అమెరికాలో కాల్పుల కలకలం.. తెలుగు యువకుడు మృతి..
అమెరికాలో దోపిడి దొంగలు మరోసారి రెచ్చిపోయారు. దోపిడి చేసేందుకు వచ్చిన దుండగులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు. అలాబామా (Alabama) రాష్ట్రంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
అమెరికాలో దోపిడి దొంగలు మరోసారి రెచ్చిపోయారు. దోపిడి చేసేందుకు వచ్చిన దుండగులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు. అలాబామా (Alabama) రాష్ట్రంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన యువకుడిని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన 27 ఏళ్ల సత్యకృష్ణ చిట్టూరి (Satya Krishna Chitturi)గా గుర్తించారు. వివరాలు.. సత్యకృష్ణ చిట్టూరి (27) గతేడాది వివాహం అయ్యింది. అతని భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అయితే అమెరికాలో ఉన్నత విద్య చదవాలనే లక్ష్యంతో గత నెల అమెరికాకు వెళ్లాడు. అలాబామాలోని old Birmingham హైవేను అనుకున్న ఉన్న ఓ క్రౌన్ సర్వీస్ స్టేషన్ స్టోర్‌లో సత్యకృష్ణ క్లర్క్‌గా పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు.
గురువారం రాత్రి దోపిడి దొంగలు బెదిరించి దోపిడీకి పాల్పడి కాల్పులు జరిపారు. దీంతో సత్యకృష్ణ అక్కడికక్కడే మృతిచెందినట్టుగా అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. ఇక, సత్యకృష్ణపై కాల్పులు జరిపిన నిందితుడి ఫొటోలను సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసు శాఖ విడుదల చేసింది. అనుమానితుడు నల్లటి చొక్కా ధరించి ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాడని తెలిపింది. ప్రజలకు ఏదైనా సమాచారం ఉంటే తల్లాడేగా కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించమని అలబామా సిటీ ఆఫ్ కలేరా పోలీస్ డిపార్ట్‌మెంట్ కోరింది.
సత్యకృష్ణ మరణవార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. సత్యకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని అతని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
అమెరికాలో దుండగుల కాల్పుల్లో విశాఖకు చెందిన తెలుగు విద్యార్థి చట్టూరి సత్యకృష్ణ మృతిచెందడం బాధకరమని బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. నెలరోజుల క్రితమే ఉన్నత విధ్యకోసం అమెరికా వెళ్ళిన విద్యార్థి కుటుంబానికి తగు సహయం రాష్ట్ర ప్రభుత్వం తరుపున అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.