న్యూఢిల్లీ: 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కంటే  21 పార్టీల కూటమికి మెజారిటీ సీట్లు వస్తే పశ్చిమబెంగాల్  సీఎం మమత బెనర్జీ ప్రధానమంత్రి పదవిపై కన్ను వేసినట్టుగా ప్రచారం సాగుతోంది.  అయితే ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్ధిపై నిర్ణయం తీసుకొంటామని ఈ పార్టీల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.

2019 పార్లమెంట్ ఎన్నికలకు త్వరలోనే  ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దేశంలోని ఎన్డీఏకు వ్యతిరేకంగా 21 పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి.  ఈ పార్టీల కూటమిలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా ఉంది. ఈ కూటమిలో టీఎంసీ, టీడీపీ, ఎన్సీపీ, నేషననల్ కాన్పరెన్స్ , జేడీయూ లాంటి పార్టీలు ఉన్నాయి.

ఈ కూటమిలో కీలకమైన నేతలు ఉన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ,  రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు, మమత బెనర్జీ, శరద్ పవార్ లాంటి నేతలు ఈ కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్నారు.

2014 ఎన్నికల్లో మిత్రపక్షాల  అవసరం లేకుండానే స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనే విధంగా  బీజేపీకి ఎంపీ సీట్లు దక్కాయి. అయితే ఈ దఫా బీజేపీకి కనీస మెజారిటీకి కొంత తక్కువగా సీట్లు దక్కే అవకాశం ఉందని ఇటీవలనే కొన్ని సర్వే సంస్థలు ప్రకటించాయి.

అయితే ఈ సర్వే ఫలితాలు వచ్చిన తర్వాత పాక్‌పై ఇండియా సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడింది. దీంతో రాజకీయ  పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం కూడ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బెంగాల్ రాష్ట్రంపై బీజేపీ కన్ను వేసింది. ఈ రాష్ట్రం నుండి ఎక్కువ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది. అయితే బీజేపీకి రాష్ట్రంలో ఎక్కువ సీట్లు రాకుండా ఉండేలా  టీఎంసీ  ప్రతి వ్యూహలను రచిస్తోంది.

2014 పార్లమెంట్ ఎన్నికల్లో  బెంగాల్ రాష్ట్రంలో 34 ఎంపీ స్థానాలను టీఎంసీ కైవసం చేసుకొంది. బీజేపీకి, సీపీఎంకు రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడ మమత రెండోసారి బెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం  మమత వ్యూహత్మకంగా అడుగులు  వేస్తోంది.  ఈ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా  రాజకీయంగా తన పట్టును మరింత పెంచుకోవాలని దీదీ పావులు కదుపుతోంది. బెంగాల్ రాష్ట్రం నుండి ఎక్కువ ఎంపీ స్థానాలను దక్కించుకొంటే ఎన్డీఏ కంటే  ఎక్కువగా 21 పార్టీల కూటమి ఎంపీ స్థానాలను దక్కించకొంటే ప్రధాని పదవిపై పట్టుబట్టవచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

ప్రధాని పదవిని దక్కించుకొంటే  రాష్ట్రానికి మరిన్ని నిధులను అందించడంతో పాటు పార్టీని కూడ మరింత బలోపేతం చేయవచ్చని కూడ ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.  అయితే  బీజేపీయేతర పార్టీలన్నింటిని కూడగట్టడంలో  ఈ కూటమి నేతలు వైఫల్యం సక్సెస్ కాలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

బీజేడీ, టీఆర్ఎస్, ఎంఐఎం లాంటి పార్టీలు ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంట్‌లకు దూరంగా ఉంటున్నాయి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత  రాజకీయ పరిణామాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అవకాశం వస్తే మాత్రం ప్రధాని పదవిని వదులుకొనేందుకు మమత సిద్దంగా లేరని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.