న్యూఢిల్లీ:వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా 21 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ కూడ కీలకపాత్ర పోషించనుంది.ఈ కూటమికి ఎక్కువ స్థానాలు వస్తే కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి అనే చర్చ సాగుతోంది.

2019 ఎన్నికల్లో బీజేపీని కేంద్రంలోకి అధికారంలోకి  రాకుండా కట్టడి చేసేందుకు ఈ 21 పార్టీలు  ప్లాన్ చేస్తున్నాయి. ఈ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కీలకంగా వ్యవహరించారు.

ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ కూడ భాగస్వామ్యంగా మారింది. ఇప్పటికే ఈ కూటమి నేతలు రెండు దఫాలు సమావేశమయ్యారు. త్వరలో మరోసారి సమావేశం కానున్నారు.

ఈ కూటమిలో బలంగా ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో  ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా  కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండానే  ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. కొన్ని  రాష్ట్రాల్లో  కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూడ పోటీ చేసే చాన్స్ ఉంది.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకొన్నాయి. కానీ, ఆశించిన ఫలితం ఈ కూటమికి రాలేదు.

దీంతో ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండానే టీడీపీ పోటీ చేయనుంది. రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసినా దేశ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని  కాంగ్రెస్ పార్టీ కూటమిలోనే ఈ పార్టీలు కొనసాగనున్నాయి.

ఈ కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారనే చర్చ కూడ సాగుతోంది. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధానిగా అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. అయితే అదే సమయంలో  బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడ ప్రధాని పీఠంపై కన్నేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ అవకాశం దక్కితే ఆమె వదులుకొనేందుకు సిద్దంగా ఉండకపోవచ్చు.

ఇక టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మాత్రం తనకు ప్రధానమంత్రి పదవి అవసరం లేదని చెప్పారు. రాష్ట్రాన్ని  వదిలి వెళ్లబోనని ప్రకటించారు. కర్ణాటకకు చెందిన దేవేగౌడ గతంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపాడు. అయితే దేవేగౌడకు ఈ పదవి ఇచ్చేందుకు కూటమిలోని అన్ని పార్టీలు ఈ తరుణంలో సంసిద్ధంగా ఉంటాయా అనే చర్చ కూడ లేకపోలేదు.

మరో వైపు శరద్ పవార్ లాంటి నేతలు కూడ అవకాశం వస్తే ప్రధాని పీఠం ఎక్కేందుకు సై అంటున్నారు. అయితే ప్రస్తుతం పాక్, ఇండియా మధ్య యుద్ధ వాతావరణం కూడ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.