న్యూఢిల్లీ: భారత ఆటో రంగం వ్యవస్థాత్మకసమస్యను ఎదుర్కొంటోందని టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ (టీకేఎం) వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ పేర్కొన్నారు. పెరిగిపోతున్న వాహన ధరలు ప్రధాన సవాలుగా మారాయని, వాటి కారణంగా డిమాండ్‌ తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి బీఎస్‌-6 నిబంధనలు అమల్లోకి రానుండటంతో వాహన ధరలు మరింతగా పెరిగి, అమ్మకాలు మందగిస్తాయన్నారు.

దీంతో ఆటో రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొనే అవకాశముందని టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ (టీకేఎం) వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వాహన నాణ్యత, ఉత్పాదకత మాత్రమే ఆటోమొబైల్‌ సంస్థల చేతిలో ఉంటాయని, డిమాండ్‌ను నిర్ధారించేది మాత్రం ఆర్థిక వృద్ధేనని విక్రమ్‌ స్పష్టం చేశారు.

దేశీయ ఆటో రంగంలో నెలకొన్న మందగమనం, మార్కెట్‌లో పడిపోయిన వాహన విక్రయాల నేపథ్యంలో టయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం).. తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. కర్నాటకలోని బిదాడి ఉత్పాదక కేంద్రంలో దీన్ని అమలు పరుస్తున్నారు

గత నెల 22న మొదలైన ఈ నవ జీవన యోజన స్కీం.. ఈ నెల 23 వరకు నెల రోజులపాటు అందుబాటులో ఉంటుందని టీకేఎం వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇది పూర్తిగా స్వచ్చంధమని, టీకేఎం మార్కెట్ పరిస్థితులకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని సంస్థ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ పీటీఐకి స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా టీకేఎంకు దాదాపు 6,500 మంది ఉద్యోగులున్నారు. బిదాడిలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. 3.10 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యం వీటి సొంతం. జపాన్‌కు చెందిన టయోటా, భారత్‌కు చెందిన కిర్లోస్కర్ గ్రూప్ కలిసి టీకేఎంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

గత నెల టయోటా అమ్మకాలు 16.56 శాతం క్షీణించి 10,911 యూనిట్లకు పరిమితం అయ్యాయి. కిందటి నెల హీరో మోటోకార్ప్ సైతం వీఆర్‌ఎస్‌ను అమల్లోకి తేవడం గమనార్హం.