Asianet News TeluguAsianet News Telugu

ఇక చౌక ధరలకే ‘ఐఫోన్లు’! చెన్నై కేంద్రంగా ఫాక్స్‌కాన్ ఉత్పత్తి

పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఆపిల్ ఐఫోన్లను భారతదేశంలోనే ఉత్పత్తి చేసే అవకాశాలు మెరుగయ్యాయి. ఇందుకోసం తైవాన్ కేంద్రంగా పని చేస్తున్న ఫాక్స్‌కాన్‌ సంస్థ చెన్నై కేంద్రంగా గల యూనిట్‌లో పెద్దమొత్తంలో తయారీకి సన్నాహాలు చేస్తోంది.

Mass production of iPhones to start in India, a shift from China
Author
Chennai, First Published Apr 16, 2019, 10:57 AM IST

చెన్నై: దేశీయంగానే ఆపిల్ ‘ఐఫోన్ల’ తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఛైర్మన్‌, వ్యవస్థాపకుడు టెర్రీ గౌ స్పందిస్తూ చెన్నై సమీపంలోని తమ ప్లాంట్‌లో  అన్ని మోడల్ ‘ఐఫోన్లు’ ఈ ఏడాదిలో భారీగా తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.  

ప్రస్తుతం బెంగళూరు సమీపంలోని ప్లాంట్‌లో పరిమితంగా, కొన్ని పాత ఐఫోన్ మోడళ్లు మాత్రమే తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. యాపిల్‌కు ఐఫోన్లను ఈ తైవాన్‌ కంపెనీ కాంట్రాక్టు పద్ధతిలో భారీఎత్తున తయారు చేస్తున్నది. 

భారత్‌లో విస్తరణ ప్రణాళికల అమలుకు ప్రధాని నరేంద్రమోదీ తనను ఆహ్వానించినట్లు ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఛైర్మన్‌, వ్యవస్థాపకుడు టెర్రీ గౌ చెప్పారు. యాపిల్‌ ఐఫోన్ల ఇటీవలి మోడళ్లు సహా అత్యధికం చెన్నై ప్లాంట్‌లోనే తయారు చేస్తామని తెలిపారు. తొలుత ప్రయోగాత్మకంగా అసెంబ్లింగ్‌తో ప్రారంభిస్తామన్నారు. 

పరిస్థితులు బాగుంటే పూర్తిస్థాయిలో చేపడతామని తైవాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఛైర్మన్‌, వ్యవస్థాపకుడు టెర్రీ గౌ వివరించారు. భారత స్మార్ట్‌ఫోన్‌ విపణిలో తాము కీలకపాత్ర పోషించనున్నామన్నారు. తైవాన్‌ నుంచి ఉత్పత్తిని భారత్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు. 

ఐఫోన్ల తయారీ, సామర్థ్య విస్తరణ కోసం భారత్‌లో 300 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2,000 కోట్ల) పెట్టుబడిని ఫాక్స్‌కాన్‌ పెట్టనుందని సమాచారం. షరతులు, లభించే ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ ఛైర్మన్‌, వ్యవస్థాపకుడు టెర్రీ గౌ చెప్పారు.

ప్రస్తుతం అత్యున్నత సాఫ్ట్‌వేర్‌ నిపుణులు 12 మంది భారత్‌లో తమకు ఉన్నారని, వీరి సంఖ్యను 600కు పెంచుతామని తెలిపారు. దేశీయంగా సొంత స్టోర్స్‌నూ యాపిల్‌ ప్రారంభించాలంటే, తయారీలో 30 శాతం విడిభాగాలను స్థానికంగా సమీకరించాల్సి ఉంది. 

భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల వృద్ధి అధికంగా ఉండగా, చైనాలో నిలిచిపోయింది. చైనాలో ఐఫోన్ల సంస్థ ఆపిల్‌ వాటా తగ్గుతూ, హువావె, షియోమీ అమ్మకాలు పెరుగుతున్నాయి. భారత్‌లో ప్రస్తుతం ఆపిల్‌ వాటా చాలా తక్కువ. 

అధిక మోడళ్లను దిగుమతి చేసుకుని, విక్రయిస్తున్నందున, ధరలు అధికంగా ఉంటున్నాయి. అదే దేశీయంగా తయారు చేస్తూ, 20 శాతం వరకు దిగుమతి సుంకం కలిసివచ్చి, ధరలు తగ్గుతాయి. అందువల్ల భారత్‌లో అమ్మకాలు పెంచుకోవచ్చని ఆపిల్‌ భావిస్తోంది.

 భారత్‌తో పోలిస్తే చైనాలో కార్మిక వ్యయాలు కూడా 3 రెట్లు అధికంగా ఉన్నాయని, అందువల్లే ఐఫోన్ల తయారీని భారత్‌కు మార్చేందుకు ఫాక్స్‌కాన్‌ సుముఖత చూపుతోందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ పేర్కొంటోంది. అందువల్లే దేశీయ విపణితో పాటు ఎగుమతికీ భారత్‌ను ఫాక్స్‌కాన్‌ కేంద్రంగా మార్చుకోవచ్చని అంటున్నారు. 

ఫాక్స్‌కాన్‌కు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో సెల్‌ఫోన్ల అసెంబ్లింగ్‌ ప్లాంట్లు ఉన్నాయి. షియోమీ, నోకియా ఫోన్లను ఈ ప్లాంట్లలో బిగిస్తున్నారు. ఇప్పుడు ఐఫోన్ల తయారీ కూడా చేపడితే, ఉత్పత్తుల సంఖ్య అధికం అవుతుంది. 

ఆపిల్‌ సంస్థ ఐఫోన్‌ కొత్త మోడళ్లను ఏటా సెప్టెంబర్‌లో బయటపెడుతుంది. ఆ సమయానికే భారత్‌లో తయారీ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా చైనాను మొబైల్‌ఫోన్ల తయారీకి కేంద్రంగా ఫాక్స్‌కాన్‌ మార్చుకుంది. అతిపెద్ద తయారీ యూనిట్లతో పాటు వందల సంఖ్యలో భాగస్వామి సంస్థలు అక్కడ ఏర్పడ్డాయి. 

ఇప్పుడు ఆపిల్‌ ‘ఐఫోన్ల’ ఉత్పత్తుల తయారీని భారత్‌కు తరలిస్తే, ఈ ప్రభావం చైనాపై ఎంతవరకు పడుతుందో వేచి చూడాల్సిందే. తాజా పరిణామాలను చైనా, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చూడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios