ఉక్రెయిన్‌లో ఉండిపోయిన నా పెంపుడు జాగ్వర్, పాంథర్‌ను రక్షించండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన ఆంధ్రా డాక్టర్
ఉక్రెయిన్‌లో ఉండిపోయిన తన పెంపుడు జంతువులను రక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ డాక్టర్ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహాయం చేయకపోవడంతో.. సాయం కోసం భారత ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో ఉండిపోయిన తన పెంపుడు జంతువులను రక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ డాక్టర్ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం చెలరేగిన సమయంలో తాను పెంచుకుంటున్న జాగ్వర్, పాంథర్‌లను అక్కడే వదిలివేసి రావడం జరిగిందని చెప్పారు. స్థానిక రైతు వద్ద వాటిని విడిచిపెట్టానని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహాయం చేయకపోవడంతో.. సాయం కోసం భారత ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా పేర్కొన్నారు.
వివరాలు.. 42 ఏళ్ల గిరి కుమార్ పాటిల్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. అతడు తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌లో ఉన్న సెవెరోడోనెట్స్క్ అనే చిన్న పట్టణంలో ఆరు సంవత్సరాలుగా నివసిస్తున్నారు. కీవ్ జంతు ప్రదర్శనశాల నుంచి అతడు రెండు పెంపుడు జంతువులను కొనుగోలు చేశాడు. అందులో మగ జాగ్వర్ వయస్సు 20 నెలలు. ఆడ పాంథర్ ఆరు నెలల పిల్ల.
అయితే రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం చోటుచేసుకున్న సమయంలో అతడు తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ నుంచి బయలుదేరినప్పుడు స్థానిక రైతుతో తన పెంపుడు జాగ్వర్, పాంథర్‌ను వదిలి వెళ్ళవలసి వచ్చింది. ప్రస్తుతం అతడు పోలాండ్‌లోని వార్సాలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలోనే తన పెంపుడు జంతువులను క్షేమంగా తనవద్దకు చేర్చేందుకు భారత ప్రభుత్వం సహాయం చేయాలని గిరి కుమార్ కోరుతున్నారు.
Also Read: ఉక్రెయిన్ లంకేశ్వరుడు... గిరి కుమార్ సాహసానికి మెగాస్టార్ ఫిదా
‘‘పిల్లల యొక్క ఖచ్చితమైన ప్రస్తుత పరిస్థితిని, వాటి తక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకుని.. చిక్కులతో కూడుకున్న ఈ సమస్యను తక్షణమే పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని వినయపూర్వకంగా కోరుతున్నాను’’ అని గిరి కుమార్ పాటిల్ పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. ‘‘నా పిల్లుల నుండి దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది. కొన్ని సమయాల్లో నిరాశకు లోనవుతున్నాను. ఆ మధురమైన జ్ఞాపకాల నాతో ఉన్నాయి. అయితే వాటి శ్రేయస్సు, విధి గురించి భయాందోళన చెందుతున్నాను’’ అని తెలిపారు.
ఇక, ఈ ఏడాది ప్రారంభంలో రష్యా-ఉక్రెయిన్ వివాదం చెలరేగిన సమయంలో పాటిల్ సెవెరోడోనెట్స్క్‌లోని స్వావ్‌టోవ్‌లో బాంబు దాడికి గురైన ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అయితే అతను రెండు సంవత్సరాల క్రితం కీవ్‌లోని జంతుప్రదర్శనశాల నుంచి ఈ రెండు అసాధారణ పెంపుడు జంతువులను సంపాదించాడు. అప్పటి నుంచి వాటిని పెంచుకుంటున్నాడు. పాటిల్ తన యూట్యూబ్ చానల్ ద్వారా పెంపుడు జంతువులతో తన ఆసక్తికరమైన జీవితానికి సంబంధించిన అప్‌డేట్‌లను ప్రసారం చేస్తున్నారు.
జాగ్వర్ మగ చిరుతపులి, ఆడ జాగ్వర్ మధ్య అరుదైన హైబ్రిడ్ అని అతను చెప్పారు. అంతరించిపోతున్న జాతులను రక్షించడంలో సహాయపడే బ్రీడింగ్ ప్రాజెక్ట్ కోసం తగినంత నిధులను పొందడం తన కలల ప్రాజెక్ట్ అని తెలిపారు. అయితే యూట్యూబ్‌లోని వీడియోలే లుహాన్స్క్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు రష్యన్ దాడి నుండి అతన్ని రక్షించాయి. ఎందుకంటే అవి అక్కడ ఘర్షణ సమయంలో అతని తటస్థతను నిరూపించాయి. అతని యూట్యూబ్ చానల్‌కు 62,000 మంది సబ్ స్క్రైబర్‌లు ఉన్నారు.
తన పెంపుడు జంతువుల భద్రత కోసం ఏదైనా పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాము ప్రస్తుతం ఉంటున్న పశ్చిమ యూరప్ పొరుగు ప్రాంతంలో గానీ, యూరప్‌లో గానీ, భారతదేశంలో గానీ స్నేహపూర్వక దేశం కోసం చూస్తున్నట్టుగా తెలిపారు. తాను వాటికి అధీకృత యాక్సెస్‌ను కొనసాగించవచ్చా అనేది ప్రధాన సమస్య అని అన్నారు. నిజానికి ఇది చాలా తీవ్రమైన ప్రాజెక్ట్ అని చెప్పారు. భారతదేశంలోని వన్యప్రాణుల నియమాలు, చట్టాల గురించి తనకు ఖచ్చితంగా తెలియదు.. వారు ఇలాంటి వాటిని అనుమతిస్తారో లేదో తనకు అవగాహన లేదని పేర్కొన్నారు.
‘‘ అయితే నా ప్రయత్నాలు ఫలిస్తాయనే ఆశతో ఉన్నాను.. అయితే ముందుగా వాటిని ప్రభుత్వాలు తక్షణ, ప్రభావవంతమైన చర్యతో సాపేక్ష భద్రతకు తరలించాలి. ప్రాథమికంగా ఈ అద్భుతమైన పిల్లులను పెంచడం యొక్క ప్రాథమిక భావన ఈ 'పాంథర్ హైబ్రిడ్‌లను' నిరంతర పెంపకం ద్వారా సంతానోత్పత్తి చేయడం. వారు కోరుకున్న హైబ్రీడ్‌ను తయారు చేస్తారు. బహుశా ఈ రకంలో ఇది మొదటిది. ఆ తర్వాత దానిని పెంచి అడవిలో శాశ్వతంగా ఉంచుతారు’’ అని చెప్పారు. మధ్యతరగతి మనిషిగా, జంతు ప్రేమికుడిగా.. పెద్ద పిల్లులకు ఆహారం, సంరక్షణ కోసం తన పొదుపులో చాలా వరకు ఖర్చయ్యాయని చెప్పారు. ఇప్పుడు ఉక్రెయిన్‌లో వాటిని చూసుకుంటున్న రైతుతో కూడా వాటికి పరస్పరం బంధం ఏర్పడినట్టుగా తెలుస్తోందని అన్నారు.