25శాతం తగ్గింపు?: కేబుల్-డీటీహెచ్ సంస్థలకు ట్రాయ్ వార్నింగ్
నూతన డీటీహెచ్ నిబంధనలను అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేబుల్ -డీటీహెచ్ సంస్థలను ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ హెచ్చరించారు. టీవీ వీక్షకుల ఇంటరెస్ట్‌కు అనుగుణంగా సర్వీసులు అందుబాటులోకి తేవాలే తప్ప బలవంతంగా రుద్ద రాదని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: టీవీ చానళ్లకు వసూలు చేయాల్సిన చార్జీలపై తాము ఇచ్చిన నూతన నిబంధనలను పాటించని కేబుల్-డీటీహెచ్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని భారతీయ టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) హెచ్చరించింది. చందాదార్ల నిర్వహణతోపాటు ఆయా సంస్థల ఐటీ వ్యవస్థలు ఎలా ఉన్నాయో కూడా త్వరలో ఆడిట్ చేస్తామని ట్రాయ్ ఛైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు.
చందదార్ల ఎంపిక, వారి ఆసక్తి మేరకే ప్రసారాలు జరపాలని, ఈ విషయంలో చర్చలకు తావు లేదని ట్రాయ్ ఛైర్మన్ ఆర్.ఎస్.శర్మ స్పష్టం చేశారు. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే, తదుపరి పరిణామాలకు సిద్ధమవ్వాల్సిందేనని పేర్కొన్నారు.
చందాదార్లు తమకు కలుగుతున్న అసౌకర్యంపై ఫిర్యాదు చేస్తున్నారని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. తమకు కావాల్సిన చానళ్లు మాత్రమే ఎంచుకునేలా డిస్ట్రిబ్యూటర్ల సాఫ్ట్‌వేర్, సిస్టమ్స్ ఉండటం లేదన్నారు.
అసలు కొత్త విధానం ప్రవేశపెట్టిందే అందుకు. చానళ్ల ఎంపిక అవకాశాలకు ఆటంకం ఏర్పరచి, కొన్నింటిని కలిపి ఒకే బృందంగా తీసుకోవాలనడం సరికాదని, ఇది నిబంధనలను అతిక్రమించడమేనని ఆర్ఎస్ శర్మ స్పష్టం చేశారు. వినియోగదారులు కావాలనుకున్న ఇలాంటి ప్యాక్‌లను తీసుకోవచ్చు. అయితే చానళ్లను విడిగా కావాలనుకుంటే, ప్రసారం చేయాల్సిందేన్నారు.
ఇప్పటికే దీనిని అతిక్రమించిన 9 కంపెనీలకు సూచనలు, అయిదుగురు డిస్ట్రిబ్యూటర్లకు షోకాజ్ జారీ చేశామని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ వివరించారు. ఇక ముందు కూడా మారకపోతే కఠినచర్యలకు ఉపక్రమిస్తామని, ఆయా సంస్థల తీరును పరిశీలించేందుకు ఆడిటింగ్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుంటున్నామని శర్మ వెల్లడించారు.
జీటీపీఎల్ హాత్‌వే, సిటీ నెట్‌వర్క్స్, ఫాస్ట్‌వే ట్రాన్స్‌మిషన్స్, డెన్ నెట్‌వర్క్స్, ఇండస్‌ఇండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్, హాత్‌వే డిజిటల్ కేబుల్ సంస్థలు నిబంధనలు అతిక్రమించాయని ట్రాయ్ పేర్కొంది. గమ్మత్తేమిటంటే నూతన నిబంధనల వల్ల కేబుల్ టీవీ చార్జీలు స్థూలంగా 25 శాతం తగ్గాల్సి ఉంటుంది. కానీ, కొన్ని రోజుల తర్వాత కేబుల్ టీవీ చార్జీలు పెరుగడాన్ని ట్రాయ్ గుర్తించింది. ఫలితంగా 90 శాతం టీవీ వీక్షకులు సగం టీవీ చానెళ్లను తగ్గించి వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాయ్ హెచ్చరికలు జారీ చేసింది.