ప్రపంచంలోని అన్ని రంగాలను, అన్ని వర్గాలను కరోనా అతలాకుతలం చేస్తోంది. ప్రతి ఒక్కరిని నేరుగా ప్రభావితం చేస్తూ.. గతంలో ఎన్నడూ చూడని పరిస్ధితులను కల్పిస్తోంది. ఈ క్రమంలో ఓ కుటుంబంలో కరోనా తీరని విషాధాన్ని మిగిల్చింది.

వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా  రాజమహేంద్రవరంలోని ఉల్లితోట వీధి బంగారయ్య స్కూల్లో నివసిస్తున్న వనపర్తి లక్ష్మీ, వనపర్తి వెంకటేశ్వరరావులకు కుమార్తె రత్నం, కుమారుడు మహేశ్ ఉన్నారు. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపారు.

Also Read:కరోనాపై హెచ్చరిక: కొత్తవారు ఇంటికి వస్తే వేయి జరిమానా

అయితే మహేశ్ ఉపాధి కోసం కొద్దిరోజుల క్రితం అప్పు చేసి మరీ గల్ఫ్ వెళ్లాడు. చేసిన అప్పులు తీర్చకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారి నుంచి మహేశ్‌పై ఒత్తిడి పెరిగింది. ఉన్న ఆటో అమ్ముకుని, మరికొంత అప్పు చేసి మరి మహేశ్ బహ్రెయిన్ వెళ్లాడు.

అయితే అక్కడికి వెళ్లాక అతని ఆరోగ్యం బాలేదు. దీంతో భారత్‌కు వచ్చేందుకు గాను మార్చి 22న టికెట్ బుక్ చేసుకుని, చెల్లెలికి ఫోన్ చేసి తాను వచ్చేస్తున్నట్లు చెప్పాడు. అమ్మకి చెప్పొద్దని సర్‌ప్రైజ్ చేద్దామని చెల్లెలికి కబుర్లు చెప్పాడు.

అయితే ఈ మధ్యకాలంలో కరోనా తీవ్రత దృష్ట్యా అంతర్జాతీయ సర్వీసులను అన్ని దేశాలు రద్దు చేశాయి. దీంతో మహేశ్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఇప్పట్లో భారతదేశానికి వెళ్లలేనేమోననే బెంగతో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కొడుకు కోసం ఎదురుచూస్తోన్న అతని తల్లిదండ్రులు మహేశ్ మరణవార్త విని కుప్పకూలిపోయారు. ఒక్కగానొక్క కొడుకు చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నామని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Readకరోనా లాక్ డౌన్: పిలిస్తే పలుకుతా... అంటూ కష్టాలు తీరుస్తున్న కేటీఆర్

భారత్‌కు అతని మృతదేహం తీసుకురావాలంటే కనీసం రెండు నెలలైనా పడుతుందని, అప్పటి వరకు మృతదేహాన్ని భద్రపరిచేందుకు మార్చురీలు ఖాళీగా లేవని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మృతదేహాలను భద్రపరిచేందుకు ఒప్పుకోవడం లేదని వారు చెప్పారని, అంత్యక్రియలను వాట్సాప్ ద్వారా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏజెంట్ చెప్పారు.