ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకులకు కేంద్రం షాక్
ఎన్నారైతో పెళ్లి జరిగిన 48 గంటల్లో తప్పక రిజిస్టర్ చేయించాలనే నిబంధన తీసుకొచ్చింది. లేని పక్షంలో వారి వీసా, పాస్‌పోర్టు జారీని నిలిపేస్తామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ గతంలోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు చేపట్టారు.
అమ్మాయికి పెళ్లి చేయాలంటే.. ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా.. చాలా మంది తల్లిదండ్రుల చూపు మాత్రం ఎన్ఆర్ఐ సంబంధాలపైనే ఉంటుంది. తీరా ఎన్ఆర్ఐ కి ఇచ్చి పెళ్లి చేసాక..ఏవైనా ఇబ్బందులు వస్తే.. ఇక్కడ కూర్చొని బాధపడుతుంటారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఎక్కువౌతూనే ఉన్నాయి. అందుకే.. కేంద్ర ప్రభుత్వం ఇలాంటివారికి షాక్ ఇచ్చింది.
ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల వ్యవహారంలో వరకట్న వేధింపులు, మహిళల హత్యోదంతాలు తరచూ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైతో పెళ్లి జరిగిన 48 గంటల్లో తప్పక రిజిస్టర్ చేయించాలనే నిబంధన తీసుకొచ్చింది. లేని పక్షంలో వారి వీసా, పాస్‌పోర్టు జారీని నిలిపేస్తామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ గతంలోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు చేపట్టారు.
భార్యలను వదిలేసి తప్పించుకు తిరుగుతున్న ఎనిమిది మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులను రద్దు చేసినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి తెలిపారు.ఎన్నారై మోసాలను అరికట్టేందుకు నియమించిన కమిటీకి ఇప్పటి వరకు 70 ఫిర్యాదులు అందినట్టు సదరు అధికారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈమేరకు సదరు వ్యక్తులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు.
ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో జరుగుతున్న మోసాలను అరికట్టే దిశగా కేంద్ర మహిళా సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఏడు రోజుల్లోగా పెళ్లి ధ్రువీకరణ పత్రం అందజేయకపోతే సదరు జంటకు వీసా, పాస్‌పోర్టు జారీ చేసేందుకు నిరాకరిస్తామని సంబంధిత శాఖ పేర్కొంది.
అదే విధంగా ఎస్క్రో (వివాహం తర్వాత భార్యను తీసుకెళ్తానని మూడో వ్యక్తి సమక్షంలో పత్రము రాసుకుని ఆ తర్వాత అది చెల్లదని తప్పించుకోవడం) కేసుల్లో భార్యను వదిలేసి పారిపోయే ఎన్నారైల ఆస్తులను జప్తు చేస్తామని కేంద్రం హెచ్చరించింది. అంతేకాకుండా తగిన శిక్షలు కూడా ఉంటాయని పేర్కొంది.