండా ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఇటీవల మహిళా దినోత్సవం రోజు, స్థానికంగా మహిళా - శిశు సంరక్షణ కోసం పని చేస్తున్న సంస్థలకి విరాళాలిచ్చి ప్రోత్సహించడం చాలా గొప్పదని ప్రశంసించారు.
ఇండియన్ హై కమీషన్ ప్రతినిధి అనిమా భరద్వాజ్ మాట్లాడుతూ... బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అంటూ తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటిచెప్తున్న తీరుని ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, బాధ్యత గల తెలంగాణా బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో ఆదర్శనంగా ఉందని తెలిపారు.
టాక్ సంస్థ ఇటు జాతీయ పండుగలు రాష్ట్ర పండుగలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ భారత జాతి గౌరవాన్ని విదేశీ గడ్డ పై ముందుకు తీసుకెళ్తున్న తీరు ఎందరికో స్ఫూర్తినిస్తుందని, భారత హై కమీషన్ అన్ని సందర్భాల్లో టాక్ సంస్థకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
సంస్థ అద్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ... టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరు బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపు చేయడం ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు.
టాక్ సంస్థని, అలాగే బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించే కాకుండా అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న నిజామాబాదు ఎంపీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు.
టాక్ వ్యవస్థాపకుడు, ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని అన్నారు.