కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి  లోక్ సభ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఓటర్లు సహకరిస్తే మరోసారి కన్నడ వ్యక్తి ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నాడని పేర్కొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జేడిఎస్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేలా సహకరించాలని కుమార స్వామి ప్రజలను కోరారు. 

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కర్ణాటకలోని అధికార జేడిఎస్-కాంగ్రెస్ కూటమి కూడా ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కుమార స్వామి తాజాగా ఓ కార్యక్రమంలో లోక్ సభ ఎన్నికలపై స్పందిచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1996 లో కర్ణాటకలో 16 లోక్ సభ స్థానాలు గెలిచిన జేడిఎస్ పార్టీ ప్రధాని పదవిని దక్కించుకుందన్నారు. ఇలా అప్పటి జేడిఎస్ అధినేత దేశ  దేవె గౌడ ప్రధాని అయ్యారని  గుర్తుచేశారు. అదే మాదిరిగి ఈసారి జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 28 ఎంపీ స్ధానాల్లో జేడిఎస్-కాంగ్రెస్ మిత్ర పక్షాలకు 20-22 సీట్లు వచ్చినా కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో వుంటామన్నారు. అందువల్ల ప్రధాని పదవిని కర్ణాటకకు చెందిన ఎంపీని వరించినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదని కుమార స్వామి స్పష్టం చేశారు.