‘ఆహారం ఎక్కడ నుంచి లభిస్తుంది’ అన్న ప్రశ్నకు ఒక పాఠశాల పిల్లాడి జవాబు.. ‘ఇల్లు, హోటళ్లు, స్విగ్గీ, జొమాటో యాప్‌లు’ అని ఉంది. ఇటీవల వాట్సాప్‌లో ఇటీవల ఫార్వార్డైన జవాబిది. ఇదీ ప్రస్తుతం నగరాల్లో నెలకొన్న పరిస్థితి. 

ఇంటికి అకస్మాత్తుగా బంధువులు వస్తేనే కాదు.. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే, మధ్యాహ్నం ఆఫీసులకు.. రాత్రి ఇంటికి చేరే సరికి వేడివేడిగా, కోరిన రుచులు, నచ్చిన హోటల్‌ నుంచి తెప్పించుకునేందుకు ‘ఆహార సరఫరా సేవల యాప్‌’లను ఆశ్రయిస్తున్నారు. 

విద్యార్థులు, యువత కూడా ఇంటి వంటకాల కంటే, హోటల్‌ రుచులపై మక్కువ చూపడం కూడా ఈ యాప్‌లకు ఆదరణ పెరిగేందుకు కారణమవుతోంది. ఉదయం టిఫిన్ మొదలు, లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ వరకు ఆహార సరఫరా యాప్‌లపై ఆధార పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 

స్విగ్గీ, జొమాటో, ఫుడ్‌పాండా, ఉబర్‌ఈట్స్‌ తొలుత మహా నగరాల్లోనే సేవలందించిన ఈ సంస్థలు క్రమంగా మొదటి, రెండో శ్రేణి నగరాలకూ తమ సేవలు విస్తరిస్తున్నాయి.మూడవ, నాలుగవ శ్రేణి నగరాలు, పట్టణాలకు చేరేందుకు స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా, ఉబర్ ఈట్స్ తదితర యాప్స్ సంస్థలు శరవేగంగా సన్నద్ధమవుతున్నాయి. 

స్థానిక హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలతో ఒప్పందం చేసుకుని, తమ ఖాతాదార్లకు సరఫరా చేస్తున్నాయి. తొలుత ఈ యాప్‌లు రాయితీలు అధికంగా ఇచ్చినా, క్రమంగా తగ్గించేశాయి. ఇప్పుడు ఆర్డరు ఇచ్చిన వారి నుంచి సర్వీస్‌ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నాయి. 

కొన్ని సందర్భాల్లో రెస్టారెంట్లలో వాస్తవ ధరల కంటే, ఆహార సరఫరా యాప్‌లలో ధరలు అధికంగా చూపుతూ, కొంతమేర రాయితీ ఇస్తున్నట్లు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. పేటీఎం, అమెజాన్‌పే, ఫోన్‌పే వంటి యూపీఐ ఆధారిత చెల్లింపుల సేవల యాప్‌లతో కనుక చెల్లింపులు జరిపితే, కొంత నగదు వాపసు వస్తోంది కూడా.
 
130 కోట్ల మంది జనాభా గల దేశంలో మధ్యతరగతి ఆదాయ వర్గం పెరుగుతోంది. ఆహార అలవాట్లు మారుతున్నాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవడం అధికమవుతోంది. అయితే ‘చెల్లించే పైసాకు కచ్చిత విలువ’ పొందాలనుకునే దేశీయుల మనస్వత్వాన్ని అర్థం చేసుకునే, ఆహార సేవల యాప్‌లు కూడా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 

పేరున్న హోటళ్లు/రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లకు తక్కువ రాయితీ ఇస్తున్నా, అంతగా ప్రాచుర్యం లేని రెస్టారెంట్ల నుంచి అయితే ఎక్కువ రాయితీ ఆఫర్‌ చేస్తున్నారు. సాయంత్రం స్నాక్స్‌ను అలవాటు చేసేందుకు, భారీమొత్తం ఆఫర్లు ఇస్తున్నారు. 

2023కు దేశంలోని హోటళ్ల నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా కస్టమర్లకు చేరే ఆహార పదార్థాల విలువతో పోలిస్తే, ఆహారసేవల యాప్‌ల ద్వారా అందే పదార్థాల విలువే అధికంగా ఉంటుందనేది డేటా విశ్లేషకుల అంచనా.

అప్పటికి హోటళ్ల నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్లతో ఇళ్లకు చేరే ఆహార విలువ రూ.43,400 కోట్లకు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అందే ఆహార విలువ రూ.44,300 కోట్లకు చేరుతుందన్నది అంచనా.

స్విగ్గీ, జొమాటో ఆధిపత్యం వహిస్తున్న ఆహార సేవల యాప్‌ల జాబితాలో ఇప్పుడు అమెజాన్‌ కూడా చేరబోతోందని సమాచారం. ఉప్పు నుంచి రిఫ్రిజరేటర్‌ దాకా.. ఇంటిలోకి కావాల్సిన వస్తువులు, నిత్యావసరాలు విక్రయిస్తూ, వీడియో-ఆడియో స్ట్రీమింగ్‌ సేవలు అందిస్తున్న అమెజాన్‌ను ఆహార సరఫరా సేవల్లో ఉన్న భారీ అవకాశాలే ఆకర్షిస్తున్నాయి.

ఇందువల్ల రోజువారీ లావాదేవీలు మరింత అధికంగా, వ్యాపార టర్నోవర్‌ భారీగా నమోదవుతుందన్నది అమెజాన్ సంస్థ అంచనా. ఆహార సరఫరా సేవలకు ఉన్న అపరిమిత, అపార అవకాశాలు ఉన్నాయని గమనించినందునే, అమెజాన్‌ నేరుగా ఈ సేవలు ప్రారంభించాలనుకుంటోందని ప్రముఖ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

ఇందుకోసం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆరంభించిన కాటమారన్‌ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంటోందని సమాచారం. వచ్చే పండుగ సీజన్‌లోనే అమెజాన్‌ ఆహార సరఫరా సేవలకు శ్రీకారం చుడుతుందనీ చెబుతున్నారు.

 ప్రస్తుతం దేశీయంగా నాస్పర్స్‌, టెన్సెంట్‌ ఆర్థికసాయం పొందుతున్న స్విగ్గీ, సెకోసియా సాయం అందుకుంటున్న జొమాటో ఈ సేవల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, పోర్చుగల్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, లెబనాన్‌, టర్కీ, ఫిలిప్సీన్‌, ఇండోనేషియాలకూ జొమాటో తన సేవలు విస్తరించింది.

2017లో ప్రారంభమైన ఉబర్‌ టెక్నాలజీస్‌కు చెందిన ఉబర్‌ఈట్స్‌, ఓలాకు చెందిన ఫుడ్‌పాండా ఈ స్థాయిలో పోటీ పడలేకపోతున్నాయి. దేశీయంగా ఉబర్‌ఈట్స్‌ను కొనుగోలు చేసేందుకూ అమెజాన్‌ ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

అమెరికాలో ఆహార సరఫరా సేవలను అమెజాన్‌ 2015లో ప్రారంభించినా, పోటీ తట్టుకోలేక జూన్‌లో నిలిపేసింది. ఈ సేవలను లండన్‌కు విస్తరించినా, గతేడాదే ఆపేసింది. మెకన్సీ నివేదిక ప్రకారం 2011 నుంచీ ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరా సేవల్లో 3.7 శాతం వార్షిక వృద్ధి లభిస్తోంది.

అమెజాన్‌ అయినా.. ఏ పోర్టల్‌ అయినా అత్యధికులు కొనుగోలు చేసేది మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, నిత్యావసరాలు, ఫ్యాషన్‌ ఉత్పత్తులు. అయితే వీటిని నెలలో ఒకటి, రెండు సార్లకు మించి కొనేవారు తక్కువ. అదే ఆహార సరఫరా సేవలు ప్రారంభిస్తే, మరింత అధికంగా పోర్టల్‌ను అత్యధికులు సందర్శిస్తారని అమెజాన్‌ అంచనా. 

ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌కు కోటి మంది చందాదారులు ఉన్నారు. దీనికి ఆహార సరఫరా సేవలు జత కలిస్తే, మరింతమంది ‘చురుకైన వినియోగదారులు’ లభిస్తారన్నది అంచనా. చందాదార్ల సంఖ్యతో పాటు రోజువారీ లావాదేవీలు కూడా భారీగా పెరిగే వీలుంది.

దేశీయంగా 200 నగరాల్లో జొమాటో సేవలందిస్తోంది. 1.5 లక్షల హోటళ్ల నుంచి 2.3 లక్షల మంది సరఫరాదార్ల (డెలివరీ ఉద్యోగుల) సాయంతో వినియోగదార్లకు సేవలందుతున్నాయి. వచ్చే నెలకల్లా 500 నగరాలకు విస్తారిస్తామని ప్రకటించింది. 

దేశీయంగా స్విగ్గీ 185 నగరాలలో సేవలందిస్తోంది. 4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.28వేల కోట్లు) విలువ కలిగిన ఈ సంస్థ కొత్తగా ఇంటిలో తయారైన ఆహారం, తాజా కూరలు, నిత్యావసరాల సరఫరాల్లోకీ ప్రవేశిస్తోంది.

2023 నాటికి వినియోగదారులకు ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా ఆహారం సరఫరా చేయడంతో హోటళ్లు, ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్‌లకు రమారమీ రూ.90 వేల కోట్లు ఉంటుందని అంచనా.

2017లో ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లకు రూ.13,100 కోట్ల ఆదాయం సమకూర్చిన ఈ వ్యాపారంతో ప్రస్తుతం రూ.23,800 కోట్లకు చేరింది. అదే హోటళ్ల విషయానికి వస్తే రెండేళ్ల క్రితం రూ.20,500 కోట్ల నుంచి రూ.30,300 కోట్ల ఆదాయానికి చేరుకున్నది.